Bhopal To Delhi: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంటలు.. తప్పిన భారీ ప్రమాదం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Vande Bharat Express, which was leaving from Bhopal to Delhi, caught fire. The passengers got down in fear
భోపాల్ టు ఢిల్లీ వందే భారత్ రైలును ఏప్రిల్ 11న ప్రారంభించారు. ఈ రైలు తెల్లవారుజామున భోపాల్‌లో బయలుదేరి.. మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుతుంది. ఐతే భోపాల్ నుంచి బయలుదేరిన ఈ రైల్లో.. కొద్దిసేపటికే మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తం కావడంతో.. వందేభారత్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కుర్వాయి స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.భోపాల్‌లోని రాణికమలాపాటి స్టేషన్ నుంచి బయలుదేరిన వందేభారత్ రైలు.. కుర్వాయి స్టేషన్ దగ్గరకు చేరుకోగానే C 14 కోచ్ దగ్గర మంటలు చెలరేగాయ్. మంటలను గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే లోకోపైలట్‌ను అప్రమత్తం చేసి రైలును ఆపేశారు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ ప్రకటించింది. తొలుత బ్యాటరీ బాక్సులో మంటలు చెలరేగాయని, ఫైర్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి వాటిని ఆర్పివేశారని పేర్కొంది. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత రైలు బయలుదేరుతుందని వెల్లడించింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటల ఘటన మర్చిపోకముందే..కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వందేభారత్ రైలులోనూ మంటలు చెలరేగడం.. ప్రయాణికులను టెన్షన్ పెడుతోంది. ఇప్పటికైనా రైల్వే శాఖ పగడ్బందీ చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.