CM kcr: ఎక్కడికెళ్లినా.. ఎందుకెళ్లినా అదే టోపీ అసలు కేసీఆర్ క్యాప్ సీక్రెట్ ఏంటి ?
కేసీఆర్ ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం, రాజకీయ వ్యూహాల నుంచి మాటల వరకు.. స్పెషల్ అనిపిస్తుంటారు ప్రతీసారి ! ఆయన మాటల సంగతి సరేసరి. నవ్విస్తాయ్, ఏడిపిస్తాయ్, ఆలోచించేలా చేస్తాయ్.. చివరికి అనుసరించేలా చేస్తాయ్.
ఆ మాటలు, మాట్లాడేప్పుడు ఆ కదలికలు, ముఖ కవళికలను ఇమిటేట్ చేసేవాళ్లు ఎందరో ! కేసీఆర్‌లా ఉండాలని.. కేసీఆర్‌లా కనిపించాలని చాలామంది కోరుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు ప్రారంభిస్తూ.. వరుస పర్యటనలు చేస్తున్నారు కేసీఆర్. ఎక్కడికి వెళ్లినా ఒకే టోపీలో కనిపిస్తున్నారు. బయటకు ఎక్కడికి వచ్చినా.. ఎందుకు వచ్చినా.. అదే టోపీలో దర్శనం ఇస్తున్నారు కేసీఆర్.
చాలా రోజుల నుంచి అదే గుండ్రటి టోపీలో కనిపిస్తున్నారు. అది ఒకే టోపీనా.. ఒకేలాంటి టోపీనా అన్న సంగతి పక్కనపెడితే.. అలాంటి టోపీనే కేసీఆర్ ఎందుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాత్రమే ఇలాంటి టోపీతో కనిపించేవారు కేసీఆర్. ఇప్పుడు ప్రతీచోటా ఇలానే కనిపిస్తున్నారు. దీని వెనక సీక్రెట్ ఏంటా అని జనాలు, కేసీఆర్ అభిమానులు తెగ ఆరాలు తీస్తున్నారు. ఈ క్యాప్ ధరించడం వెనక సెంటిమెంట్ కారణం అని కొందరు అంటుంటే.. ఎండల కారణంగానే దీన్ని ధరిస్తున్నారని ఇంకొందరు అంటున్నారు.
నిజంగా ఎండలే కారణం అనుకుంటే.. సాయంత్రాలు, రాత్రి జరిగే కార్యక్రమాల్లోనూ ఈ క్యాప్‌ను వదలడం లేదు కేసీఆర్. ఆ గుండ్రటి టోపీలోనే కనిపిస్తున్నారు. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే ఈ టోపీని వాడే కేసీఆర్.. ఇప్పుడు ప్రతీ రోజూ ఉపయోగిస్తున్నారు. కేసీఆర్ క్యాప్ మీద రకరకాల ప్రచారం జరుగుతున్నా.. నిజంగా కారణం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. జోతిష్యాలు, ముహూర్తాలు, శకునాలు, సెంటిమెంట్లు ఎక్కువ నమ్మే కేసీఆర్.. ఈ టోపీ వెనక అదే ఫాలో అవుతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఐతే కేసీఆర్ సన్నిహితులు చెప్పేది మాత్రం ఇంకోలా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేసే కార్యక్రమాలకు మాత్రమే… కౌబాయ్ క్యాప్ తీసుకువెళ్తారని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు గులాబీ కండువా వేసుకొని వెళతారని చెప్తున్నారు. నిజంగా కారణం ఏదైనా.. ఆ టోపీతో ఓ బ్రాండ్ క్రియేట్ చేశారు కేసీఆర్.