BJP SUSPENSE : ఎందుకీ సస్పెన్స్? ఏపీలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

ఏపీలో పొత్తులపై బీజేపీ (BJP) గందరగోళం కొనసాగిస్తోంది. తన మనసులో మాట ఏంటో బయటకు రాకుండా అత్యంత గోప్యత పాటిస్తో్ంది. మరోవైపు టీడీపీ(TDP), జనసేన (Janasena) కలిసి సభలు పెట్టడం, అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం కూడా చేశాయి. మరి ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు? ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అయినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నింపాదిగా వ్యవహరిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2024 | 11:27 AMLast Updated on: Mar 01, 2024 | 11:45 AM

Why The Suspense What Is Bjps Game Plan In Ap

 

ఏపీలో పొత్తులపై బీజేపీ (BJP) గందరగోళం కొనసాగిస్తోంది. తన మనసులో మాట ఏంటో బయటకు రాకుండా అత్యంత గోప్యత పాటిస్తో్ంది. మరోవైపు టీడీపీ(TDP), జనసేన (Janasena) కలిసి సభలు పెట్టడం, అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం కూడా చేశాయి. మరి ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు స్పందించడం లేదు? ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. అయినా బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నింపాదిగా వ్యవహరిస్తోంది. దీంతో అసలు బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని బయటకు చెప్పడం లేదా..? నిజంగానే ఏమీ తేల్చుకోలేదా..? అనే సందేహాలు వస్తున్నాయి. బీజేపీ తీరుతో టీడీపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడ్డాయి. బీజేపీ ఏ సీట్లు అడుగుతుందో, ఆ పార్టీకి ఏ సీట్లు ఇస్తారో తేలకుండా.. తామెలా పనిచేసుకోవాలనేది వారి రాజకీయ సందేహం. ఇంతవరకు బీజేపీ అడిగే సీట్లపై క్లారిటీ రాకపోతే.. చివర్లో వారికి ఇచ్చే సీట్లలో ఉన్న నేతల్ని ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తున్నారు. వీలైనంత ఎక్కువ షరతులకు ప్రయత్నిస్తున్నారా.. అసలేం ఆశిస్తున్నారనేదే తేలడం లేదు. అగ్రనేతలు పెదవి విప్పడం లేదు. ఏపీలో బీజేపీ నేతలు మాత్రం అంతా హైకమాండే అంటారు. మరీ ముఖ్యంగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత కూడా సస్పెన్స్ కొనసాగటం రాజకీయ వర్గాలకు మరీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం మొదట్నుంచీ గందరగోళంగానే ఉంది. జనసేన టీడీపీ మిత్రపక్షం అంటుంది. బీజేపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామి అని చెబుతుంది. మొన్నటివరకు టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైనా.. సీట్ల సర్దుబాటు ఎప్పుడు అనే ప్రశ్నలుండేవి. ఇప్పుడు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో.. ఆ ప్రశ్నలకు తెరపడినా.. మరి బీజేపీ సంగతేంటనేది కొత్త ప్రశ్న.. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి ఏది గెలిచినా సాంకేతికంగా బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదు…. ఆ పాతిక సీట్లూ బీజేపీవే. ఎవరు గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. బీజేపీ ధైర్యానికి కారణం అది కూడా కావొచ్చు. ఇన్నిరోజులుగా సాగుతున్న పొత్తుల సస్పెన్స్ ఎపిసోడ్ లో ఒక్క విషయం మాత్రమే కాస్త లీకైంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు అడుగుతోందనే వాదన వినిపించింది. కానీ ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు. ఔననో, కాదనో ఏమీ చెప్పలేదు. ఎవరికి వారు పోటీపడి మౌనం పాటిస్తున్నారు.

ప్రజలు, మిగతా పార్టీల సంగతి సరే.. సొంత పార్టీ నేతల్లోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి. ఎవరికి వారు ఇలా అయ్యుండొచ్చు అని ఊహించుకోవడమే కానీ.. అక్కడ్నుంచి ఏమీ క్లారిటీ రావడం లేదు. హైకమాండ్ మాత్రం నోరు విప్పడం లేదు. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా ఆశల్లేవు. మామూలుగా అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పోయేదేముంది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదంటోంది బీజేపీ. కమలం పెద్దల మనసులో మాటేంటో బయటపెట్టడానికి ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. పార్టీల అధినేతలు కూడా తమ మీటింగుల తర్వాత క్లారిటీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి లోపల ఏం చెప్పారో తెలియదు. ఎన్నికలకు గట్టిగా 2 నెలల సమయమే ఉంది. మరి ఏపీలో ఇకపై బీజేపీ ఎలాంటి పావులు కుదుపుతుందనేది చూడాలి.

