CONG VS BJP VS Influencers: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కాంగ్, బీజేపీ ఎన్నికల రాజకీయం
ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయ్.. ఓటర్ల జాతరకు సమయం దగ్గరపడుతోంది..! ఇప్పటికే అన్ని పార్టీలు ఓటర్ల జపం మొదలుపెట్టేశాయ్..ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ శక్తినంతా ధారపోస్తున్నాయి. ఈ విషయంలో కోట్లు కుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఇక యూట్యూబ్ నుంచి ట్విట్టర్ వరకు ఏ సోషల్ మీడియాలోకి తొంగి చూసినా.. అన్ని పార్టీలు ప్రచారాలతో, ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో హోరెత్తిస్తున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది. పార్టీ పరంగానో, ప్రభుత్వం పరంగానో ఉండే సోషల్ మీడియా హ్యాండిల్స్ తో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడమే కాకుండా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా SOCIAL MEDIA INFLUENCERS ను రంగంలోకి దింపింది. ఇదేదో తెరవెనుక నడుస్తున్న వ్యవహారం కాదు.. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా.. SOCIAL MEDIA INFLUENCERS కు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించింది
ఎవరీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్?
టీవీలు, పత్రికలతో పోల్చితే ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది మొత్తం సోషల్ మీడియానే. ఉన్నది ఉన్నట్టే కాదు.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. చూపించడంలో సోషల్ మీడియా కీ రోల్ ప్లే చేస్తోంది. అందుకే రాజకీయ పార్టీల నుంచి కీలక నేతల వరకు అందరూ సోషల్ మీడియా అకౌంట్లను మెయింటెన్ చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో దుమ్మురేపాలంటే అందరి వల్ల కాదు. వ్యూవర్స్ ని కట్టిపడే కంటెంట్‌ను క్రియేట్ చేసిన వాళ్లే సోషల్ మీడియాలో కింగ్స్. వ్యూస్ నుంచి లైక్స్, ఫాలోయర్స్ వరకు ఇలాంటి వాళ్లకు మిలియన్లలో ఉంటాయి. వీళ్లే సోషల్ మీడియాను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తారు. అలాంటి వారిని ఏరికోరి మరీ ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి INFLUENCERS నడుపుతున్న సోషల్ మీడియా ఖాతాలకు లక్షల్లో డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యింది. అంటే ప్రజల్లో బాగా ప్రాచుర్యం ఉన్న SOCIAL MEDIA INFLUENCERS ను ఎంచుకుని వాళ్ల ఖాతాలపై ప్రకటనలను గుప్పించి.. ఓటర్లను ప్రభావితం చేయాలన్నది కాంగ్రెస్ సర్కార్ ప్లాన్.
నాలుగు రకాలుగా విభజించి మరీ ప్రకటనలు
పత్రికలకు, టీవీలకు ప్రకటనలు ఇవ్వడానికి అన్ని ప్రభుత్వాలు కొన్ని విధానాలను పాటిస్తాయి. ఆయా పత్రికలకు, టీవీ ఛానల్స్‌కు ఉన్న పాపులారిటీ ఆధారంగా ధర నిర్ణయిస్తాయి. రాజస్థాన్ ప్రజలకు తాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళితే.. మరోసారి కచ్చితంగా అధికారం తమదేనని నమ్ముతున్న గెహ్లాట్ ప్రభుత్వం… SOCIAL MEDIA INFLUENCERSకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్న INFLUENCERS నుంచి కనీసం 10వేల సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ల వరకు అందర్నీ నాలుగు రకాలుగా విడకొట్టి వాళ్లకు ప్రకటనలు ఇస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ఆయా అకౌంట్లను ఫాలో అయ్యే వాళ్లందరికీ ఇకపై రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దర్శనమివ్వబోతున్నాయి.
