Ruthuraj Gaekwad : రుతురాజ్ చేసిన తప్పేంటి ? సెలక్టర్లకు మాజీ క్రికెటర్ల చురకలు
శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై నెట్టింటి చర్చ నడుస్తూనే ఉంది.
శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై నెట్టింటి చర్చ నడుస్తూనే ఉంది. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు వుయ్ వాంట్ రుతు బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుంటే మరోవైపు మాజీ క్రికెటర్లు కూడా సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. లంక టూర్ కు రుతురాజ్ ను పక్కన పెట్టడంపై అతను చేసిన తప్పేంటని మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశ్నించాడు. శుభ్‌మన్ గిల్‌లా అందరికీ మంచి రాశి ఉండదని, సెలక్టర్లు రుతురాజ్‌ను కూడా పరిగణించాల్సిందన్నాడు. రుతురాజ్ టీ20లకు ప్రధాన ఎంపికగా చెప్పిన శ్రీకాంత్ సెలక్టర్లు అతన్ని కూడా చూడాలని సూచించాడు.
కాగా అవకాశం వచ్చిన ప్రతీసారీ రుతురాజ్ నిలకడగా రాణిస్తున్నా సెలక్టర్లు కొన్ని సిరీస్ లకు అతన్ని ఎంపిక చేయకపోవడం సరికాదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ విమర్శించాడు. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో టీ ట్వంటీ ఫార్మాట్ కు సంబంధించి అందరు యువ ఆటగాళ్ళను పరీక్షించాలని సూచించాడు. గంభీర్ రుతురాజ్ విషయంలో పొరపాటు చేసినట్టుగా అనిపిస్తోందంటూ కైఫ్ వ్యాఖ్యానించాడు. జింబాబ్వే టూర్ లో రాణించిన అభిషేక్ శర్మ కూడా లంక తో సిరీస్ కు ఎంపిక కాలేదు. దీంతో గంభీర్ ఫేవరిజం చూపించాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.