Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. నాలుగు రోజులు జాగ్రత్త.. బయట అడుగు పెట్టకండి..
రాబోయే నాలుగు రోజుల పాటూ ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి. అర్జెంట్ పనులేమైనా ఉంటే వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ తడిసిపోనుంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వణికిపోనుంది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో.. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి.
మరో నాలుగు రోజుల పాటూ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మండు వేసవి కాలంలో వర్షాలు కురవడం హ్యాపీగానే ఉన్నప్పటికీ.. ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. మామిడిపళ్లు నేలరాలి రైతులకు నష్టాన్ని తెచ్చాయి. ఇక హైదరాబాద్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చినుకు పడితే చాలు నగరం వణికిపోతోంది. కొద్దిపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి.
ముఖ్యంగా అక్రమ కట్టడాలు వాటికిక సమీపంలో ఉన్న ఇళ్లు నీట మునుగుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై తవ్వి వదిలేసిన డ్రైనేజ్ గుంతలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి క్రిటికల్ కండీషన్‌లో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే నాలుగు రోజుల పాటు.. పరిస్థితి అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దంటున్నారు.