Chandrababu In Jail: చంద్రబాబు అరెస్ట్ తరువాత ఏం జరుగుతోంది..?

చంద్రబాబు జైలులో ఎలా ఉన్నారు. ఆయన భద్రత పై ఎలాంటి చర్యలు చపట్టారు. కుటుంబ సభ్యులతో చంద్రబాబును కల్పిస్తారా.. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే సమగ్ర వివరాలు చూసేయండి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2023 | 09:11 AMLast Updated on: Sep 12, 2023 | 9:11 AM

What Developments Have Taken Place After The Arrest Of Chandrababu In The Skill Development Case

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయనకు స్నేహ బ్లాక్ అప్స్టైర్ లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేయగా 30 గంటల నుంచి జైలులోనే గడుపుతున్నారు. నేటితో టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ రెండో రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేకంగా ఒక సహాయకుడితో పాటూ ఐదుగురు జైలు భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశారు జైలు అధికారులు. అలాగే స్నేహా బ్లాక్ పరిధిలో మరిన్ని సీసీటీవీ కెమెరాలు అమర్చారు. రాజమండ్రి సెంట్రల్  జైలు  వద్ద పటిష్టమైన పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. జైలు ఆవరణకు రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేక బారికేట్లు ఏర్పాటు చేశారు. ములాకత్ ఉన్న వారిని మాత్రమే ఈ ప్రాంతంలో ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ఆయన కోసం నలుగురు వ్యక్తిగత వైద్యులను నియమించారు.

కుటుంబ సభ్యులకు ములాకత్

ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు కలిసే అవకాశం కనిపిస్తుంది. నిన్నే కలవాలని అనుకున్నప్పటికీ కొన్ని సాంకేతక సమస్యలు, జైలు ఫార్మాలిటీస్ పూర్తికాని పరిస్థితుల్లో ఈరోజుకు వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణిని బాబుతో మాట్లాడించే అవకాశం కల్పించనున్నారు. ఈరోజు వీరితో పాటూ ఇంకొందరు ముఖ్య నేతలు కలుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జైలు ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

జైలులో బాబు దిన చర్య ఏంటి..

జైలులో చంద్రబాబు ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తున్నట్లు తెలుస్తోంది. లేచిన వెంటనే యోగా, వాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో కూడా భద్రత నిమిత్తం పోలీసులు ఆయనతో పాటే ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం పూర్తైన తరువాత చంద్రబాబు జైలు గదికి తిరిగి వెళ్ళి ప్రెష్ అవుతారు. న్యూస్ చదివేందుకు కొన్ని న్యూస్ పేపర్లను అందిస్తారు. ఈలోపు ఆయనకు ఇంటి నుంచి టిఫెన్ చేసి పంపిస్తారు. దీన్ని జైలు అధికారులు చంద్రబాబుకు అందజేస్తారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత అవసరమైతే మాత్రలు వేసుకుంటారు. లేకుంటే విశ్రాంతి తీసుకుంటారు. జైల్లో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఉత్కంఠ

చంద్రబాబును విచారణ నిమిత్తం 5 రోజులు సీఐడీ కస్టడీకి అనుమతివ్వాలని ఏజీ పిటీషన్ వేశారు. దీనికి కౌంటర్ గా చంద్రబాబు తరఫు న్యాయవాదులు హౌస్ అరెస్ట్ కోరుతూ పిటీషన్ వేశారు. దీనిపై సీఐడీ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక వసతులు కల్పించామన్నారు. అయితే చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు హౌస్ రిమాండ్ విధించాలని కోరారు. చంద్రబాబుకు ప్రణ హాని పొంచి ఉందని.. అందుకే జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించారని గతంలోని అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనను గుర్తుచేశారు. అయితే సుదీర్ఘ వాదనల మధ్య కోర్టు మంగళవారానికి వాయిదా పడింది. ఈరోజు మధ్యహ్నం తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది ఏసీబీ న్యాయమూర్తి హిమబిందు. అయితే ఉదయాన్నే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు డిమాండ్ చేశారు. బాబు కస్టడీకా.. హౌజ్ రిమాండ్ కా.. ఫైనల్గా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.

భవిష్యత్ కార్యాచరణపై  సమావేశం..

చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేయగా బాలకృష్ణ సీనియర్ టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరిపారు. ఈరోజు నియోజకవర్గాల వారీగా టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అరెస్ట్ తరువాత పార్టీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే రెండురోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెంట్రల్ జైలు సమీపంలోని విద్యానగర్ లో బస చేస్తున్నారు. నంద్యాలలో బాబు విశ్రాంతి తీసుకున్న బస్సును కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్లు సమాచారం. అందులోనే చంద్రబాబుకు అవసరమైన భోజనం తయారు చేసి వ్యక్తిగత సహాయకుడు మాణిక్యం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.

T.V.SRIKAR