మళ్ళీ కెప్టెన్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ కీలక నిర్ణయం
ఐపీఎల్ మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై కోహ్లీ కూడా సానుకూలంగా స్పందించడంతో ఇక అధికారిక ప్రకటనే మిగిలింది.
ఐపీఎల్ మెగావేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై కోహ్లీ కూడా సానుకూలంగా స్పందించడంతో ఇక అధికారిక ప్రకటనే మిగిలింది. గత సీజన్ లో సారథిగా ఉన్న డుప్లెసిస్ ను ఈ సారి ఆర్సీబీ వేలంలోకి వదిలేస్తోంది. కెప్టెన్ గా డుప్లెసిస్ రికార్డు బాగానే ఉన్నప్పటకీ అతని వయసు రీత్యా రిటైన్ చేసుకునే అవకాశాలు లేవు. దీంతో ఈ సఫారీ క్రికెటర్ స్థానంలో మళ్ళీ కోహ్లీకే జట్టు పగ్గాలు ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తోంది. గతంలో తొమ్మిదేళ్ళ పాటు కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు. 2013 నుంచి 2021 సీజన్ వరకూ సారథిగా జట్టును నడిపించాడు. అయితే 2021లో టీమిండియా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ ఇటు ఐపీఎల్ లోనూ సారథ్య బాధ్యతలను వదిలేశాడు. అప్పట్లో ఆర్సీబీ యాజమాన్యం కోహ్లీనే కొనసాగమని కోరినా అతను మాత్రం ఒప్పుకోలేదు.
వ్యక్తిగత బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. తర్వాత డుప్లెసిస్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. అయితే ఈ సారి మెగావేలంలో ఆర్సీబీ తన జట్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేయబోతోంది. దీనిలో భాగంగానే డుప్లెసిస్ కూ వీడ్కోలు చెప్పబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో మరో ఆటగాడిని సారథిగా నియమించేందుకు ప్లాన్ చేసినా వేలంలో ఈ సారి గట్టిపోటీ ఉండనుంది. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ళు వేలంలోకి రానుండగా… పలు ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఒక దశలో రాహుల్ ను వేలంలో ఎంతైనా ఇచ్చి తీసుకోవాలని ఆర్సీబీ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఉన్న రాహుల్ కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని చాలా మంది ఖాయం చేసేసారు.
చివరికి కోహ్లీ వైపే ఆర్సీబీ యాజమాన్యం మొగ్గుచూపినట్టు సమాచారం. ఆర్సీబీ రిటైన్ జాబితాలో కూడా కోహ్లీ పేరు తప్ప మిగిలిన వారిపై బెంగళూరు ఫ్రాంచైజీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ కోహ్లీ కెప్టెన్సీ రికార్డు బాగానే ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 143 మ్యాచ్ లలో నడిపించిన విరాట్ 66 మ్యాచ్ లలో గెలిపించాడు. 70 మ్యాచ్ లలో ఓటమి ఎదురైంది. 3 మ్యాచ్ లు టైగా ముగిస్తే మిగిలిన వాటిలో ఫలితం తేలలేదు. కాగా కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తున్నారన్న వార్తలు అతని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపాయి. ఆర్సీబీ టైటిల్ కల నెరవేర్చే సత్తా విరాట్ కే ఉందంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రతీ సీజన్ కు ముందు భారీ అంచనాలతో బరిలోకి దిగే ఆర్సీబీ ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. 2024 సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరినా ఎలిమినేటర్ లో నిష్క్రమించింది.