హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారు..? దాని వెనకున్న రహస్యం ఇదే..!
ఆంజనేయుడు హిందువుల ఆరాధ్య దేవుడు. దక్షిణాదిలో హనుమంతుడికి వడమాల వేసి పూజిస్తారు భక్తులు. అలా ఎందుకు... ఆంజనేయుడికి వడమాలకు ఉన్న సంబంధం ఏంటి..? అని చాలా మందికి అనుమానాలు కలుగుతుంటాయి.
ఆంజనేయుడు హిందువుల ఆరాధ్య దేవుడు. దక్షిణాదిలో హనుమంతుడికి వడమాల వేసి పూజిస్తారు భక్తులు. అలా ఎందుకు… ఆంజనేయుడికి వడమాలకు ఉన్న సంబంధం ఏంటి..? అని చాలా మందికి అనుమానాలు కలుగుతుంటాయి. దీని వెనుక పెద్ద పురాణ కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో దేవుడికి … ఒక్కో నైవేద్యం పెట్టడం ఆనవాయితి. తిరుమల వేంకటేశ్వరుడికి లడ్డూ ప్రసాదం అంటే మహా ప్రీతి. వినాయకుడికి ఉండ్రాళ్లను, శ్రీరాముడికి వడపప్పు, పానకం, కృష్ణుడికి వెన్న ప్రీతికరం. ఇలా… భగవంతుడికి ఇష్టమైన ప్రసాదం సమర్పిస్తే… వారు సంతోషపడి ప్రసన్నులవుతారని… శుభ ఫలితాలు ఇస్తారని భక్తుల నమ్మకం. అలాగే హనుమంతుడికి కూడా వడమాల వేస్తారు. మినుములు, మిరియాలతో చేసిన వడమాలను హనుమంతుడికి సమర్పిస్తే.. ఆయన ఒక్కరే కాదు.. మరో ఇద్దరు కూడా సంతృప్తి చెందుతారట.
ఆంజనేయస్వామికి మంగళవారం… ఎంతో ప్రీతికరమైన రోజు. ప్రతి మంగళవారం హనుమంతుడిని… భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు భక్తులు. సింధూరం, తమలపాకులు, వడమాలను స్వామివారికి సమర్పిస్తారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మినుమలు, మిరియాలతో చేసిన 108 వడలను మాలగా చేసి… హనుమంతుడికి వేసి… పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలా ఎందుకు వేయాలనే దానికి… పురాణ కథను కూడా వివరిస్తున్నారు పండితులు. ఆ కథ ఏంటంటే…?
హనుమంతుడు చిన్నతనంలో చిలిపి చేష్టలు చేసేవాడని పురాణాలు చెప్తున్నాయి. బాల హనుమాన్ పసితనంలో సూర్యుడిని మింగిన కథ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కథ ప్రకారం.. సూర్యుడిని చూసి ఎర్రటి పండు అని భావించిన హనుమంతుడు… దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగురుతాడు. అది సూర్యగ్రహణ సమయం కావడంతో… రాహువు కూడా సూర్యడిని మింగేందుకు వస్తాడట. రాహువుని చూసిన ఆంజనేయుడు… ఆయన్ను పక్కకు తోసేస్తాడు. ఆ తర్వాత సూర్యుడిని మింగబోతాడు. అది తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై సంధిస్తాడు. వజ్రాయుధం తగలడంతో.. ఆంజనేయుడి దవడ గాయపడుతుంది. అది చూసి ఆంజనేయుడి తండ్రి వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు. దీంతో దేవతలంతా దిగివస్తారు. వాయుదేవుడిని శాంతింపచేసి… ఆంజనేయుడికి సకల వరాలు అందజేస్తారు. రాహువు కూడా హనుమంతుడి పరాక్రమానికి మెచ్చి వరాలు ఇస్తాడు. హనుమంతుడికి మినుములతో చేసిన వడలను నైవేద్యంగా పెడితే రాహుదోషాలు తొలగిపోతాయని చెప్తాడు. రాహువు.. సర్పాకారంలో ఉంటాడు కనుక… వడలను మాలగా చేసి ఆంజనేయుడికి వేస్తారు. హైందవ ధర్మంలో 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత బట్టి 108 వడలతో మాలను చేసి ఆంజనేయుడికి సమర్పిస్తారు. హనుమంతుడికి వడమాల సమర్పిస్తే… రాహుదోషమే కాదు.. శనిదోషాలు కూడా పోతాయని ప్రతీతి.
వడమాల వేసే సాంప్రదాయం దక్షిణాదిలో మాత్రమే ఉంటుంది. ఉత్తరాదిలో ఆంజనేయుడికి జిలేబీ మాల వేస్తారు. జిలేబీలు కూడా మినుములతోనే చేస్తారు. అయితే… ఉత్తరాదిలో చెరుకు ఎక్కువగా పండుతుంది. కనుక.. మినుములతో చేసే తీపి పదార్థంగా జిలేబీలు చేసి.. హనుమంతుడికి సమర్పిస్తారు. రాహు, శని దోషాల నుంచి విముక్తి కల్పించమని ప్రార్థిస్తుంటారు.