WTC ఫైనల్ రేస్, గబ్బా టెస్ట్ రద్దయితే ?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతున్న వేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ మ్యాచ్ ఫలితం తర్వాత సమీకరణాలు మారిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క జట్టుకు కూడా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతున్న వేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ మ్యాచ్ ఫలితం తర్వాత సమీకరణాలు మారిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క జట్టుకు కూడా ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఫైనల్ రేసులో నాలుగు జట్లు పోటీలో ఉండగా… ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు ముందంజలో ఉంది. అయితే మొన్నటి వరకూ భారత్ ఫైనల్ చేరడం ఖాయమనుకుంటే కివీస్ చేతిలో వైట్ వాష్ పరాభవం తర్వాత సీన్ రివర్సయింది. పెర్త్ టెస్ట్ విజయంతో మళ్ళీ రేసులోకి వచ్చినా అడిలైడ్ ఓటమితో మళ్ళీ వెనుకబడింది. ప్రస్తుతం గబ్బా వేదికగా మూడో టెస్టులో తలపడతున్న టీమిండియాకు వర్షం టెన్షన్ పెడుతోంది. ఈ మ్యాచ్ రద్దయితే వలర్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025లో టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.
ఒక వేళ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయినా లేక.. ఫలితం లేకుండా ముగిసినా.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. చివరి రెండు గెలిస్తే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంటుంది. అప్పుడు నేరుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు దూసుకెళుతుంది. అలా కాకుండా చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒకటి గెలిచి మరొకటి డ్రా చేసుకొని ఈ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంటే.. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శ్రీలంక కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే మూడో టెస్ట్ తొలిరోజు ఆట వర్షార్పణమైంది. కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడగా.. రెండో రోజు ఆటకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ జరిగే ఐదురోజులూ వర్షం అడ్డంకిగా మారనుంది. రెండోరోజు భారీ వర్షం కురవనుండగా.. మూడో రోజు 46 శాతం, నాలుగో రోజు 67 శాతం, ఐదో రోజు 68 శాతం వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.