Delhi Liquor Scam: లిక్కర్ కేసులో నెక్స్ట్ ఎవరు..? సీబీఐ టార్గెట్ వాళ్లేనా..?

మొత్తంగా చూస్తే ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది... అయితే అది ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్... రేపు కావచ్చు.. వారం తర్వాత కావచ్చు.... అంతెందుకు ఈ రాత్రికే జరగొచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2023 | 09:11 AMLast Updated on: Feb 27, 2023 | 9:11 AM

Who Will The Next Target Of Cbi In Delhi Liquor Scam

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్.. సుదీర్ఘంగా విచారించిన సీబీఐ.. సిసోడియాను కస్టడీలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన పెద్ద తలకాయ ఇదే… దీంతో తర్వాత ఎవరిని అరెస్ట్ చేయబోతోందన్న చర్చ మొదలైంది. సీబీఐ దూకుడు చూస్తుంటే త్వరలో మరిన్ని అరెస్టులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అది ఎవరన్నదే పెద్ద సస్పెన్స్….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పనలో సిసోడియాది కీలక పాత్ర అని సీబీఐ ఆరోపిస్తోంది. ఆ తర్వాత సౌత్ గ్రూప్ చక్రం తిప్పిందని చెబుతోంది. ఆప్ ప్రభుత్వానికి సౌత్ గ్రూప్ వంద కోట్ల ముడుపులు చెల్లించిందన్నది ఆరోపణ. విజయ్ నాయర్ ద్వారా ఈ ముడుపులు అందాయన్నది ఆరోపణ. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే సౌత్ గ్రూప్ కు చెందిన పెద్దలను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవను అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి కూడా కస్టడీలోనే ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఎవరన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సౌత్ గ్రూపులో మిగిలిన పెద్దపేరు రెండే రెండు. అవి ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత… మరి వీరిద్దరిలో ఎవరినైనా సీబీఐ అరెస్ట్ చేస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను డిసెంబర్ 11న విచారించారు. ఛార్జ్షిషీటులోనూ ఆమె పేరును ప్రస్తావించారు. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు చేశారు. ఆమె ఆడిటర్ బుచ్చిబాబును కూడా విచారణకు పిలిచిన సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తర్వాత కవితేనా అన్న అనుమానాలు రేగుతున్నాయి. కవితకు మరోసారి నోటీసులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. విచారణకు పిలిస్తే మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ అని చెబుతున్నారు. ఇప్పటివరకూ అందరినీ విచారణ పేరుతో పిలిచి ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు.

లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేస్తారంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. సిసోడియా తర్వాత బేడీలు పడేది ఢిల్లీ ముఖ్యమంత్రికే అని చెబుతున్నారు. అయితే కేజ్రీవాల్ జోలికి సీబీఐ ఇప్పట్లో వెళ్లే అవకాశాలు లేవని చెబుతున్నారు. చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేసి కేజ్రీవాల్ ను ఇరుకులో పెట్టే వ్యూహాన్నే ఢిల్లీ పెద్దలు అనుసరించొచ్చు. సిసోడియా అరెస్టుతో కేజ్రీవాల్ కు గట్టి దెబ్బ తగిలినట్లే. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే అది రాజకీయ ప్రకంపనలకు దారి తీయవచ్చు…

ఏంటీ లిక్కర్ పాలసీ…?
2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని అమల్లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించింది. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేవలం ప్రైవేటు సంస్థలే ఆ పనిచేసేలా పాలసీని తీసుకువచ్చింది. లిక్కర్ హోమ్ డెలీవరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు. దీనివల్ల మద్యం ఆదాయంలో 27శాతం వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం భావించింది.

పాలసీ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, దీన్నో ఆదాయ వనరుగా మార్చేశారని, లోపాలతో ఎక్సైజే పాలసీని సిద్ధం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. హోల్ సేలర్లకు 12శాతం లాభాన్ని కట్టబెట్టే విధంగా పాలసీ ఉంది. అలాగే రీటైల్ వ్యాపారంలో 185శాతం లాభాలు వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించారని ఈడీ ఆరోపించింది. హోల్ సేలర్లకు వచ్చే 12శాతం లాభంలో సగం అంటే ఆరుశాతాన్ని ఆప్ లీడర్లకు ముడుపులుగా ఇచ్చేందుకు సౌత్ గ్రూపుతో ముందస్తు ఒప్పందం కుదిరిందని సీబీఐ, ఈడీ అంటున్నాయి. అందులో భాగంగా ఆప్ నేతల తరపున వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూపు నుంచి విజయ్ నాయర్ అందుకున్నట్లు ఈడీ ఆరోపించింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్లు చెబుతోంది.

కొత్త మద్యం విధానం ప్రకారం 32రీటెయిల్ జోన్లలో కొన్ని జోన్లు శరత్ చంద్రారెడ్డికి, మరికొన్ని మాగుంట రాఘవ యజమానిగా ఉన్న సంస్థలకు ఇంకొన్ని తెలుగు వారు యజమానులుగా ఉన్న సంస్థలకు దక్కాయి. మొత్తం 32జోన్లలో 9జోన్లను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సౌత్ గ్రూప్ కంట్రోల్ చేస్తోందన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. ఈ జోన్లను దక్కించుకున్న సంస్థల అసలు యజమానులు ఎవరు… అందులో వాటాదారులెవరనేది సీబీఐ తవ్వుతోంది. మొత్తంగా చూస్తే ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది… అయితే అది ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్… రేపు కావచ్చు.. వారం తర్వాత కావచ్చు…. అంతెందుకు ఈ రాత్రికే జరగొచ్చు… ఏం జరిగినా లిక్కర్ ప్రకంపనలు మాత్రం తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు సాగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

(KK)