Bhumana Karunakar Reddy: భూమనకు టీటీడీ ఛైర్మన్ పోస్ట్ వెనక..!

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. బీసీలకు ఇస్తారని చివరి వరకు ప్రచారం జరిగినా సీఎం మాత్రం చివరకు భూమన వైపు మొగ్గు చూపారు. జంగా కృష్ణమూర్తి పేరు ఎందుకు వెనక్కు వెళ్లింది..? సీఎంపై అంతగా ఒత్తిడి పెంచిందెవరు..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2023 | 08:07 PMLast Updated on: Aug 06, 2023 | 8:15 PM

What Is The Reason Behind Giving Bhumana Karunakar Reddy The Post Of Ttd Chairman

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియడంతో కొత్త ఛైర్మన్ ఎవరనేది ఆసక్తి రేపింది. ఎన్నికల వేళ కావడంతో సీఎం జగన్ ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని గట్టిగా భావించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి పేరు చివరి వరకు వినిపించింది. ఒకవేళ ఆయన కాకపోతే అదే వర్గానికి చెందిన ఎమ్మెల్యే పార్థసారథికి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. మధ్యలో వైవీ సుబ్బారెడ్డి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. మధ్యలో భూమన కరుణాకరరెడ్డి కూడా తను రేసులో ఉన్నట్లు చెప్పారు. సీఎంను కలిశారు. కానీ సీఎం మాత్రం బీసీ నేత వైపే మొగ్గు చూపుతున్నారని జంగా ప్రమాణం చేయడం ఖాయమంటూ తాడేపల్లి వర్గాలు లీకులిస్తూ వచ్చాయి. జంగా కూడా స్వామిసేవలో తరించడానికి సిద్ధమయ్యారు. కానీ తెరవెనుక మాత్రం జరగాల్సిన నిర్ణయం జరిగిపోయింది. చివరకు భూమన పేరు ప్రకటించారు.

రెడ్డీ లాబీ పనిచేసిందా..?
ఈసారి టీటీడీ ఛైర్మన్‌గా భూమనకే అవకాశం ఇవ్వాలని రెడ్డి సామాజిక వర్గం గట్టిగా పట్టుబట్టింది. తమ వర్గానికే అవకాశం ఇవ్వాలంటూ వారు సీఎంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. సీఎం జగన్‌కు అండగా నిలుస్తున్న రెడ్డి వర్గానికి సరైన న్యాయం జరగలేదని వారు గట్టిగా వాదించారు. మంత్రి పదవుల్లో అనుకున్నన్ని పదవులు రాలేదని కనీసం టీటీటీ ఛైర్మన్ పోస్టు అయినా ఇవ్వాలంటూ గట్టిగా లాబీయింగ్ చేశారు.

సీఎంతో గట్టిగా మాట్లాడిన భూమన..!
కొన్ని రోజుల క్రితం సీఎం జగన్‌తో భూమన కరుణాకరెడ్డి సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన కాస్త గట్టిగానే సీఎంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తనకు మరోసారి టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. జగన్ నచ్చచెప్పబోయినా భూమన వినలేదు. తను వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డానని ఆయన చనిపోయాక కూడా జగన్ వెంట నడిచానని చెప్పారు. మంత్రిగా తనకు అవకాశం ఇస్తారని భావించానని కానీ రెండోసారి విస్తరణ సమయంలో కూడా తన పేరు పట్టించుకోలేదని కాస్త గట్టిగానే మాట్లాడారు భూమన. అయినా ఎక్కడా అసంతృప్తి వెళ్లగక్కని తమ కుటుంబానికి ఇంకా అన్యాయం చేయడం సరికాదని సీఎంతో నిష్టూరంగా మాట్లాడారు భూమన. చెవిరెడ్డి వంటి వారికి పార్టీలో ప్రాధాన్యం లభిస్తోందని తమ వర్గానికి అన్యాయం జరిగిందని అయినా ఓర్చుకున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేయబోవడం లేదని తన కుమారుడు బరిలోకి దిగుతాడని తనకు మరోసారి స్వామి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ రకంగా డిమాండ్ చేశారు భూమన. దీంతో సీఎం ఆలోచనలో పడ్డారు. పైగా మంత్రి రోజా వంటి వారు కూడా భూమనవైపే మొగ్గు చూపారు. అన్నీ ఆలోచించిన సీఎం భూమనకు ఇవ్వడం కంటే ఇవ్వకపోతేనే జరిగే నష్టం ఎక్కువని గ్రహించారు. అందుకే టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని నియమించారు.

బీసీలకు ఏం చెబుతారు..?
సీఎం జగన్ బీసీలకు ఇవ్వాలని భావించినా అది కుదరలేదు. కొన్ని రోజుల క్రితమే భూమనకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినా ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇప్పుడు బీసీలకు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనలో పడ్డారు వైసీపీ పెద్దలు. యాదవ సామాజిక వర్గానికి మరో పెద్ద పదవి ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని భావిస్తున్నారు. ఆ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని వైసీపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.