ఇంకెప్పుడు పూర్తవుతాయి ? పాక్ బోర్డుపై విమర్శలు

వరల్డ్ క్రికెట్ లో ప్రపంచకప్ తర్వాత అతిపెద్ద టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీనే... మినీ ప్రపంచకప్ గా పిలిచే ఈ టోర్నీ ఆతిథ్యం కోసం క్రికెట్ దేశాల మధ్య మంచి పోటీనే ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 9, 2025 | 03:12 PMLast Updated on: Jan 09, 2025 | 3:12 PM

When Will It Be Completed Criticism On The Pakistan Board

వరల్డ్ క్రికెట్ లో ప్రపంచకప్ తర్వాత అతిపెద్ద టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీనే… మినీ ప్రపంచకప్ గా పిలిచే ఈ టోర్నీ ఆతిథ్యం కోసం క్రికెట్ దేశాల మధ్య మంచి పోటీనే ఉంటుంది. ఈ సారి రొటేషన్ లో పాక్ క్రికెట్ బోర్డుకు ఆ అవకాశం దక్కింది. వచ్చే నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ పాక్, దుబాయ్ వేదికగా జరగబోతోంది. ఇలాంటి టోర్నీకి ఆతిథ్యమిస్తున్నప్పుడు నిర్వహణా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉండాలో ఎవ్వరూ చెప్పక్కర్లేదు. కానీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం ఏర్పాట్ల విషయంలో చివాట్లు తింటోంది. స్టేడియం పునర్మిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐసీసీ భారీ స్థాయిలోనే నిధులు ఇచ్చినా పాక్ బోర్డు మాత్రం అనుకున్నంత వేగంగా స్టేడియాల రెన్నోవేషన్ స్పీడప్ చేయలేకపోతోంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 42 రోజుల సమయం మాత్రమే ఉండగా.. స్డేడియాల రినోవేషన్ ఇంకా పూర్తవ్వలేదు. స్టేడియాల పునరుద్దరణ పనులు మందకోడిగా సాగుతున్నాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది.

మినీ ప్రపంచకప్ డెడ్‌లైన్‌కు ఇంకా 35 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే స్టేడియాల రినోవేషన్ పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. స్టేడియాల పునరుద్దరణ కోసం ఐసీసీ నుంచి కోట్ల రూపాయలు తీసుకుంది. పాకిస్థాన్‌లో కరాచీ నేషనల్ స్టేడియం, లాహోర్‌లో గడాఫీ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియాలను పీసీబీ రినోవేషన్ చేస్తోంది. అయితే ఈ పనులు ఇంకా పూర్తవ్వలేదు. పీసీబీ.. ఐసీసీ అపెక్స్ బాడీకి ఫిబ్రవరి 12లోపు స్టేడియాలను అప్పగించాల్సి ఉంటుంది. అంతకు ఓవారం ముందు ఐసీసీ స్టేడియాలను తనిఖీ చేసి తుది నిర్ణయం తీసుకోనుంది.

ఒకవేళ స్టేడియాల నిర్మాణాలు పూర్తవ్వకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తాన్ని యూఏఈకి తరలించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ స్టేడియాలకు సంబంధించి పూర్తి కాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మూడు స్టేడియాలు ఇంకా సిద్దం కాలేదనీ,. రినోవేషన్ పనులు పూర్తవ్వలేదనీ అక్కడి అధికారులు చెబుతున్నాడు. సీట్లు, ఫ్లడ్ లైట్స్, ఔట్ ఫీల్డ్, వంటి కనీస సౌకర్యాలకు సంబంధించిన చాలా పనులు మిగిలి ఉన్నాయని వెల్లడించారు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్న స్టేడియాల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు, వీడియోలను చూసిన నెటిజన్లు ఇక ఛాంపియన్స్ ట్రోఫీ పాక్ లో జరిగినట్లేనని నిట్టూరుస్తున్నారు. ఇంత పెద్ద టోర్నీ ఆతిథ్యం విషయంలో ఇలాంటి నిర్లక్ష్యమా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇచ్చిన అవకాశాన్ని వృథా చేసుకుంటున్న పాక్ బోర్డుకు భవిష్యత్తులో మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చే అవకాశాలు దక్కడం కష్టమేనని తేల్చేస్తున్నారు.