KAVITHA LIQUOR HYD : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక అసలు కథ ఏంటి? హైదరాబాద్ కి లింకు ఎలా ?

ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్టు (Kavita Arrest) కీలక మలుపు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా (Amit Arora) సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్నారు ఈడీ (ED) అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్నిఅమిత్ అరోరా నుంచి సేకరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 16, 2024 | 11:15 AMLast Updated on: Mar 16, 2024 | 11:15 AM

What Is The Real Story Behind The Delhi Liquor Scam How To Link To Hyderabad

ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్టు (Kavita Arrest) కీలక మలుపు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా (Amit Arora) సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్నారు ఈడీ (ED) అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్నిఅమిత్ అరోరా నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో సౌత్ లాబీ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. అమిత్‌ అరోరాతోపాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత ఇవాళ మధ్యాహ్నం రౌస్ అవెన్యూకోర్టులో (Rouse Avenue Court) కవితను హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత.. లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ.

ఢిల్లీ మొదలైన లిక్కర్ గోల్ మాల్ ఎపిసోడ్ ఎక్కువగా హైదరాబాద్ చుట్టూనే తిరిగింది. ఇక్కడి నుంచే స్కామ్ కు తెరతీశారని మొదటి నుంచి సీబీఐ, ఈడీ చెబుతూనే ఉన్నాయి. సౌత్ గ్రూపే మెయిల్ రోల్ అని భావించాయి. ఈ దిశలోనే దర్యాప్తు కొనసాగుతోంది. అసలు ఢిల్లీ లిక్కర్ లింక్ విషయానికొస్తే.. 2021లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పాలసీని మార్చివేసి కొత్త లిక్కర్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ కొత్త లిక్కర్‌ పాలసీ కాస్త స్కాం వైపుకు దారి తీసిందనే ఆరోపణలతో కొందరు నేతలు అరెస్ట్‌ అయ్యారు. తాజాగా కవితను అరెస్ట్‌ చేసింది ఈడీ.

ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు.. అందులో కవిత పేరును చాలాసార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పటికే ఈడీ ఎదుట రెండుసార్లు కవిత విచారణకు హాజరువగా.. ఆ తర్వాత అనేకసార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్ పర్ట్ కమిటీ వేసింది కేజ్రీవాల్ సర్కార్. ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటీ చేసింది. ఎక్స్ పర్ట్ కమిటీ సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది. చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసింది ఆమ్‌ అద్మీ ప్రభుత్వం. నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చింది అప్పటి మంత్రుల కమిటీ. మార్చి 2021లో మంత్రుల కమిటీ సిఫార్సుకు ఆమోదం తెలిపింది ఢిల్లీ కేబినెట్.

ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9 వేల 500 కోట్లు పెరుగుతుందని ప్రకటించారు కేజ్రీవాల్. కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీకి ప్రభుత్వం పంపింది. దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి ఓకే చెప్పారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మెలిక పెట్టారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం షాపులు తెరచుకున్నాయి. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం వచ్చింది. తెల్లవారుజామున మూడింటి వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించింది లిక్కర్ పాలసీ. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో… స్కాం వెలుగులోకి వచ్చింది. 2022 ఏప్రిల్‌లో నరేష్ కుమార్… ఢిల్లీ చీఫ్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేశారాయన. లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని… మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్‌ అదే ఏడాది జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు. ఓ వైపు చీఫ్ సెక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మద్యం పాలసీలో మార్పులు చేస్తూ అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల నష్టం చేశారు. మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన 145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతీ బీర్ కేస్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని మాఫీ చేసింది ప్రభుత్వం. ఎల్‌-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్‌లు ఇచ్చారు. అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు తేల్చింది. మనిష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు పర్వం రెండేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్కర్ని దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తూ, అరెస్టు చేస్తూ వచ్చాయి. ఈ కేసులో కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసు క్లైమాక్స్ చేరినట్టేనా? ఈ అరెస్ట్‌ మరో మలుపు తిప్పుతుందా? ముందుముందు మరిన్ని సంచలనాలు ఉంటాయా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో ఉన్న సమయంలోనే కవిత అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు లిక్కర్ కేసు ఊహించి మలుపు తిరిగింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ట్విస్టులుంటాయో…