VYUHAM BREAK: వ్యూహం సినిమాకు బ్రేక్ ! సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు !!
రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వ్యూహం సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను కూడా జనవరి 11 వరకూ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టార్గెట్ గా, ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా తీసినట్టు భావిస్తున్న వ్యూహం మూవీ విడుదల ఆగిపోయింది. ఈ మూవీ బాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఈ సినిమాకు సెన్సార్ బోర్ట్ ఎలా సర్టిఫికెట్ ఇచ్చిందని లోకేష్ కోర్టులో సవాల్ చేశారు. దాంతో ఈ సర్టిఫికెట్ ను జనవరి 11 వరకూ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది తెలంగాణ హైకోర్టు. ఈ సర్టిఫికెట్ ప్రకారం వ్యూహం మూవీ విడుదల చేయడానికి వీల్లేదంటూ రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం 11.45 గంటల నుంచి సాయంత్రం దాకా న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద రెండు పక్షాల వాదనలను విన్నారు. రాత్రి 11.30 గంటల తర్వాత సినిమా రిలీజ్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలతో ఈ సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ ను సస్పెండ్ చేశారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా సినిమాలు తీయడం కరెక్ట్ కాదని పిటిషనర్ తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయడానికి నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వీళ్ళందరికీ ఓ నేత నుంచి సాయం అందుతోందనీ, రాజకీయ వ్యంగ చిత్రం పేరుతో సినిమా తీస్తూ చంద్రబాబు ఇమేజ్ డ్యామేజీకి ప్రయత్నిస్తున్నారని వాదించారు. సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో కూడా వైసీపీ మంత్రులు పాల్గొన్నారని తెలిపారు. సినిమాలో పాత్రలకు డైరెక్ట్ గా పేర్లు పెట్టారన్నారు. అంతేకాదు… వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యం ఉందంటూ గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులను లోకేష్ తరపు లాయర్లు న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు.
ట్రయలర్ చూసి వ్యూహం సినిమాను నిలిపివేయాలనుకోవడం కరెక్ట్ కాదని నిర్మాతల తరపున న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సెన్సార్ బోర్డు తరపున అడిషినల్ ఏజీ వాదనలు వినిపించారు. ఒకసారి బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోకూడదని తెలిపారు. 10మందితో కూడా కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని సీన్స్ తొలగించాలని నిర్మాతకు సూచించిందన్నారు. వ్యూహం సినిమా నిలిపివేతతో తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జనవరి 11న మళ్ళీ టీడీపీ పిటిషన్ పై కోర్టులో విచారణ జరగనుంది.