హిజ్రాతో యువకుడి ప్రేమ పెళ్లి ఆశీర్వదించిన పెద్దలు.. వాట్ ఏ సీన్..
ప్రేమంటే ఏమంటే.. చెప్పే మాటుంటే అది ప్రేమెందుకు అవుతుందంటాడో సినిమా కవి. ప్రేమ ఎప్పుడు ఎవరిమీద.. ఎలా పుడుతుందో చెప్పే పరిస్థితి ఉండదు. ప్రేమలోని మ్యాజిక్ అదే.
ప్రేమ పేరుతో వికృత చేష్టలు చేసే వాళ్లు ఉన్నా.. ప్రేమకు నిజమైన అర్థం తెలిసిన వాళ్ల కధలు.. ఎప్పుడూ మనసును తడుతూనే ఉంటాయ్. మహబూబాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హిజ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. సమాజం తక్కువ చేసి చూసినా.. మాట్లాడినా.. రకరకాలుగా అవమానించినా.. తన ప్రేమను గెలిపించుకున్నాడు.
గార్ల మండలం మర్రిగూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర హిజ్రాను ఆ యువకుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. డోర్నకల్ సిగ్నల్ తండాకు చెందిన ధరావత్ వీరు.. గార్ల మండలం అంజనాపూరం గ్రామానికి చెందిన బానోత్ రాధిక అనే హిజ్రాను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెద్దలను ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో రాధికను పెళ్లాడిన వీరు.. ప్రేమకు సరికొత్త అర్థం చెప్పాడు. ఈ జంటను రెండు కుటుంబాల సభ్యులు ఆశీర్వ౦దించారు. ఈ పెళ్లి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త చర్చకు దారి తీస్తోంది.