Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డు ఎవరికి ఇస్తారు.. దీని ఉపయోగం ఏంటి..?
బ్లూ ఆధార్ కార్డును నవజాత శిశువులకు జారీ చేస్తారు. దీని వల్ల పిల్లలు పెరిగినప్పుడు వారి భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. దీని ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ కార్డు గురించి దేశంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి కారణం ఎన్నికల్లో నాయకుడిని ఎన్నుకునే మొదలు అవసరమైన ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకునే మొదలు సంక్షేమ పథకాల వరకూ ప్రతి ఒక్క దాంట్లో దీని అవసరం ఉంటుంది. అలాగే బ్యాంకు అకౌంట్లు, సబ్సిడీలు వంటి ప్రత్యేక సేవలు పొందాలన్నా ఆధార్ తప్పని సరి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ ఈ విశిష్ట గుర్తింపు కార్డు ఆవశ్యకత చాలా ఉంటుంది. ఇందులో సంబంధిత వ్యక్తి ఫోటో మొదలు పూర్తి పేరు, అడ్రసు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి ఉంటారు. అయితే ఇది తెలుపు రంగులో ఉంటుంది. కానీ తాజాగా నీలి రంగు ఆధార్ కార్డు అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎవరికి ఇస్తారు. దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం.
దరఖాస్తు చేసిన 60 రోజుల్లో..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI దీనిని జారీ చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే తెలుపు రంగు ఆధార్ కార్డును 5 ఏళ్లు పైబడిన వాళ్లకు జారీ చేస్తారు. అయితే పుట్టిన పసిపిల్లల నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చే పిల్లలకు కూడా ఆధార్ తప్పని సరి చేసింది ప్రభుత్వం. వీరికి విద్యా సంస్థల్లో ప్రవేశా మొదలు జనాభా లెక్కల్లో వివరాలు పొందుపరచడానికి ఒక గుర్తింపు అవసరం అవుతుంది. అందుకే నీలి రంగు ఆధార్ కార్డును జారీ చేస్తారు. ఐదు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండా కార్డును జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న 60 రోజులలోపూ సంబంధిత పాప/బాబు పూర్తి వివరాలు పరిశీలించి జారీ చేస్తారు.
ప్రయోజనాలు..
ఈ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. బ్లూ ఆధార్ ను కేవలం ఐడీ ఫ్రూఫ్ లగానే కాకుండా ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు పొందవచ్చు. పిల్లలకు అందించే పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం వంటి పథకాలకు ఉపయోగపడుతుంది. చిన్న వయసులో స్కూల్ లో చేర్చేక్రమంలో పాఠశాలల యాజమాన్యాలు బ్లూ ఆధార్ కార్డు తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పైగా విదేశాలకు వెళ్లే క్రమంలో తల్లదండ్రులతో పాటూ పిల్లలకు ఈ గుర్తింపు ఉండట వల్ల వీసా వ్యవహారాల్లో పని సులభం అవుతుంది.
రెండుసార్లు అప్డేట్ చేయాలి..
ఇందులో కేవలం బాబు/పాప ఫోటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల వివరాలు ఉంటాయి. ఈ కార్డును జారీ చేసేటప్పుడు తల్లిదండ్రుల ఆధార్ నంబరుకు అనుసంధానం చేస్తారు. ఈ గుర్తింపు కార్డుకు కేవలం ఐదేళ్ల వరకూ కాలపరిమితి ఉంటుంది. ఆ తరువాత పిల్లల వేలిముద్రలు, కంటిపాప తో బయోమెట్రిక్ చేయించుకోవల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల అదే నంబరుతో అతనికి తెల్ల ఆధార్ కార్డును జారీ చేస్తారు. తిరిగి 15 ఏళ్ల వయసు వచ్చిన తరువాత మరోసారి కంటిపాప, వేలిముద్రల బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్డు కోసం ఆసుపత్రిలో పుట్టిన సర్టిఫికేట్ తో పాటూ ప్రభుత్వం జారీ చేసే బర్త్ సర్టిఫికేట్ పొందుపరచవలసి ఉంటుంది.
T.V.SRIKAR