BRS Party: బీఆర్ఎస్ అభ్యర్థుల్లో కనిపించని ఎన్నికల జోష్.. కారణం ఏంటి..?
ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన వరకూ ఒక రకం. ప్రకటన తరువాత మరో రకంగా మారిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.
బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. వీరందరూ తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో సీటు ఆశించి భంగపడ్డ వారు ఇతర పార్టీల్లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. మరి కొందరు తీవ్ర అసమ్మతితో రగిలిపోతున్నారు. ఇలాంటి తరుణంలో వెలుగులోకి వచ్చింది జమిలి ఎన్నికల అంశం. దీంతో ఒక్కసారిగా ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు సైలెంట్ అయిపోయారు నాయకులు. ఇంత వరకూ హంగామా ఆర్భాటాలు ప్రదర్శించిన నేతలంతా ఎందుకు ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా అయిపోయారనే అనుమానం కొందరిలో కలుగుతోంది. ఇంతకు ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
ధన ప్రవాహం..
ఎన్నికలు అంటేనే డబ్బు అని రాజకీయాల పట్ల కొంత అవగాహన ఉన్న వాళ్లు తరుచూ చెబుతూఉంటారు. అలాంటి డబ్బు ఇప్పుడు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుంది. జమిలి ఎన్నికలకు ముందుగా సై అని ప్రకటించిన బీఆర్ఎస్ ఇప్పుడు మింగలేక.. కక్కలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ జమిలి ఎన్నికలు అంటే ఇంకా ఆరు నెలల కాలవ్యవధి ఉంది. సాధారణంగా తెలంగాణ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలలు ఎలా గడుస్తాయిరా దేవుడా అని తలపట్టుకున్నారు నాయకులు. దీనికి కారణం కార్యకర్తల మొదలు పార్టీ శ్రేణుల వరకూ అందరినీ తన వైపు ఆకర్షించుకునేందుకు వారి బాగోగులు చూసుకునేందుకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే మూడు నెలలే తట్టుకోలేక పోతున్న నాయకులు ఇక జమిలి వస్తే ఆరు నెలలు వేచి ఉండక తప్పని పరిస్థితి. దీంతో ఇళ్లు, పొలాలు, నగలు తాకట్టు పెట్టాల్సిందే అని ఎమ్మెల్యే టికెట్ సాధించిన అభ్యర్థులు అంటున్నట్లు సమాచారం.
మరి భంగపడ్డవారి పరిస్థితేంటి..
బీఆర్ఎస్ లో సిట్టింగులకు కూడా ఈ సారి రాజకీయ లక్ష్మి వరించలేదు. పైగా తన వద్ద ఉన్న సంపద కరిగిపోయే ప్రమాదం వచ్చి పడింది. దీంతో టికెట్ రాక నిరాశ పడ్డ వారు కొంత వరకూ ఖర్చు తగ్గిందని ఆనందిస్తున్నారు. అయితే తాము ఏదైనా పార్టీలోకి వెళ్లి అక్కడ టికెట్ సాధిద్దాం అనుకొని వేచి చూస్తున్న సమయంలో ఈ జమిలి అసంతృప్తులపై నీళ్లు చల్లింది. ఇప్పుడు ఏ పార్టీ నుంచి అయినా టికెట్ వస్తే లేని పోని ఖర్చులు మీదొచ్చి పడతాయి అని భావిస్తున్నారు. పైగా అక్కడి క్యాడర్ ఏంటో మనకు తెలియదు. నాయకుల తీరు ఏంటో అర్థం కాదు. అలాంటి సమయంలో ఉన్న పార్టీని వీడి మరో పార్లీలో చేరడం అంటే తన సమస్యను తానే కొని తెచ్చుకున్నట్లని భావిస్తున్నారు. ఈనెల 18 నుంచి 22 వరకూ జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై స్పష్టత రానుంది. అందుకే ఈనెల 22 తరువాత పార్టీలో ఉండాలా బయటకు పోవాలా అన్న విషయం పై కొంత క్లారిటీ అయితే వస్తుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
మహిళా రిజర్వేషన్ల ఎఫెక్ట్..
పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెత తెలంగాణ రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ఇప్పుడు లేని పోని తలనొప్పులతో సతమతమౌతోంది బీఆర్ఎస్. కానీ బయటకు కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. ఎంత కవర్ చేసుకున్నా ఏదో సందర్భంలో దీనిపై చిరాకు బయటకు రాక తప్పదు. ఇదే తరుణంలో ఇతర పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను కసరత్తు చేసే పనిలో పడ్డాయి. పైగా బీఆర్ఎస్ లో మహిళలకు ఈ దఫా పెద్దపీట వేయలేదు కేసీఆర్. దీనిని కాంగ్రెస్ బీజేపీలు రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అంశంపై ఈనెల జరబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఒక వేళ ఈ బిల్లు ఆమోదం పొందితే బీఆర్ఎస్ లిస్ట్ ను మార్చాల్సి వస్తుంది. ఎలాంటి సవరణలు చేయకుండా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులతోనే ఎన్నికలకు వెళితే కాంగ్రెస్, బీజేపీలు మహిళా ఓటు బ్యాంకును అస్త్రంగా చేసుకొని కొందరు అభ్యర్థులను ప్రకటించి ముందుకు పోయే అవకాశం ఉంది. దీంతో కేసీఆర్ కి తీవ్ర నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
T.V.SRIKAR