Women Reservation: మహిళా రిజర్వేషన్ తో తెలంగాణలో సీన్ రివర్స్
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుందనే అంచనాలు వెలువడుతున్నందున ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం రాజకీయ పార్టీల్లో టెన్షన్ ను రేకెత్తిస్తోంది. తెలంగాణలోని బీఆర్ఎస్ దగ్గరి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాకా అన్ని పార్టీల ఎదుట ఎన్నో కొత్త సవాళ్లను ఈ బిల్లు నిలుపనుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుందనే అంచనాలు వెలువడుతున్నందున ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే.. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. లోక్ సభ, అసెంబ్లీలలో మహిళలకు అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఛాన్స్ కు రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకునే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ కోటా ప్రకారం మహిళలు పోటీ చేసి గెలుస్తున్నప్పటికీ.. పెత్తనం వారి భర్త లేదా కుటుంబీకుల చేతుల్లోనే ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ విధంగా దుర్వినియోగం జరగకుండా నిలువరించే ప్రత్యేక క్లాజ్ లను మహిళా రిజర్వేషన్ బిల్లులో చేర్చాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
కవిత పోరాటం.. బీఆర్ఎస్ మొండిచెయ్యి..
ఇటీవల సీఎం కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే వాటిలో మహిళలకు 6 స్థానాలనే కేటాయించింది. ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మికి మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డికి, కంటోన్మెంట్ నుంచి జి. లాస్య నందితకు, ఆలేరు నుంచి గొంగిడి సునీతకు, ఇల్లందు నుంచి బానోతు హరిప్రియ నాయక్ కు, ములుగు నుంచి బి.నాగజ్యోతికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ టికెట్స్ లభించాయి. మిగతా 109 స్థానాలన్నీ పురుషులకే దక్కాయి. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 61 చోట్ల పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నా.. మహిళలకు టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ న్యాయం చేయలేకపోయింది. బీఆర్ఎస్ ఒక్కటే కాదు.. ఇతర పార్టీలూ టికెట్ల కేటాయింపులో ఇదేవిధంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవేళ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తే.. మహిళా జనాభా ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో మహిళా అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ప్రాతిపదికన కేటాయింపు ఉండాలి.. ఏయే రిజర్వేషన్లు ఉండాలి.. అనేది కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న 61 అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 ఎస్టీ, 10 ఎస్సీకి రిజర్వు చేసినవి. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని 13 సెగ్మెంట్లలో రెండు (కరీంనగర్, రామగుండం) మినహా అన్నింటా మహిళా ఓటర్లే ఎక్కువ. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కారు పార్టీ మొత్తం 119 అసెంబ్లీ టికెట్లలో కనీసం 19 అయినా మహిళలకు దక్కేలా చేసి ఉంటే ఆమె మెసేజ్ ఇంకా బలంగా జనంలోకి వెళ్లి ఉండేదని పరిశీలకులు అంటున్నారు.
బిల్లుకు ఆమోదం లభిస్తే..
ఈ పార్లమెంట్ సెషన్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభిస్తే అందులో పేర్కొన్న నిష్పత్తి ప్రకారం బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ సెగ్మెంట్లను మహిళల కోసం రిజర్వు చేయక తప్పదు. రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లులో 33.3% పేర్కొంటుందా? లేక మరో లెక్క ఉంటుందా? అనేదానిపైనా స్పష్టత లేదు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలే లేడీస్‌కు రిజర్వు కానున్నాయి. ఆ ప్రకారం కేసీఆర్ పోటీచేసేందుకు సిద్ధమైన గజ్వేల్, కామారెడ్డి మాత్రమే కాకుండా మంత్రులు కేటీఆర్ (సిరిసిల్ల), హరీశ్‌రావు (సిద్దిపేట), వేముల (బాల్కొండ), ఇంద్రకరణ్ (నిర్మల్), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), స్పీకర్ (బాన్సువాడ), మాజీ మంత్రి కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) తదితరులు పోటీ చేస్తున్న స్థానాల్లో చాలా వరకు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలున్నాయి.