Warangal MP Congress Ticket : వరంగల్ టిక్కెట్ కి కాంగ్రెస్ లో పోటీ… పసునూరికి టిక్కెట్ ఖాయమా?
పసునూరి దయాకర్ (Pasunuri Dayakar) వరంగల్ ఎంపీగా రెండుసార్లు గెలిచినా... ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవన్న ముద్ర వేసుకున్న నేత, అటు బీఆర్‌ఎస్‌లోనూ ఆయనకు ప్రాధాన్యత తక్కువేనన్నది లోకల్ టాక్.

Warangal ticket contest in Congress... Pasunuri ticket sure?
పసునూరి దయాకర్ (Pasunuri Dayakar) వరంగల్ ఎంపీగా రెండుసార్లు గెలిచినా… ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవన్న ముద్ర వేసుకున్న నేత, అటు బీఆర్‌ఎస్‌లోనూ ఆయనకు ప్రాధాన్యత తక్కువేనన్నది లోకల్ టాక్. పక్కనే ఉన్న మహబూబాబాద్ ఎంపీ కవితతో పోల్చుకుంటే పసునూరిని పార్టీ పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవంటారు. కేవలం కేసీఆర్ చలవతోనే ఎంపీగా గెలిచారు కాబట్టి… ఆయనకు గౌరవం అంతవరకేనన్నది బీఆర్‌ఎస్ ఇన్నర్ టాక్. అలాంటి పసునూరి అనూహ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరి ఎంపీ టిక్కెట్ రేస్‌లోకి వచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో దీనిమీదే హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
టిక్కెట్ కోసం వరంగల్ కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ ఉంది. ఈ సీటు కావాలంటూ 40 మంది ఆశావాహులు పార్టీ అధినాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో 20 మంది వరకు సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా పసునూరి పేరు తెర మీదకి రావడం ఏంటో అర్ధం కావడం లేదట కేడర్‌కు. కాంగ్రెస్ తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య మొన్నటి వరకు టిక్కెట్‌పై ధీమాతో ఉన్నారు.
గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో టీడీపీ (TDP) లో కలిసి పని చేసిన అనుభవం ఆయనది. రేవంత్ రెడ్డి వర్గానికి సన్నిహితుడుగా పేరున్న సాంబయ్యకి ఈసారి టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. అంతే కాదు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచారు దొమ్మాటి. ప్రతికూల పరిస్థితుల్లో పోటీచేశాను కాబట్టి ఈసారి తనకు ఖచ్చితంగా టిక్కెట్ వస్తుందని అనుకున్నారట. మరో వైపు కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరగా ఉండే స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి శనిగపురం ఇందిర… వరంగల్ ఎంపీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు స్థానాలను మహిళలకు ఇచ్చాయనీ.. కాంగ్రెస్ కూడా ఇదే తరహాలో తనకు అవకాశం ఇస్తుందని ఇందిర ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు 2009లో బీఆర్‌ఎస్ తరఫున, 2014లో బీజేపీ(BJP) తరఫున పోటీ చేసిన పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్, వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్‌ను వదులుకున్నందుకు ప్రతిఫలంగా లోక్‌సభ టికెట్ ఇవ్వాలంటూ నమిండ్ల శ్రీనివాస్ ఎవరి ట్రయల్స్‌లో వారు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన జన్ను పరంజ్యోతి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మంత్రి అండదండలతో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా ఎవరికి వారు సీరియస్ ట్రయల్స్‌లో ఉన్నటైంలో పక్క పార్టీ నుంచి సిట్టింగ్ పసునూరి ఎలా ముందుకు వచ్చారని ఆరా తీస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. సిట్టింగ్ ఎంపీ హోదాలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారారాయన. టికెట్ హామీతోనే హస్తం పార్టీలో చేరినట్లు చెబుతున్నారు సన్నిహితులు. పసునూరికి, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సమయంలో ఇద్దరూ ఎంపీలుగా లోక్‌సభలో సమావేశాల్లో తరచూ కలుసుకునేవారట. అలా అనుబంధం పెరగడమే పసునూరి పార్టీ మార్పునకు కారణం అంటున్నారు. రేవంత్ రెడ్డి సైతం తన పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరిన పసునూరి టికెట్ ఇప్పించుకునేందుకు గతంలో ఆయనకు వచ్చిన మెజారిటీని చూపిస్తున్నారట. బీఆర్‌ఎస్ తరఫున రెండుసార్లు గెలిచిన పసునూరికి 2015 ఉప ఎన్నికలో 4లక్షల 59వేల 233 ఓట్ల రికార్డు మెజారిటీ వచ్చింది. 2019 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 3లక్షల 50వేల 298 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మొత్తం మీద సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధం పసునూరిని కాంగ్రెస్ గూటికి చేర్చింది. మరి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి.