గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు..? అరుణాచలంలో చేస్తే విశిష్ట ఫలితాలు వస్తాయా..!
గిరిప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు భక్తులు. సింహాచలం, యాదగిరిగుట్ట, ఇంద్రకీలాద్రి, అరుణాచలం.. ఇలా ఎన్నో ఆలయాల్లో గిరిప్రదక్షిలు చేస్తుంటారు. అసలు గిరిప్రదక్షిణ అంటే ఏంటి..? ఎందుకు చేస్తారు..? అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఉన్న విశిష్టత ఏంటి...? ఇప్పుడు తెలుసుకుందాం.
గిరిప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు భక్తులు. సింహాచలం, యాదగిరిగుట్ట, ఇంద్రకీలాద్రి, అరుణాచలం.. ఇలా ఎన్నో ఆలయాల్లో గిరిప్రదక్షిలు చేస్తుంటారు. అసలు గిరిప్రదక్షిణ అంటే ఏంటి..? ఎందుకు చేస్తారు..? అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఉన్న విశిష్టత ఏంటి…? ఇప్పుడు తెలుసుకుందాం.
గిరిప్రదక్షిణ మూలం పురాణాల్లో ఉంది. కొండపైన కొలువైన స్వామివారు లేదా అమ్మవారు ఉంటే.. దాన్ని గిరి అంటారు. కొండపై వెలిసిన స్వామివారికే కాకుండా… ఆయన వెలసిన కొండకు కూడా ప్రదక్షిణ చేయడమే గిరిప్రదక్షిణ అంటారు. భగవంతుడిని తన భుజాలపై మోస్తోంది ఆ కొండ. అంతటి భాగ్యం వచ్చిందంటే… మామూలు విషయం కాదు. ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల.. ఆ కొండపై భగవంతుడు పాదాలు మోపడమే కాకుండా.. ఆయనను మోసే భాగ్యం దక్కిందని.. భక్తులు విశ్వాసం. అలాంటి కొండకు ప్రదక్షిణ చేస్తే… మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు. అందుకే గిరిప్రదక్షిణ చేసి.. తనకూ అలాంటి భాగ్యం కలగాలని… జన్మజన్మల పాపాలు నశించి.. మోక్షం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
యాదగిరిగుట్టపై కూడా అయ్యప్పస్వాములు సామూహిక గిరిప్రదక్షిణ నిర్వహించారు. వేలాది మంది తరలివచ్చి.. కొండ చూట్టూ తిరిగారు. కొండ కింద వైకుంఠద్వారం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన అయ్యప్పస్వాములు.. గిరిప్రదక్షిణ చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. ఆ తర్వాత… ప్రధాన, అనుబంధ ఆలయాలను సందర్శించారు. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పాలతో ప్రత్యేక ఆరాధన జరిగింది.
సింహాచలంలో కూడా ఏడాది ఒకసారి గిరిప్రదక్షిణ జరుగుతుంది. లక్షలాది భక్తులు.. ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటారు. గిరిప్రదక్షిణ చేస్తే భువి ప్రదక్షిణ చేసినట్టే అని భావిస్తారు. అంతేకాదు… వనమూలికలు కలిగిన సింహాచలం కొండచుట్టూ తిరిగితే ఆయురారోగ్యాలు కలుగుతాయన్న విశ్వాసం కూడా ఉంది. ఇంద్రకీలాద్రిపై కూడా గిరిప్రదక్షిణ జరుగుతుంది. అన్ని ఆలయాల కంటే.. అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి వచ్చిందంటే చాలు… లక్షలాది మంది భక్తులు… ఆలయానికి చేరుకుని.. గిరిప్రదక్షిణ చేస్తారు. అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఎందుకంత విశిష్టత ఉందో తెలుసుకుందాం.
అరుణాచలం ఆలయం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది. పంచభూత లింగక్షేత్రాలలో… అరుణాచలం అగ్ని భూతానికి సంబంధించింది. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. దీనినే తమిళంలో తిరువన్నామలై అంటారు. అందుకే ఆ ప్రాంతానికి తిరువన్నామలై అని పేరు వచ్చింది. తిరువాన్నామలైని కైలాస పర్వతంగా భావిస్తారు శివ భక్తులు. అరుణాచల క్షేత్రంలో గిరిప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం. ఆయన కొలువైన కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తే… సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. కాళ్లకు చెప్పులు లేకుండా.. శివనామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే.. వారికి ఎంతో పుణ్యం దక్కుతుందట. మోక్షం కూడా లభిస్తుందట. అరుణాచలం ఆలయంలో రోజూ గిరిప్రదక్షిణ ఉంటుంది. అయితే… పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరిప్రదక్షిణ చేయడం వల్ల విశిష్ట ఫలితాలు కలుగుతాయట. అందుకే.. పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేసేందుకు భక్తులు లక్షలాది తరలివస్తారు. పురాణాల ప్రకారం… గంధర్వులు, దేవతలు, మహర్షులే కాకుండా.. 14 లోకాల వారు ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో భూలోకం వచ్చి… అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట.