Kedarnath: ఎక్కడ పడితే అక్కడ గలీజ్ పనులు.. దెబ్బకి తిక్క కుదిరింది..!
పవిత్ర ప్రదేశంలో ఇలాంటి పనులా..? అందుకే ఆలయ అధికారులు తిక్కకుదిర్చే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టెంపుల్‌లో మొబైల్ ఫోన్లను వాడితే వాటిని తీసుకెళ్లి హుండిల్లో వేస్తారు..జాగ్రత్తా..!
దిక్కుమాలిన స్క్రిప్టెడ్ లవ్ ప్రపోజల్స్‌కి గుడి కావాలా..? ప్రేమ పవిత్రమైనదే కావొచ్చు..కానీ భక్తి కూడా స్వచ్ఛమైనదేనని మరువద్దు. ఎంతో భక్తితో, నిష్ఠతో గుడికి వచ్చేవాళ్ల సంఖ్య మనదేశంలో కోట్లలో ఉంటుంది. అందులో కేదార్‌నాథ్ ఆలయానికి ప్రతిఏటా వచ్చేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన యాత్ర. భక్తిశ్రద్ధలతో దేవుడు కోసమే చేసే యాత్ర. అందుకే యాత్ర మధ్యలో ఎన్ని ఆటంకాలొచ్చినా భక్తులు వెనుతిరిగేందుకు ఇష్టపడరు. దైవ దర్శనం కోసం ఎంతటి దూరమైనా ప్రయాణిస్తారు. అక్కడికి వచ్చే వారి మనసు భక్తితో నిండిపోయి ఉంటుంది. అలాంటి ప్రదేశానికి పక్కా ప్లాన్‌తో ఓ రొటిన్ కమర్షియల్ సినిమా స్క్రిప్ట్ రాసుకొచ్చి.. ఒకరు ప్రపోజ్ చేస్తుంటే మరొకరు నటిస్తూ మురిసిపోయి.. హగ్గులు చేసుకుంటే అధికారులు కామ్‌గా కుర్చొవాలా..? అందుకే కఠిన నిబంధనలు తీసుకొచ్చారు ఆలయ అధికారులు..ఇకపై ఆలయ ఆవరణలో భక్తులు ఫోటోలు, వీడియోలు తీయకుండా నిషేధం విధించారు.
అసలేం జరిగిందంటే..?
రెండు వారాల క్రితం ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. పసుపు బట్టలు ధరించిన ఇద్దరు యువతియువకులు గుడి ప్రాంగణంలో ఒకరినొకరు హత్తుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై యూజర్లు రకరకాలుగా స్పందించారు. చాలా మంది వ్యతిరేకించారు. ఎంతో పవిత్రంగా భావించే కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ పక్కనే నిలబడ్డ అమ్మాయి..సైలెంట్‌గా తన చేతుల్లోకి రింగ్‌ని తీసుకుంది. మోకాళ్లపై నిలుచుని ప్రపోజ్ చేసింది. ఆ తరవాత రింగ్ తొడిగింది. ఆ తరవాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఓ వ్లాగర్ ఈ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది. పక్కా స్క్రిప్ట్ అని ఓవైపు అర్థమవుతుండగా..కొంతమంది మాత్రం ప్రేమ దోమా అంటూ ఈ ఇద్దరు చేసినదాన్ని సమర్ధించారు. అయితే ఇదంతా పాపులారిటీ కోసమే చేసినట్టు క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. ఇకపై ఇలాంటివి చేయొవద్దని ఆలయ అధికారులు కుండబద్దలు కొట్టారు.
అసలు గుడిలో కూడా ప్రశాంతత లేదా?
నిజానికి ఆలయాలకు వెళ్లేవాళ్లంతా భక్తులే అవ్వాలని లేదు.. చాలామంది ప్రశాంతత కోసం కూడా వెళ్తుంటారు. రద్దీ సమయాల్లో ఎక్కువగా భక్తులే వస్తారన్న మాట నిజమే అయినా.. మిగిలిన వేళలో కొంతమంది అక్కడి గాలి, వెలుతురు కోసం వస్తుంటారు. మరికొంతమంది గుడి ప్రాంగణంలోనే తమ ఆలోచనలకు పదును పెడుతుంటారు. మనదేశంలో చాలా ఆలయాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు..అందుకే అక్కడ స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అందుకే దేవుడిపై నమ్మకం లేని వాళ్లు కూడా అక్కడికి వెళ్లాలని కోరుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఆలయాలు కూడా ఫొటోలకు, సెల్ఫీలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. కేవలం ఫొటోలు దిగేందుకు..వీడియోలు తీసుకొని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసుకునేందుకు అక్కడికి చాలామంది వస్తుండడం నిజంగా బాధాకరం. తోటి మనుషులతో మాట్లాడే రోజులు పోయి..ఆలయాల్లో కూడా యంత్రాలతోనే మాటలు, చేతలు మొదలయ్యాయి. ఇది కేవలం మతపరంగానే కాదు మానవపరంగా కూడా తప్పు. సాటి భక్తులకు అసౌకర్యం కలిగించే పని చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ గలీజ్ పనులు చేసే వాళ్లకి ఈ విషయం తెలియకపోవచ్చు..అలాంటివారి వాళ్ల చిరాకు, అసహనం తప్ప మరేమీ కలగని దుస్థితి సాటి మనుషులది. కనీసం పవిత్ర ప్రదేశాల్లోనైనా ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా నడుచుకుంటే మంచిది..కేదార్‌నాథ్ ఆలయ అధికారులు నిబంధనల ద్వారా చెప్పాలనుకున్నది ఇదే..!