కుంభమేళా విశిష్టత ఏంటి..? ప్రతి 12ఏళ్లకి ఒకసారి ఎందుకు జరుపుకుంటారు..?
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కోట్లాది మంది భక్తులు పాల్గొనే.. ఈ కుంభమేళా విశిష్టత ఏంటి..? 12 ఏళ్లకు ఒకసారే ఎందుకు జరుపుకుంటారు..? ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభమేళా… భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక. హిందువులకు అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జాతర. కుంభమేళాలోనూ కొన్ని విధానాలు, పద్ధతులు ఉన్నాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. అలాగే… అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్‌లో లేదా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. పూర్ణకుంభమేళా అనేది ప్రతి 12ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళాను నాలుగు ప్రధాన ప్రదేశాలైన… ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో నిర్వహిస్తారు. ఇక… పన్నెండు పూర్ణకుంభమేళాలు పూర్తయితే.. అంటే 44 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు.
అసలు… కుంభమేళాకు ఆ పేరు ఎందుకువచ్చిందో తెలుసా. కుంభం అంటే… సంస్కృతంలో కుండ అని అర్థం. దీనినే కలశం అని అనొచ్చు. ఖగోళ శాస్త్రం ప్రకారం… కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. మేళా అంటే సమూహం లేదా జాతర అని భావించవచ్చు. హిందువులు పవిత్రమైన గంగా నది దగ్గర చేసుకునే పండుగే.. కుంభమేళా. సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా… ఈ కుంభమేళాను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. సూర్యుడు-బృహస్పతి… సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో… బృహస్పతి వృషభరాశిలో-సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. అలాగే… బృహస్పతి-సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు.
12ఏళ్లకు ఒకసారి జరిపే పూర్ణ కుంభమేళానే మహా కుంభమేళాగా పిలుస్తారు కొందరు. ఈ కుంభమేళాను 12ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక.. పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది క్షీరసాగర మథనం కథతో ముడిపడి ఉంది. శక్తిని పోగొట్టుకున్న దేవతలు.. దానికి తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. అందుకు రాక్షసుల సాయం కూడా తీసుకుంటారు. అమృతం లభిస్తే.. చెరి సంగం పంచుకుందామని రాక్షసులతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అయితే… సముద్రం నుంచి అమృతం కుండ బయటపడగానే.. దాని కోసం దేవతలు, రాక్షసుల మధ్య పోరు మొదలవుతుంది. 12 రాత్రులు, 12 పగళ్లు దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తారు. దేవతలు సాయం చేసేందుకు వచ్చిన మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతాడు. ఆ సమయంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో కొన్ని అమృతపు బిందువులు పడ్డాయని హిందువుల నమ్మకం. అందుకే… ఆ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. బృహస్పతి ఒక నిర్దిష్ట రాశిలో, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ పండుగ జరుగుతుంది. ఇది ప్రతి 12ఏళ్లకు ఒకసారే జరుగుతుంది. ఆ సమయం ఆధ్యాత్మిక ప్రక్షాళన, పునరుద్దరణకు అనుకూలమైనది అని విశ్వాసం. అందుకే 12ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు.
కుంభమేళాను 12ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక మరో కథ కూడా ఉంది. అమృతం కోసం.. దేవతలు, రాక్షసులు 12 రోజులు యుద్ధం చేశారు. దేవతలకు ఒక రోజు అంటే.. భూమిపై ఒక సంవత్సరంతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. ఆ లెక్కన 12 రోజులు అంటే.. భూమిపై 12 సంవత్సరాలతో సమావేశం. 12 రోజుల యుద్ధం తర్వాత అమృతం దేవలకు సొంతమైంది. అందుకు ప్రతీతగానూ… 12ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళా నిర్వహిస్తారు. జనవరి 2007లో 45 రోజుల పాటు అర్ధకుంభమేళాను ప్రయాగలో నిర్వహించారు. అప్పుడు కోటిన్నర మందికిపైగా భక్తులు హాజరయ్యారు. 2001లో మహా కుంభమేళా నిర్వహించగా… ఆరు కోట్ల మంది హాజరయ్యారు.