Jamili Elections: ఎన్నికల’పై నిపుణుల జట్టు.. ఏం స్టడీ చేస్తుంది ?
పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా కేంద్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది.
పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా కేంద్ర సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన హై లెవల్ కమిటీలో వివిధ రంగాలకు చెందిన ఏడుగురిని సభ్యులుగా నియమించింది. ఈ జాబితాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ రాజకీయ వేత్త గులాంనబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, సుభాష్, హరీశ్ సాల్వే, సంజయ్ కొఠారిలు సభ్యులుగా ఉంటారు. అయితే ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేది లేదని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తేల్చి చెప్పారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే పేరును ఈ కమిటీలో చేర్చకపోవడాన్ని అధిర్ తప్పుపట్టారు. ఎన్నికలు సమీపించిన టైంలో ఇటువంటి బిల్లులను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తేవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది.
కమిటీ సభ్యుల నేపథ్యం ఇదీ..
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజకీయాల్లోకి రాకముందు 16 ఏళ్లపాటు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా పని చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
గులాంనబీ ఆజాద్ 1982లోనే కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఒకసారి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. దాదాపు దశాబ్ద కాలానికిపైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అనంతరం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి సొంత ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్‌కే సింగ్ 1964 బ్యాచ్ బిహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఓఎస్‌డీగా సేవలందించారు. సుభాష్ కశ్యప్ 7, 8, 9 లోక్‌సభలకు సెక్రటరీ జనరల్‌గా సేవలందించారు. రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన ఉన్న అతి కొద్ది మంది మేధావుల్లో ఒకరిగా పేరొందారు. హరీష్ సాల్వే దేశంలోని న్యాయ కోవిదుల్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. అత్యధిక ఫీజు తీసుకునే సుప్రీంకోర్టు న్యాయవాదిగా పేరొందారు. సంజయ్ కొఠారి 1978 బ్యాచ్ హరియాణా కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనరుగా పని చేశారు.
కమిటీ అధ్యయనం చేసే అంశాలివీ..
రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని హై లెవల్ కమిటీ దేశంలోని రాజకీయ పార్టీలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత స్థాయిలో చర్చలు
జరుపుతుందని గెజిట్ లో తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణ కోసం ప్రజా ప్రాతినిథ్య చట్టం 1950తో పాటు రాజ్యాంగ పరిధిలోని సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలను సూచిస్తూ సిఫార్సులు చేయనుంది. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల నుంచి కూడా సమ్మతి అవసరమా.. లేదా అన్నది అధ్యయనం చేస్తుంది. ఒకే విడతలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కానప్పుడు.. ప్రభుత్వాల కాలవ్యవధి సంబంధిత అంశాలపై రాజ్యాంగ సవరణలను సూచిస్తుంది. భవిష్యత్తులోనూ జమిలి ఎన్నికల చక్రం కొనసాగించడం కోసం తీసుకోవాల్సిన చర్యలను రికమెండ్ చేస్తుంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కోసం చట్టాన్ని తీసుకురావాలంటే పార్లమెంట్ పరిశీలనా సంఘం సిఫారసులను పొందాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
పాక్షిక జమిలి కోసమేనా ?
ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ శాసన సభల ఎన్నికలు డిసెంబర్ లో జరగనున్నాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం శాసన సభల పోల్స్ జరగాల్సి ఉంది. ఈ పోల్స్ జరిగిని ఐదు నుంచి 7 నెలల్లోగా హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ శాసన సభల ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ పోల్స్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను సంప్రదించి, వాటిని ఒప్పించి.. ముందస్తుగా జమిలి ఎన్నికలకు సన్నద్ధం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇక మిగిలిన 15 రాష్ట్రాల్లో కొన్ని శాసన సభల పదవీ కాలం సగటున ఒక ఏడాది నుంచి నాలుగేళ్ల దాకా ఉంది. అందుకే ఈసారికి పాక్షిక జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్రం మొగ్గు చూపుతోందని అంటున్నారు.