World cup: కపిల్‌దేవ్ చెప్పింది అక్షరాల నిజం..అదే జరిగితే టీమిండియా బతుకు బస్టాండే!
వరల్ట్‌కప్‌కి సమయం దగ్గర పడుతుండడంతో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‌దేవ్ భారత జట్టుకు కీలక సూచనలు చేశారు. గాయపడి..తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల విషయంలో అమలు చేయాల్సిన స్ట్రాటజీని వివరించారు.
వరల్డ్‌కప్‌కి ముందు జరుగుతున్న ఆసియాకప్ టీమిండియాకు ప్రాక్టీస్ టోర్నమెంట్. ఇక్కడ చేసిన తప్పులు వరల్డ్‌కప్‌లో చేయకూడదన్నది టీమ్ ప్లాన్. అందుకే గాయం నుంచి కోలుకున్న వెంటనే రాహుల్, అయ్యర్‌ని బరిలోకి దింపుతోంది. అటు ఏడాదికాలంగా గ్రౌండ్‌లో అడుగుపెట్టని బుమ్రా, ప్రసిద్ కృష్ణను కూడా ఐర్లాండ్‌తో టీ20లో ఆడించింది.. ఇప్పుడు ఆసియా కప్‌లోనూ ఈ ఇద్దరూ మైదానంలోకి దూకనున్నారు. ఈ నలుగురు ఆటగాళ్ల విషయంలో ఎలాంటి ప్లాన్ అమలు చేయాలో టీమిండియా మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విజేత కపిల్‌దేవ్ వివరించాడు. ఇలా చేయకపోతే వరల్డ్‌కప్‌లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
గాయపడిన ఆటగాళ్లపై ఫొకస్ పెంచాలని కపిల్‌దేవ్ చెప్పాడు. వారికి రెస్ట్ ఇవ్వకుండా..వీలైతే ప్రతి మ్యాచ్‌లోనూ అవకాశం ఇవ్వాలన్నాడు. అప్పుడే ఆ ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్ తెలుస్తాయని.. ఫామ్‌లోకి వచ్చారో లేదో కూడా తెలుస్తుందన్నాడు కపిల్. ఒకవేళ సరిగ్గా ఆడకపోయినా, ఫిట్‌నెస్ లేదని తెలిసినా మరో మాట లేకుండా వరల్డ్‌కప్‌కి దూరం పెట్టాలన్నాడు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన వారికి ఆసియా కప్‌లో అవకాశం ఇవ్వకుండా.. నేరుగా వన్డే ప్రపంచకప్‌లో ఆడించడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నది కపిల్ మాట. గాయం తిరగబెడితే జట్టు మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుందన్నది ఆయన అభిప్రాయం. ఇది నిజమేనంటున్నారు విశ్లేషకులు.
కపిల్ చెప్పిన దాంట్లో చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే పేరు చూసి ఊరి చూసి కాకుండా.. ప్రస్తుత ఫామ్ చూసే వరల్డ్‌కప్ ఎంపిక జరిగితే బాగుంటుంది. గతంలో ఇన్ని రికార్డులున్నాయి..అంత తోపు అని చెప్పడం కంటే ప్రస్తుత ఆటతీరు ఎలా ఉన్నదన్నది ముఖ్యం. ఒకవేళ గత రికార్డులే కన్సిడర్ చేయాల్సి వస్తే రిటైర్ అవ్వని వాళ్లలో శిఖర్ ధావన్‌ని మించిన వరల్డ్‌కప్ ఆటగాడు లేడు. ధావన్ విషయంలో ఒక రూల్.. రాహుల్ విషయంలో మరో రూల్ ఉండకూడదు. కేఎల్ రాహుల్, అయ్యార్ నాలుగైదు నెలలుగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. రాహుల్ గాయంపై ఓ స్పష్టత లేదు.. యో-యో టెస్టులో కూడా రాహుల్ పాల్గొనలేదు.. ఇంతటి కన్ఫ్యూజన్ మధ్య అతడిని ఎలా ఎంపిక చేశారో అర్థంకావడంలేదు. గాయం నుంచి తిరిగి జట్టులోకి వచ్చిన ఆటగాళ్లలో బుమ్రాని తప్ప మిగిలిన ముగ్గురిని నమ్మలేని పరిస్థితి.. ఎందుకంటే ఐర్లాండ్ టూర్‌లో ప్రసిద్ కృష్ణ నాలుగు ఓవర్ల స్పెల్ చూసి ఏకంగా వన్డే జట్టులోకి ఎంపిక చేయడంపై మాజీ సెలక్టర్ శ్రీకాంత్ సైతం మండిపడ్డాడు. ఇలా గాయల బెడద.. సరైన ప్లాన్ లేకపోవడం టీమిండియా కొంపముంచుతుందేమోనన్న భయాలను కలిగిస్తోంది.