ట్రంప్ గారి గోల్డెన్ ఆఫర్…!

రండి బాబు రండి... మా దేశానికి రండి... మా సిటిజన్ షిప్ తీసుకోండి....! ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉండదు...! ఈ ఆఫర్ ఇస్తున్నది ఎవరో కాదు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 01:20 PMLast Updated on: Feb 28, 2025 | 1:20 PM

Us President Donald Trump Introduced Gold Card Visa

రండి బాబు రండి… మా దేశానికి రండి… మా సిటిజన్ షిప్ తీసుకోండి….! ఇంతకు మించిన బంపర్ ఆఫర్ ఉండదు…! ఈ ఆఫర్ ఇస్తున్నది ఎవరో కాదు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్… ఇన్నాళ్లు ఎవరూ రావొద్దంటూ వేధించిన ట్రంప్ ఇప్పుడు ఇలా మాటమార్చారేంటి అంటున్నారా… ఆయన రూటేం మారలేదు. ఈ ఆఫర్‌కు కండిషన్స్ అప్లయ్ అవుతాయి. అవేంటో ఓ లుక్కేయండి.

మీ దగ్గర కోట్లున్నాయా…? కరెన్సీ కట్టలు మూలుగుతున్నాయా…? అయితే అమెరికాకు వచ్చేయండి అంటున్నారు ట్రంప్. వాడినీ వీడిని బతిమాలాల్సిన పనిలేదు.. వీసాల గొడవ లేదు… ఇమ్మిగ్రేషన్ వాళ్లు పట్టుకుంటారన్న టెన్షన్ లేదు. పే ద మనీ… గెట్ ద సిటిజన్ షిప్.. దటీజ్ అవర్ గోల్డ్‌కార్డ్ స్పెషాలిటీ అంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారు. 5 మిలియన్ డాలర్స్ అంటే 50లక్షల డాలర్లు కట్టండి.. అమెరికన్ సిటిజన్ అయిపోండి అంటూ ఆఫర్ ఇచ్చారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 43.5 కోట్లు ఉంటే చాలు. ఆ వీసా, ఈ వీసా, ఇమ్మిగ్రేషన్ గొడవ అంటూ ఏదీ లేకుండా రాయల్‌గా అమెరికన్ సిటిజన్ అయిపోవచ్చన్నమాట. ఇందులో వేరే కండిషన్స్ ఏమీ లేవు… జస్ట్ మనీ పే చేస్తే చాలు.

ఇప్పటివరకు అమెరికాలో పెట్టుబడి పెట్టేవారికోసం EB-5 వీసా అమలులో ఉంది. అంటే అమెరికన్ సంస్థల్లో 8 నుంచి 10.5లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి కనీసం 10మందికి ఉపాధి కల్పిస్తే గ్రీన్‌కార్డ్ దక్కేది. చాలామంది దీన్ని వినియోగించుకున్నారు. అయితే దానికి ఇప్పుడు కాలం చెల్లింది అంటున్నారు ట్రంప్. అంత చీప్‌గా అమెరికన్ గ్రీన్‌కార్డ్ ఎలా ఇస్తామంటూ ఆ విధానాన్ని చెత్తకుప్పలోకి నెట్టేస్తున్నారు. దానికి రీప్లేస్‌మెంట్‌గా గోల్డ్‌కార్డ్‌ను ప్రపోజ్ చేస్తున్నారు ట్రంప్. 43.5కోట్లు రూపాయలు కడితే వెంటనే గోల్డ్‌కార్డ్ ఇచ్చేస్తారు. ముందుగా 10లక్షల గోల్డ్‌కార్డులు అమ్ముతారు. ఆ తర్వాత దాన్ని కోటికి పెంచుతారు. మరో రెండు వారాల్లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. EB-5 మోసాలను నియంత్రించేందుకే గోల్డ్‌కార్డ్ తీసుకొస్తున్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. తమకు బద్దశత్రువులైన రష్యన్ ఓలిగార్క్స్ అంటే రష్యన్ కుబేరులైనా సరే వెల్‌కమ్ చెప్పేస్తామంటున్నారు ట్రంప్.

అమెరికాలో ప్రస్తుతం గ్రీన్‌కార్డ్స్ విధానం ఉంది. విదేశీయులు ఎవరైనా ఆ దేశంలో శాశ్వతంగా ఉండిపోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి ఈ గ్రీన్‌కార్డ్ ఉపయోగపడుతోంది. అయితే ఇందుకు చాలా ప్రోసీజర్ ఉంటుంది. రకరకాల స్క్రూటినీ ఉంటుంది. కొన్నిసార్లు ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం గ్రీన్‌కార్డ్స్ పెండింగ్ లిస్ట్ కొండవీటి చాంతాడంత ఉంది. అంటే అప్లయ్ చేసుకున్న వారి లైఫ్‌టైమ్‌లో గ్రీన్‌కార్డ్ రాకపోయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాటికి ఈ గ్రీన్‌కార్డ్ విరుగుడు అన్నది అధ్యక్షుల వారి మాట.

ట్రంప్ ఈ విధానం తీసుకురావడం వెనక పెద్ద వ్యూహమే ఉంది. 5మిలియన్ డాలర్లు అంటే 43.5 కోట్లు పెట్టుబడి పెట్టి గోల్డ్‌కార్డ్ కొంటున్నాడంటే అపర కుబేరుడన్నట్లే లెక్క. అలాంటి వ్యక్తి అమెరికాకు కేవలం పనికోసం వెళ్లడు. వ్యాపారం కోసమో లేక అక్కడ సెటిల్ అయిపోవడానికో వెళతాడు. అలా డబ్బు తమ దగ్గర మూలుగుతున్న వ్యక్తులు భారీగానే ఖర్చు చేస్తారు. పన్నులు కడతారు. అక్కడి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంటే వేరే దేశ సంపద అంటా డాలర్ల రూపంలో మళ్లీ అమెరికాకు వెళ్లిపోతుంది. ఇది ఆ దేశాన్ని ధనికదేశంగా మారుస్తుంది. డాలర్ విలువ కూడా పెరిగిపోతుంది. సామాన్యులు కాకుండా కోటీశ్వరులు మాత్రమే తమ దేశ పౌరులు కావాలన్నది ట్రంప్ ఆలోచన. ప్రస్తుత అమెరికాలో భారీగా ద్రవ్యలోటు ఉంది. అంటే ప్రభుత్వానికి భారీగా డబ్బు కావాలి. ఇలా గోల్డ్‌కార్డులు అమ్మడం ద్వారా ఆ లోటు పూడ్చాలన్నది కూడా మరో టార్గెట్. అన్నీ అనుకున్నట్లు జరిగితే 5 ట్రిలియన్ డాలర్లు అంటే 4లక్షల కోట్ల కోట్లు వస్తాయని ట్రంప్ లెక్కకడుతున్నారు. కానీ ఎక్స్‌పర్ట్స్ మాత్రం అంత రాదంటున్నారు.

సంపన్నుల కోసమే ఈ గోల్డ్‌కార్డ్ తెచ్చినట్లు వస్తున్న విమర్శలపైనా ట్రంప్ స్పందించారు. భారత్ సహా పలుదేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హార్వర్డ్, వార్డన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి వాటిల్లో చదివిన విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నతస్థానాల్లో ఉంటున్నారని… అలాంటి వారు తమ దగ్గర పనిచేయాలనుకుంటే కంపెనీలే వారి తరపున గ్రీన్‌కార్డ్ కొనుక్కోవచ్చంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. సరైన పత్రాలు లేకుండా ఉంటున్న వారిని ఇప్పటికే దేశం నుంచి తరిమేస్తున్నారు. దీంతో విదేశీయుల్లో భయం పెరిగిపోయింది. ఆ భయాన్ని ఇలా క్యాష్ చేసుకుంటోంది అమెరికా. ఎందుకొచ్చిన తంటా డబ్బులు కట్టేసి ఆ కార్డేదో కొనేస్తే పోలా అని సంపన్నులు ప్లాన్ చేసుకుంటున్నారు.

ట్రంప్ ఏది చేసినా అమెరికా ఫస్ట్ అన్న యాంగిల్‌లోనే చేస్తున్నారు. ఈ గోల్డ్‌కార్డ్ వెనక వ్యూహం కూడా అదే. ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమన్నా బందులదొడ్డా ట్రంప్ అడ్డా అంటున్నారు. సొమ్ములున్న వారే రండి ఇక్కడ సోకులు చేయండి అంటూ ఆఫర్ ఇచ్చేస్తున్నారు.