విరాట్ కోహ్లీ ఒక్కడే RCB రిటెన్షన్ లిస్టులో ట్విస్ట్
ఐపీఎల్ మెగా వేలం గడువు దగ్గర పడుతున్న వేళ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ అనుకున్న ప్లేయర్స్ ను పక్కన పెడుతున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొత్తగా ఆటగాళ్ళను తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్ మెగా వేలం గడువు దగ్గర పడుతున్న వేళ ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముందు నుంచీ అనుకున్న ప్లేయర్స్ ను పక్కన పెడుతున్న కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో కొత్తగా ఆటగాళ్ళను తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టు సమాచారం. దీని ప్రకారం బెంగళూరు రిటైన్ జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడి పేరే ఇప్పటివరకూ ఖరారైనట్టు తెలుస్తోంది. మిగిలిన ఐదు పేర్లపై ఆర్సీబీ తర్జన భర్జన పడుతోంది. కోహ్లీని తప్పించి ఇక ఎవ్వరినీ రిటైన్ చేసుకోకుండా వేలంలో తాము టార్గెట్ చేసిన ప్లేయర్స్ ను తీసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో కోహ్లీతో పాటు సిరాజ్, కామెరూన్ గ్రీన్ , రజత్ పటిదార్, యశ్ దయాల్ పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కోహ్లీ తప్పిస్తే మిగిలిన ఆటగాళ్ళందరినీ వేలంలోకి వదిలేసేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. ఈ సారి కర్ణాటక లోకల్ ప్లేయర్స్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఆ ఫ్రాంచైజీపై అక్కడి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో వేలంలో కర్ణాటక యువ ఆటగాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్తగా పలువురు స్టార్ ప్లేయర్స్ ను సొంతం చేసుకునేందుకు ఆర్సీబీ రెడీ అయింది. 2022 మెగావేలానికి ముందు ఆర్సీబీ కోహ్లి , మాక్స్‌వెల్, సిరాజ్ లను మాత్రమే రిటైన్ చేసుకుంది. అయితే గత కొన్ని సీజన్లలో మాక్స్ వెల్ ఫ్లాపయ్యాడు. అలాగే బౌలింగ్ దళాన్ని నడిపిస్తున్న సిరాజ్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. గత రెండు సీజన్లలో అతను 9 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ సర్జరీ చేయించుకుని సీజన్ సమయానికి అందుబాటులోకి వస్తాడా లేదా అనేది కూడా డౌటే. దీంతో వీరందరినీ వేలంలోకి వదిలేసి ఈ సారి వ్యూహాత్మకంగా కొనుగోళ్ళు చేయాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది.
అలాగే వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌తో ఆటగాళ్లను పలువురిని తిరిగి దక్కించుకోవాలని, అలాగే కొత్త ఆటగాళ్లతో జట్టును నిర్మించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించడంతో మరో వికెట్ కీపర్ వేటలో పడింది. అన్నింటికంటే ముఖ్యంగా కొత్త కెప్టెన్ ను కూడా వెతుకోతుంది. డుప్లెసిస్ ను వయసు రీత్యా ఈ సారి రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో వికెట్ కీపర్-కెప్టెన్ బాధ్యతలను మోయగలిగే లోకల్ బాయ్ కేఎల్ రాహుల్‌పై ఆర్సీబీ కన్నేసింది. ఒకవేళ లక్నో సూపర్ జెయింట్స్ రాహుల్ ను రిటైన్ చేసుకోకుంటే వేలంలో ఎంతమొత్తానికైనా అతన్ని దక్కించుకునేందుకు ఆర్సీబీ సిద్ధంగా ఉంది. ఐపీఎల్ మెగావేలానికి ముందు ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోవచ్చు. దీనిలో అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. రూల్స్ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. మొత్తం మీద అక్టోబర్ 31వ తేదీలోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించాలి.