గంభీర్ పై వేటు ? భారత్ కు కొత్త కోచ్

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కోచ్ గౌతమ్ గంభీర్ చెత్త వ్యూహాలే ఈ ఓటమికి కారణమని అభిమానులు మండిపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 06:12 PMLast Updated on: Nov 04, 2024 | 6:12 PM

What About Gambhir New Coach For India

స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కోచ్ గౌతమ్ గంభీర్ చెత్త వ్యూహాలే ఈ ఓటమికి కారణమని అభిమానులు మండిపడుతున్నారు. అటు మాజీ ఆటగాళ్ళు సైతం గంభీర్ వ్యూహాలను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా గంభీర్ కోచింగ్ శైలిపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అతనిపై వేటు వేసేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టెస్ట్ ఫార్మాట్ కు కోచ్ గా గౌతీ పనికిరాడని పలువురు వ్యాఖ్యానించిన నేపథ్యంలో అతన్ని వన్డే , టీ ట్వంటీలకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. నిజానికి కివీస్ తో సిరీస్ లో గంభీర్ వ్యూహాలపై బీసీసీఐ కూడా అసహనంతో ఉన్నట్టు సమాచారం. పుణేలో స్పిన్ పిచ్ పై చిత్తుగా ఓడినా కూడా మళ్ళీ చివరి టెస్టుకు అలాంటి పిచ్ తయారు చేయించడం బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. స్పోర్టివ్ పిచ్ రూపొందించి ఉంటే కనీసం పరువైనా దక్కేదన్నది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే సెలక్షన్ లోనూ గంభీర్ ఆధిపత్యం ధోరణిపైనా బోర్డులో కొందరు పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతని ఓవరాక్షన్ కు బ్రేక్ వేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టెస్టు జట్టు బాధ్యతలు వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని సూచనలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్‌తో పోలిస్తే లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం సొంతం. గంభీర్ 58 టెస్టులు ఆడగా, లక్ష్మణ్ 134 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ప్రతికూల పరిస్థితుల నుంచి జట్టును ఆదుకోవడంలో లక్ష్మణ్‌కు గొప్ప అనుభవం ఉంది. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ టీమిండియా కోచ్‌గా అప్పుడప్పుడు తాత్కాలిక బాధ్యతలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళిన భారత యువ జట్టుకు కోచ్‌గా లక్ష్మణే వ్యవహరిస్తున్నాడు.

మరోవైపు ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన అనంతరం గంభీర్ పనితీరుపై సమీక్షించనున్న బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే గంభీర్ ను కంటిన్యూ చేసే అవకాశముంది. ఒకవేళ సిరీస్ చేజారితే మాత్రం టెస్ట్ జట్టు బాధ్యతల నుంచి అతన్ని తప్పించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గంభీర్ హయాంలో టీమిండియా చెత్త రికార్డులు నమోదుచేసింది. శ్రీలంక పర్యటనతో టీమిండియా కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత లంకపై టీ20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత లంక‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా కోల్పోవడం ఇదే ప్రథమం. బంగ్లాదేశ్ పై టెస్ట్ సిరీస్ గెలిచినా ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది.