Jyoti Yarraji: ఆసియా అథ్లెటిక్స్ 2023లో స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న జ్యోతి

ప్రపంచ అథ్లెటిక్స్ లో బంగారు కాంతులతో మెరిసిన తెలుగు తేజమే జ్యోతి యారాజీ. 100 మీటర్ల హర్డిల్స్ లో తనదైన ఆటతీరును ప్రదర్శించి క్రీడాస్పూర్తిని రగిలించారు. ఈమె కుటుంబ నేపథ్యం ఒక్కసారి చూస్తే కళ్లు చెమ్మగిల్లకమానవు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో పోతేపోని సతుల్, సుతుల్, హితుల్ పోనీ. వస్తే రానీ.. కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపల్, శాపాల్ అన్నట్లు. ఎవరేమనుకున్నా నా ధ్యేయం నాది.. నా ఆట నాది అన్నట్లు ఆడి గెలిచి విజయతీరాన్ని చేరారు వైజాగ్ యువతి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 08:24 AMLast Updated on: Sep 26, 2023 | 8:24 AM

Vizag Girl Jyoti Yaraji Wins Gold Medal In 100m Hurdles In Asian Athletics

ప్రపంచ అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయి స్వర్ణం పతకం సాధించడం మన దేశానికే గర్వకారణం. వైజాగ్ కు చెందిన జ్యోతి యారాజీ ప్రపంచానికి తన క్రీడాస్పూర్తిని చాటి చెప్పింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో తన సత్తా చాటింది. కేవలం 13.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. ఈమె వయసు 23 సంవత్సరాలు. ఆసియా క్రీడల్లో అడుగు పెట్టడం తొలిసారి. మొదటి ప్రయత్నంలోనే బంగారు పతకాన్ని గెలుచుకోవడం అంటే ఈమె పట్టుదల ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఘన కీర్తిని మన దేశానికి అందించిన ఈమె కుటుంబ నేపథ్యం ఒక్కసారి చూద్దాం.

జ్యోతి తండ్రి సూర్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ జాబ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తల్లి కుమారి నగరంలోని ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఇలా తమకు వచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే క్రీడల పట్ట ఆసక్తితో కఠోరమైన శ్రమను, లక్ష్యసాధనలో వచ్చిన కష్టాలను, కుటుంబ పరిస్థితులన్నింటినీ తన పంటి కింద అణచి పెట్టుకున్నారు జ్యోతి. ఈ కసిని తన 100 మీటర్ల హర్డిల్స్ పై చూపించారు. దీంతో విజయ లక్ష్మి ఈమెను వరించింది. పేదరికంలో ఉన్న మజా ఒక్కసారైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. బ్రతికితే పేదోడిగా బ్రతికి ఇలాంటి అరుదైన, అద్భుతమైన చిత్రను సృష్టించి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాలని పదిమందికి ప్రేరణను ఇస్తుంది. ఇలాంటి వారిని ప్రభుత్వాలు, స్పాన్సర్ షిప్ కంపెనీలు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తే మన దేశం క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించడం ఖాయమని చెప్పవచ్చు.

T.V.SRIKAR