Joe Biden Visit: హమాస్ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో.. ఆసక్తి రేపుతున్న అమెరికా అధ్యక్షుడి పర్యటన

హమాస్ - ఇజ్రాయెల్ యుద్ద పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ సహా చుట్టుపక్కల ప్రదేశాలను పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యూల్ కూడా విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2023 | 01:54 PMLast Updated on: Oct 17, 2023 | 1:54 PM

Us President Joe Bidens Visit Is Interesting Amid The Hamas Israeli War Situation

హమాస్-ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న భీకర యుద్దం గురించి తెలిసిందే. గడిచిన 11 రోజులుగా హద్దూ అదుపూ లేకుండా ఒకరిపై ఒకరు మిలిటెంట్లతో దాడులు చేసుకుంటున్నారు. వీరిద్దరు సృష్టించిన మారణహోమంలో లక్షలాది ఇళ్లు నేలకూలాయి. కనీసం తిండి లేక ప్రజలు బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ తన యుద్దాన్ని ఎక్కడా ఉపసంహరించుకోవడం లేదు. గాజాను తన ఆధీనంలోకి తీసుకుని హమాస్ ను మట్టుపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకు గానూ సరిహద్దుల్లో 3,00,000పైగా సైన్యాన్ని, భారీగా యుద్ద ట్యాంకులను మొహరించింది. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యం అమెరికా నుంచి కీలకమైన ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకూ ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నట్లు సమాచారం. గాజాకు మానవతా దృక్పధంతో సాయం అందించడం కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ వెల్లడించారు.

ఎనిమిది గంటల పాటూ చర్చలు..

ఈ భీకరపోరులో గాజా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. దీనికి సాయం అందించేందుకు ఒక ప్రణాళికను రూపొందించేందుకు ఈ ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. అరబ్ పర్యటనలో ఉన్న బ్లింకన్ అది ముగించుకున్న తరువాత ఇజ్రాయెల్ కి వెళ్లారు. ఆ దేశ ప్రధానితో దాదాపు ఎనిమిది గంటలపాటూ సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి తాజా పరిణామాలు, తీసుకునే చర్యలపై మాట్లాడుకున్నారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుకుని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఇలాంటి వాటిని తిప్పికొట్టి యుద్దాన్ని నిరోధించుకునే హక్కు ఈ దేశ ప్రధానికి ఉందని తెలిపారు.

హమాస్ గురించి పాలస్తీనియన్లతో వివరణ..

ఇలా ఇరువురు చర్చించుకున్న తరువాత బ్లింకెన్ అమెరికా తిరుగుపయనమ్యారు. అక్కడి పరిస్థితుల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించారు విదేశాంగ శాఖ మంత్రి. ఆ తరువాత బైడెన్ స్వయంగా ఇజ్రాయెల్ పర్యటించనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. హమాస్ ఉగ్రమూకల దాడిలో తీవ్రంగా నష్టపోయిన ఇజ్రాయెల్ కు తన సంఘీభావాన్ని తెలిపారు. అందుకే ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి ప్రధానితో భేటీ అయిన తరువాత జోర్దాన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడి నాయకులతో సంప్రదింపులు జరిపేందుకు సిద్దమయ్యారు. పాలస్తీనా వాసుల స్వయం పరిపాలనా అధికారం కోసం హమాస్ నిలబడదనే విషయాన్ని వారికి వివరించనున్నారు.

బందీలుగా 119 మంది ఇజ్రాయెల్ పౌరులు..

ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తున్నందున అక్కడి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన విషయాలపై జో బైడెన్ చర్చలు జరుపుతారని బ్లింకెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హమాస్ ఆధిపత్యంలోని గాజా భూభాగం మొత్తం ఇజ్రాయెల్ సైన్యాన్ని మొహరించి యుద్దానికి సిద్దమౌతున్న వేళ ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి. ఇప్పటి వరకూ ఇరుదేశాల యుద్దంలో గాజాలో 2,700 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. 9700 మంది తీవ్రంగా గాయపడ్డట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. అదే ఇజ్రాయెల్ లో 1,400 మంది ప్రాణాలు విడిచినట్లు అధికారికంగా ప్రకటించింది. త్వరలో ఈ యుద్దం మరింత ఉధృతం అయ్యే అవకాశాలు కనిపించడంతో ఉత్తర గాజాలోని జనం దక్షిణ గాజాకు వలస పోతున్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కి చెందిన 119 మంది పౌరులు హమాస్ ఉగ్రవాదుల చరలో బందీలుగా ఉన్నారు. వీరిని అడ్డం పెట్టుకొని హమాస్ ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో చూడాలి.

T.V.SRIKAR