Congress: షబ్బీర్ అలీ పేరు తొలిజాబితాలో లేకపోవడానికి కారణం ఇదేనా..?
కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ పేరు ఎక్కడా కనిపించలేదు. అయితే దీనికి నియోజకవర్గం మార్పే కారణమని తెలుస్తోంది. ఈ నిర్ణయం నిజమైతే దీని వెనుక ఉన్న పరిస్థితులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. అటు మ్యానిఫెస్టో విడుదల చేసి మొదటి బహిరంగసభ ముగించుకుని ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించారు కేసీఆర్. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా తన అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డవారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. మరి కొందరు లోలోపల అంతర్మధనం చెందుతున్నారు. చాలా మంది నాయకులు పార్టీలు మారే యోచన చేస్తున్నారు. ఇలాంటి ఉన్న వాతావరణంలో షబ్బీర్ అలీ తెరపైకి వచ్చారు. ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకుల పేర్లు మొత్తం తొలిజాబితాలో ప్రకటించింది అధిష్టానం. అయితే ఇందులో షబ్బీర్ అలీ పేరు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా..
నిన్న మన్నటి వరకూ షబ్బీర్ అలీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని అందరూ భావించారు. అయితే ఉన్న పళంగా ఏమైందో ఏమో తెలియదు కానీ తన నియోజకవర్గాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ పోటీ చేసిన స్థానాల్లో కాకుండా కొత్త ప్రాంతాల నుంచి గెలవాలని తహతహలాడుతున్నారు కొందరు నేతలు. అందులో షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. కామా రెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే షబ్బీర్ అలీ ఆయనకు పోటీగా నిలబడేందుక విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా.. తాను గెలవలేక పోయినా పూర్తి రాజకీయ భవిష్యత్తే అంధకారంలోపడే అవకాశం ఉందని భావిస్తున్నారట. అందులో భాగంగానే కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి కాదు ఎల్లారెడ్డి..
షబ్బీర్ అలీ లాగానే మరో నేత తన నియోజకవర్గాన్ని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆయనే మదన్ మోహన్ రెడ్డి. ఈయన కూడా గతంలో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని భావించి కామారెడ్డికి జంప్ అవ్వాలనుకుంటున్నారు. అందుకే వీరిద్దరూ మ్యూచువల్ గా నియోజకవర్గాలను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కాంగ్రెస్ లో తమకు ఆశించిన స్థానాల్లో టికెట్ వస్తుందా రాదా అన్న ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది గతంలో అనుకున్న స్థానాల కాకుండా ఇప్పుడు కొత్తగా నియోజకవర్గాల మార్పు అంశాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. పైగా షబ్బీర్ అలీ కాంగ్రెస్ సీనియర్ నేత. ఎంతో కాలంగా ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఇలా నియోజకవర్గం మార్పు గురించే తొలిజాబితాలో ఆయన పేరు లేదనే వాదనలు ఒకవైపు నుంచి వినిపిస్తుంటే.. అసలు టికెట్ ఇస్తారా లేదా అన్న అభిప్రాయాలు కూడా మరికొందరిలో వ్యక్తం అవుతోంది. ఈ సస్పెన్స్ కి తెరపడాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా వరకూ వేచిచూడక తప్పదు.
T.V.SRIKAR