ములుగు అడవుల్లో ఏమైంది…? శాస్త్రవేత్తల మైండ్ పోతుందా…?
ఏటూరునాగారం అభయ అరణ్యంలోనూ భీకర గాలుల బీభత్సంతో నేలకొరిగిన వేలాది భారీ వృక్షాలు ఇప్పుడు శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల 31వ తేదీ బీభత్సం సృష్టించిన రాకాసిగాలి ప్రభావంతో వేలాది వృక్షాలు నేలమట్టం అయ్యాయి.
ఏటూరునాగారం అభయ అరణ్యంలోనూ భీకర గాలుల బీభత్సంతో నేలకొరిగిన వేలాది భారీ వృక్షాలు ఇప్పుడు శాస్త్రవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల 31వ తేదీ బీభత్సం సృష్టించిన రాకాసిగాలి ప్రభావంతో వేలాది వృక్షాలు నేలమట్టం అయ్యాయి. కొండాయి – మేడారం మీదుగా సరళరేఖ గీసినట్లుగా రాకాసి గాలులు బీభత్సం సృష్టించాయి. వీటిని ఆలస్యంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అసలు ఎన్ని వృక్షాలు ఈ గాలి దెబ్బకు నేల కూలాయి అనేది కూడా ఒక అంచనాకు ఇప్పటికీ రాలేకపోయారు.
దొడ్ల – కొండాయి అడవుల్లో సుమారు 40 వేల చెట్లు నేలమట్లమైనట్టు అంచనా వేసారు ముందు. డ్రోన్ కెమెరాల ద్వారా రిజర్వ్ ఫారెస్ట్ లో రాకాసి గాలి బీభత్సంపై అటవీ శాఖ విచారణ చేస్తోంది. ఇప్పటివరకు లక్షకు పైగా భారీ వృక్షాలు చెట్లు నేలమట్టమైనట్లుగా గుర్తించారు. ఈ వృక్షాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నేలమట్టమైన చెట్ల గణన చేస్తున్నారు. భీకర గాలుల బీభత్సంపై శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉపగ్రహ చిత్రాలు సేకరించే పనిలో పడ్డారు.
అభయ అరణ్యంలో అంతుచిక్కని బీకర గాలులపై ఎటు తేల్చలేకపోతున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఇప్పుడు అవసరమైతే విదేశీ శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. టొర్నడో తరహా గాలి అయితేనే ఈ విధంగా ఉంటుందని భావిస్తున్నారు. టొర్నడో కూడా అత్యంత తీవ్రంగా ఉంటే మాత్రమే అన్ని వృక్షాలు నేల కూలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఇప్పుడు అమెరికా నుంచి టొర్నడోలపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చి అడవుల్లో పరిస్థితిని చూపించాలని భావిస్తున్నారు. ఈ రాకాసి గాలుల దెబ్బకు పరిసర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆ గాలి గ్రామాల్లో వచ్చి ఉంటే మాత్రం వేల ఇళ్ళు నేలమట్టం కావడమే కాకుండా ప్రాణ నష్టం కూడా భారీగా ఉండేది అంటున్నారు అధికారులు.