పొత్తు విషయంలో బీజేపీ వ్యూహమేంటో అంతుచిక్కడం లేదు. ఎన్ని సీట్లు అడిగినా ఇస్తారులే అనే ధీమా కూడా ఉండి ఉండాలి. బీజేపీ ఏపీలో పొలిటికల్ గా సేఫ్ పొజిషన్ లో ఉంది. అక్కడ ఆ పార్టీకి కొత్తగా పోగొట్టుకోవటానికి ఏమీ లేదు. ఏ పార్టీ బలపడ్డా ఆందోళన కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎవరు గెలిచినా.. అంతిమంగా అందరూ బీజేపీకే చేయూత ఇస్తారు. అందులో నో డౌట్. ఏపీలో బీజేపీ నేతలు, క్యాడర్ కూడా హైకమాండ్ ఎన్నికల వ్యూహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ పంపారు. అగ్రనేతలైతే ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. పరోక్షంగా కూడా సంకేతాలు అందకుండా చూసుకుంటున్నారు. ఇంత గుంభనంగా ఎందుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. పొత్తుల బంతి అటూ ఇటూ తిరిగి.. ఇప్పుడు ఫైనల్ గా బీజేపీ హైకమాండ్ కోర్టులోకి వెళ్లింది. అక్కడ గేమ్ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది చూడాలి.
ఏపీ బీజేపీలో పొత్తులపై అంతర్గతంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఏం చర్చ జరుగుతుందో కూడా బయటకు చెప్పే సాహసం ఎవరూ చేయట్లేదు. పొత్తులపై నోరు తెరవద్దని హైకమాండ్ గట్టిగా చెప్పిందనే వాదన వినిపిస్తోంది.

ఏపీలో రాజకీయ వ్యూహంపై బీజేపీ ప్రస్తుతం సైలంట్ గా ఉన్నా.. అంతర్గతంగా పావులు కదుపుతోందని అంటున్నారు. చెస్ బోర్డు, స్టెప్స్ రెడీగానే ఉన్నాయి.. ఆట మొదలుపెట్టడమే తరువాయి అంటున్నారు. కాషాయ పార్టీ మౌనంగా ఉండటంతో.. చాలా రకాల వాదనలు వస్తున్నాయి. ఇవి ఓ కొలిక్కి రావాలన్నా బీజేపీ నోరు తెరవాల్సిందే. ఇలా ఎన్ని ఊహాగానాలైనా ఎవరైనా చేసుకోవచ్చు. అసలు ఏపీ బీజేపీలో కూడా క్లారిటీ లేదనే వాదన ఉంది. బీజేపీ వ్యూహంపై ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఏమీ చెప్పడం లేదు. కనీసం లీకులు కూడా వదలడం లేదు. చెప్పాల్సింది చెప్పాల్సిన టైమ్ లోనే చెబుతాం అన్నట్టుగా ఉంది. బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ, జనసేన మాత్రమే కాదు రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేదు. ఓటుబ్యాంకు పెద్దగా లేదు. అసలు ఉనికే లేదు. కానీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ఏంటా అని రాజకీయ వర్గాలు ఎదురుచూసే పరిస్థితి. ఇదే ఏపీలో చిత్రమైన పరిస్థితి. ఈ పీటముడి వీడాలంటే బీజేపీ నోరు తెరవాల్సిందే. అదెప్పుడు అనే సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని, కానీ అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటే వచ్చే మజాను ఆస్వాదిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీకి ఏపీలో బలం లేకపోవచ్చు. కానీ దేశంలో అత్యంత బలమైన పార్టీ. ఏపీలో నోటాపాటి ఓట్లు లేకున్నా.. బీజేపీని కాదని పార్టీలు ముందడుగు వేయలేని స్థితి. టీడీపీ, జనసేన అయితే బీజేపీ నిర్ణయం కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నాయి. త్వరగా నిర్ణయం చెప్పండి అని అడుగుతున్నాయి. కానీ కాషాయ పార్టీ మాత్రం అలాగే సాగదీస్తోంది. చూద్దాం.. చెబుదాం అంటోంది. ఎప్పుడు అంటే.. చెప్పినప్పుడే అని ఊరిస్తోంది. అదే ఎప్పుడు చెబుతారంటే.. సమయం వచ్చినప్పుడని చెబుతామంటోంది. ఆ సమయం వచ్చేదెప్పుడు అంటే.. మేం ఏ విషయం చెప్పినప్పుడే అని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇలా కాలికేస్తే మెడకూ.. మెడకేస్తే.. కాలికీ వేస్తోంది. కానీ ఏ విషయం తేల్చడం లేదు. ఎన్నికలొస్తున్నాయంటే.. కంగారెందుకు అంటోంది. ఏదొక నిర్ణయం మేం తీసుకుంటాం కదా.. ఆగలేరా అని ఎదురు ప్రశ్నిస్తోంది.

ఏ ఎన్నికలకైనా మొదట వ్యూహరచన చేయాలి. తర్వాత ప్రచార అజెండా చూసుకోవాలి. కానీ బీజేపీ ఇంతవరకూ వ్యూహరచన విషయంలో ఏమీ తేల్చలేదు. ఒకవేళ బీజేపీ నిర్ణయం తీసుకున్నా.. పైకి మాత్రం ఏమీ చెప్పడం లేదు. ఈ అతిరహస్యం ఎప్పుడు బట్టబయలౌతుంది.. అసలు వ్యూహం ఉందా.. లేకపోతే ఆఖరి నిమిషంలో వ్యూహరచన చేస్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల ఎత్తుగడల్లో బీజేపీ ఆరితేరింది. అసలు అవకాశం లేనిచోట.. ఎంతో కొంత పుచ్చుకోవడం అలవాటు చేసుకుందనే వాదన ఉంది. మరి ఏపీలో బీజేపీ ఏం ఆశిస్తోంది.. ఎవరి ఊహలకు అందని ఫలితం కోసం ట్రై చేస్తుందా అనే విషయం కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఏపీలో బీజేపీ వ్యూహమేంటా అని ఆ పార్టీ కంటే మిగతా పార్టీలే ఎక్కువగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి. బీజేపీ మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూ.. చిద్విలాసంగా చూస్తోంది.