బీజేపీ రూట్‌లోనే వెళ్తున్న కాంగ్రెస్
సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, సోషల్ మీడియా ద్వారా తాము అనుకున్న , తమకు అనుకూలమైన ప్రచారాన్ని నిర్వహించడంలో కమలనాథులకు మించిన వాళ్లు ఎవరూ లేరు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా ఫేక్ ప్రచారాలు నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీల్లో బీజేపీ కూడా ఉంది. తెలంగాణ, రాజస్థాన్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ సోషల్ మీడియా వ్యూహాలను ఈ మధ్య మార్చేసింది. కేంద్ర మంత్రులు, బీజేపీకి చెందిన కీలక నేతలు ఇటీవల కాలంలో ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లలో ప్రత్యక్షమవుతున్నారు. ఇండియాలోనే ప్రముఖ యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులారిటీ సంపాదించిన రణవీర్ ఈ మధ్య కేంద్ర మంత్రులను ఇంటర్వ్యూ చేశాడు. యూట్యూబ్‌లో దాదాపు 60 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్న ఈయన రణవీర్ షో పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఎస్. జయశంకర్, రాజీవ్ చంద్రశేఖర్ లు రణవీర్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే ఇంటర్వ్యూలకంటే ఇవి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. 12 రోజుల వ్యవధిలోనే విదేశాంగ మంత్రి జయశంకర్ ఇంటర్వ్యూను 50 లక్షల మంది చూశారంటే.. రణవీర్ షోకున్న ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజ్ షమానీ అనే మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. వీళ్ల బాటలోనే సోషల్ మీడియాను సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. రాహుల్ జోడో యాత్రలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర నిర్వహించిన రాహుల్… రీజనల్, నేషనల్ మీడియాను పక్కన పెట్టేసి పూర్తిగా సోషల్ మీడియాకు ప్రాముఖ్యత ఇచ్చారు. జోడోయాత్ర చేస్తూనే ప్రముఖ యూట్యూబర్లకు ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇప్పుడు రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు ఎన్నికల ప్రకటనలు గుప్పిస్తోంది.
ఎన్నికల్లో గెలవాలంటే ఇదే మంత్రమా?
ఓటర్లను ప్రభావితం చేయడం అన్నది ఓ కళ. ఈ మధ్య అన్ని రాజకీయ పార్టీలు ఈ కళలో ఆరితేరుతున్నాయి. ప్రజలకు ఏం చేశాం, ప్రజా జీవితాల్లో ఎంతటి గుణాత్మకమైన మార్పు తెచ్చాం, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాం అన్న అంశాలకంటే.. ప్రజలను…ముఖ్యంగా ఓటర్లను ఎలా ప్రభావితం చేశాం అన్నదానికి దాదాపు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అందుకు సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా తాము రెగ్యులర్‌గా నిర్వహించే ప్రచారాలకు తోడు.. ప్రజల్లో మంచి పాపులారిటీ ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్‌ను పట్టుకుంటే.. తమ విధానాలు ఓటర్లలోకి ప్రభావంతంగా వెళ్తాయని పార్టీలు నమ్ముతున్నాయి. ఈ మధ్య కేంద్రమంత్రి పీయుష్ గోయల్…50 మంది ప్రముఖ యూట్యూబర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వం ఏం చేస్తుందో ఐదు గంటల పాటు వాళ్లకు వివరించారు. వీటికి ప్రచారం కల్పించాలని రిక్వెస్ట్ చేశారు.
టీవీలు పత్రికలు ఉండగా..సోషల్ మీడియా ఎందుకు ?
రేడియాలు, పత్రికలు, టీవీల్లో రెగ్యులర్‌గా చేసే ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. వాటికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తూనే సోషల్ మీడియాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి అన్ని పార్టీలు. ఎందుకంటే సోషల్ మీడియాతో పాటు SOCIAL MEDIA INFLUENCERS పవర్ ఏంటో పార్టీలకు తెలుసు కాబట్టి. కాలంతో పాటు పరుగులు తీస్తున్న ప్రజలు.. టీవీలు చూడటానికి, తీరిగ్గా కూర్చొని న్యూస్ పేపర్లు చదవడానికి పెద్దగా సమయం కేటాయించడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు… ప్రపంచమంతా వాళ్ల చేతుల్లో ఉన్నట్టే. ఈ మధ్య రాయిటర్స్ , ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సంయుక్తంగా న్యూస్ సర్వే నిర్వహించాయి. మన దేశంలో 53 శాతం మంది న్యూస్ తెలుసుకోవడానికి యూట్యూబ్‌ను వాడుతున్నారట. 51 శాతం మంది వాట్సప్ ద్వారా న్యూస్ తెలుసుకుంటున్నారు. దీనిని బట్టే అర్థమవుతుంది. సోషల్ మీడియా ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో. అసలే ఎన్నికల సీజన్ కావడంతో… రానున్న సంవత్సరంన్నర కాలంలో సోషల్ మీడియా మొత్తం పొలిటికల్ ప్రచారాలతో హోరెత్తబోతోంది.