Sharmila: కాంగ్రెస్ లో షర్మిల చేరితే.. ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?

వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. షర్మిల రాజకీయంగా తీసుకున్న నిర్ణయం సరైనదేనా ఇప్పుడు చూద్దాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2023 | 08:24 AMLast Updated on: Sep 04, 2023 | 8:24 AM

Who Will Benefit From Ys Sharmila Merging Her Party With Congress Whose Loss

కాంగ్రెస్ లో చేరే దిశగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ టీపీని హస్తం పార్టీలో విలీనం చేసి, తాను కూడా ఆ పార్టీలో చేరిపోవాలని ఆమె యోచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఇటీవల ఆమె కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీతోనూ భేటీ అయ్యారు. పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కాలనే దానిపై సోనియా ముందు షర్మిల ప్రపోజల్స్ పెట్టినట్టు తెలిసింది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే షర్మిల నిలుస్తారనేది క్లియర్ అయిపోయింది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ లోకి షర్మిల పార్టీ విలీనంతో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అనే దానిపై రాజకీయ విశ్లేషకులు తీరొక్క అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు.

ఏపీలోనే ఎక్కువ ప్రయోజనం..

షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ ఉండదని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతుండగా.. కాంగ్రెస్ కు ఈ పరిణామం ప్లస్ పాయింట్ అవుతుందని ఇంకొందరు లీడర్లు అంటున్నారు. వైఎస్సార్ టీపీకి తెలంగాణలో పెద్దగా క్యాడర్ కానీ, ముఖ్య నేతలు కానీ లేరని పలువురు హస్తం పార్టీ లీడర్లు వాదిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణలో అభిమానులు ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయిందని చెబుతున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ కు ఉన్న చరిష్మాతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదిగారని, ఇప్పుడు షర్మిల మాత్రం తండ్రి వైఎస్సార్ చరిష్మాతో ఎదగాలని యత్నిస్తున్నారని రాజకీయ పండితులు తులనాత్మక విశ్లేషణ చేస్తున్నారు. వైఎస్సార్ చరిష్మా తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువ వర్క్ ఔట్ అవుతుందని, షర్మిలను ఏపీలో వాడుకుంటే కాంగ్రెస్ కు ఎక్కువ మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా నివసించే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలలో షర్మిల ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ లభిస్తుందని చెబుతున్నారు. రెడ్డి, క్రైస్తవ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో షర్మిల ప్రభావం ఉంటుందనే ఆశాభావంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఒకవేళ ‘ఆంధ్రా’ ట్యాగ్ ను బీఆర్ఎస్ తెరపైకి తెస్తే.. కాంగ్రెస్ కు మైనస్ అయినా ఆశ్చర్యం ఉండదని పలువురు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు..

కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే.. ఇలాంటి ఓ గ్రూపు నేతలు కాంగ్రెస్ లో చేరాలని షర్మిలను కోరుతున్నారనే టాక్ వినిపిస్తోంది. కీలకంగా వ్యవహరిస్తున్న మరో గ్రూపులోని పలువురు లీడర్లకు చెక్ పెట్టేందుకే షర్మిలను వారు కాంగ్రెస్ లోకి పిలుస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన హస్తం పార్టీ సీనియర్ నేతలకు షర్మిల రాకతో బలం పెరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం రేవంత్ రెడ్డి వర్గానికి ప్రతికూలంగా పరిణమించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో రెండో ధ్రువంగా షర్మిలను నిలబెట్టడం ద్వారా .. రేవంత్ ఆధిపత్యానికి అవకాశం లేకుండా చేయాలని కొందరు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు వ్యూహరచన చేస్తున్నారట.