Sessions of Parliament: పార్లమెంట్ స్పెషల్ సెషన్ లో జరగబోయేది ఇదేనట ?!
పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ లో ప్రతిపాదించే అంశాలు ఏవి. భారత్ పేరుపై చర్చ జరుగుతుందా.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటి ? ఐదు రోజుల స్పెషల్ సెషన్ లో ఏం జరగబోతోంది ? ఏ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నారు ? అనే దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఈనేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక సమాచారం బయటికొచ్చింది. సమావేశాల మొదటి రోజైన సెప్టెంబరు 18న (సోమవారం) ఓబీసీలలోని ఉప వర్గాల రిజర్వేషన్లపై రోహిణీ కమిషన్ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు. రెండో రోజు సెషన్ లో (మంగళవారం) ఇండియా పేరును భారత్ గా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. బుధవారం రోజున మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర సర్కారు పార్లమెంటులో ప్రవేశపెడుతుందని అంచనా వేస్తున్నారు. నాలుగో రోజైన గురువారం యూనిఫామ్ సివిల్ కోడ్ పై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక స్పెషల్ పార్లమెంట్ సెషన్ లో చివరి రోజైన శుక్రవారం (సెప్టెంబరు 22న) ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. అయితే దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఆ బిల్లుల వెనుక .. ఈ వ్యూహం
ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ద్వారా త్వరలో జరగబోయే అసెంబ్లీ పోల్స్ లో ఓబీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ తో బీజేపీ ఉంది. ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఓబీసీలు బీజేపీ వైపే ఉన్నారు. ఈ బిల్లు ద్వారా ఆ వర్గం తమకు మరింత చేరువవుతారనే ఆశాభావంతో కమలదళం ఉంది. త్వరలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న రాష్ట్రాలను చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. అంటే వచ్చే పోల్స్ లో ఓవరాల్ గా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోబోయే పార్టీ బీజేపీయే. మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మిగతా రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకోవడం బీజేపీకి అంత ఈజీ కాదు. అందుకే ఈ స్పెషల్ పార్లమెంట్ సెషన్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. అత్యంత కీలకమైన మహిళా ఓటు బ్యాంకును ఈవిధంగా తమ వైపునకు తిప్పుకోవాలని మోడీ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. మరో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెడితే బీజేపీకి మైనస్ గా మారే ముప్పు ఉంది. ఎందుకంటే అందులోని చాలా నిబంధనలు హిందూ అవిభాజ్య కుటుంబ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఫలితంగా మెజారిటీ హిందూ వర్గం నుంచే బీజేపీకి వ్యతిరేకత ఎదురుకావచ్చు.
చైనా కబ్జాలు, మణిపూర్ హింసపై సైలెంట్.. సనాతన ధర్మంపై యాక్టివ్
భారత బార్డర్ లో చైనా కబ్జాల వ్యవహారంపై , మణిపూర్ హింసాకాండపై నోరు విప్పకుండా.. ఏకపక్షంగా అర డజను బిల్లులను ప్రవేశ పెడుతుండటం అనేది మోడీ సర్కారుకు పెద్ద నెగెటివ్ పాయింట్ గా మారుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మణిపూర్ హింసాకాండపై స్పందించడానికి దాదాపు రెండు నెలలు టైం తీసుకున్న ప్రధాని మోడీ.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై మాత్రం రెండు రోజుల్లోనే స్పందించడం కూడా సగటు ఓటరును ఆలోచింపజేస్తుంది. మత ప్రాతిపదికన బీజేపీ నడిపిస్తున్న రాజకీయాలను చూసి విసిగి వేసారిన కర్ణాటక ప్రజలు మార్పును కోరేలా తీర్పు ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.