ఎడారి దేశంలో మెగా ఫైట్ భారత్,పాక్ పోరు ఎప్పుడంటే ?
ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక సస్పెన్స్ కు తెరపడింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించేందుకు ఒప్పుకున్న పాకిస్థాన్, భారత్ తో మ్యాచ్ ల కోసం యూఏఈని వేదికగా ఫైనల్ చేసింది. దీనికి సంబంధించి ఐసీసీతో తుది చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక సస్పెన్స్ కు తెరపడింది. హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించేందుకు ఒప్పుకున్న పాకిస్థాన్, భారత్ తో మ్యాచ్ ల కోసం యూఏఈని వేదికగా ఫైనల్ చేసింది. దీనికి సంబంధించి ఐసీసీతో తుది చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంది. దీంతో లీగ్ స్టేజ్ లో భారత్ ఆడే మూడు మ్యాచ్ లు కూడా ఎడారి దేశంలోనే జరగనున్నాయి .పాకిస్థాన్, యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్‍కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో టోర్నీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకోక తప్పలేదు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో లీగ్ మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పోరాటం మొదలుకానుంది. పాకిస్థాన్‍తో ఫిబ్రవరి 23న ,న్యూజిలాండ్ తో మార్చి 2న ఆడనుంది. త్వరలోనే ఐసీసీ అధికారికంగా టోర్నీ పూర్తి షెడ్యూల్ ప్రకటించనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో తన మ్యాచ్‍లను భారత్.. దుబాయ్ వేదికగానే ఆడనుందని సమాచారం. నాకౌట్ మ్యాచ్‍లకు క్వాలిఫై అయితే ఈ మ్యాచ్‍లు కూడా అక్కడే జరగనున్నాయి. ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీలో జరిగే మ్యాచ్‍తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మొదలుకానుంది. మార్చి 4, మార్చి 5 తేదీల్లో సెమీఫైనల్స్ ఉంటాయి. మార్చి 9న ఫైనల్ జరగనుంది. లాహోర్ వేదికగా తుదిపోరు జరగాల్సి ఉంది. ఒకవేళ భారత్ క్వాలిఫై అయితే ఈ ఫైనల్ యూఏఈలో జరుగుతుంది. లేకుంటే లాహోర్ లో ఫైనల్ నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు లీగ్ దశలో రెండు గ్రూప్‍లు ఆడతాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 8లో ఉన్న జట్లు ఇప్పటికే క్వాలిఫై అయ్యాడి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ , గ్రూప్‍బీలో అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చోటు దక్కించుకున్నాయి. హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు కొన్ని కండీషన్స్ తో ఒప్పుకుంది. ఈ టోర్నీ తర్వాత భారత్ లో జరిగే ఐసీసీ టోర్నీలకు కూడా హైబ్రిడ్ మోడల్ అమలు చేసే డీల్ తో ఓకే చేసింది. దీంతో 2027 వరకు భారత్‍లో జరిగే అన్ని ఐసీసీ టోర్నీలకు కూడా హైబ్రీడ్ మోడల్ ఉండనుంది. పాకిస్థాన్ ఆడే మ్యాచ్‍లు ఇండియాలో కాకుండా తటస్థ వేదికల్లో జరుగుతాయి.