CM Jagan: వారసత్వ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ సీనియర్ నాయకులు.. మరి సీఎం జగన్ నిర్ణయం ఏంటి..?

ఏపీలో ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ వారసులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల వేటలో తలమునకలై ఉన్నారు. ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మరి వీరిలో ఎందరికి అదృష్టం వరిస్తుందో. జగన్ ఎందరికి బెర్త్ కన్ఫార్మ్ చేస్తారో తెలియాలంటే కొత్త సంవత్సరం 2024 ఫిబ్రవరి వరకూ వేచి చూడాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 08:30 AMLast Updated on: Aug 21, 2023 | 8:30 AM

What Is The Decision Of Cm Jagan And The Leaders Who Opened The Door To Succession Politics In Ycp

వైసీపీ అధిష్టానం నాయకులకు గతంలో ఒకమాట చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో మీరే పోటీ చేయండి ఆపై వచ్చే ఎన్నికల్లో వారసులకు టికెట్ ఇస్తామని క్లియర్ గా తెలిపింది. అయితే కొందరికి ఎమ్మెల్యే టికెట్ విషయంలో క్లారిటీ ఉంటే మరికొందరికి స్పష్టత కనపడటం లేదు. దీంతో వైసీపీ వారసత్వ రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ ఇప్పుడు కన్ఫార్మ్ చేస్తే ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది కనుక గ్రౌండ్ లెవెల్లో తమ వారసులను ట్రైనింగ్ ఇచ్చి ప్రచారబరిలో దింపేందుకు అవకాశం ఉంటుందని నేతలు భావిస్తున్నారు.

ముఖ్య నేతలకు సీఎం ఓకే చెప్పారా.. ?

గడిచిన కొన్ని నెలల నుంచి వైసీపీలో వారసత్వ రాజకీయాలు జోరందుకున్నాయి. మచిలీపట్నం సభ సాక్షిగా మాజీ మంత్రి పేర్ని నాని తాను రాజకీయాలకు విశ్రాంతి తీసుకుంటానని తన కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని బాహాటంగానే కోరారు. ఇక ఈ రేసులో జగన్ బాబాయ్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. భూమన ప్రస్తుతం టీటీడీ ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు. దీనికి కారణం కూడా వచ్చే ఎన్నికల్లో తాను ప్రత్యక్షరాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను ఆ టికెట్ నా కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి ఇవ్వమని అర్జీ పెట్టుకున్నారు. ప్రస్తుతం భూమన అభినయ్ కార్పొరేటర్ గా ఏకగ్రీవంగా గెలిచి తిరుపతి డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఇవి దాదాపు ఓకే అయినట్లు తెలుస్తుంది.

బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నది ఎవరు..?

ఇక ఇలాంటి తరుణంలో కొందరు సీనియర్ నేతలు బ్లాక్ మెయిలింగ్ కి కూడా పాల్పడుతున్నారు. గతంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు టికెట్ ఇస్తే తను ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పడం అప్పట్లో రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై మంత్రి వేణుగోపాల్ అయితే క్లారిటీగా ఉన్నారు. తనకు మూడు సార్లు పోటీ చేసేందుకు జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. వీరిద్దరి మధ్య పోటీ కొనసాగుతున్న వేళ వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మహిళా ప్రాధాన్యంలో వారసత్వం వర్కౌట్ అవుతుందా..

ఇప్పటి వరకూ కొడుకులను తమ రాజకీయవారసులుగా గెలిపించుకోవాలనే వారికి మాత్రమే చూశాం. అలాగే తమ ఇంట్లో మహిళలని కూడా రాజకీయ వారసత్వాన్ని అందించాలని కొందరు నాయకులు కోరుకుంటున్నారు. ఆ రేసులో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు. తన కుమార్తె నూరి ఫాతిమాను శాసనసభకు పంపాలని ఆశగా ఉన్నారు. గతంలో జగన్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. అందులో భాగంగా ముస్తఫా కుమార్తెను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నాం అని అన్నారు. దీని అర్థం ముస్తఫా అభ్యర్థన పై ఒక క్లారిటీ వచ్చినట్లే అని ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళా అభ్యర్థి రేసులో టెక్కలి నియోజకవర్గంలో మన్నటి వరకూ వైసీపీ పార్టీ సమన్వయ కర్తగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఇప్పుడు అతని సతీమణి వాణిని నియోజకవర్గ ఇంచార్జ్ గా ప్రకటించింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అన్న అనుమానాలు రేకెత్తాయి.

నియోజకవర్గాల త్యాగం..

ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ కుమారుల కోసం తమ నియోజకవర్గాలను వదిలి వెళ్లేందుకు కూడా సిద్దంగా ఉన్నారు. తమ కుమారులకు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీగా అయినా పోటీ చేస్తాము అని కొందరు అంటుంటే.. మరికొందరు తమ కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వండి మేము ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని సీట్లను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటున్నారు. ఈ రేసులో శ్రీకాకుళం నుంచి గెలిచి మంత్రి పదవిలో కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు తన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి ఎంపీ/ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ గా కొనసాగుతున్న తమ్మినేని సీతారాం ఆమదాలవలస ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడు చిరంజీవి వెంకటనాగ్ కి ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే గోదావరి జిల్లాలలో నుంచి తోట త్రిమూర్తులు, మంత్రి పినెపె విశ్వరూప్, రాయలసీమ జిల్లాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి, ప్రకాశం నుంచి బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను తమ కుమారులకు ఇప్పించ్చి చట్టసభలకు పంపించాలని అనుకుంటున్నారు.

T.V.SRIKAR