BJP: 60 సీట్లు కొట్టే సత్తా లేదు.. 25 గెలిస్తే గేమ్ మార్చేయొచ్చు.. తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఇదే..

తెలంగాణ 2023 ఎన్నికల్లో బీజేపీ కింగ్ మేకర్ గా మారనుందా.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి గేమ్ ఛేంజర్ పాత్ర పోషిస్తుందా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 12:33 PMLast Updated on: Aug 18, 2023 | 12:33 PM

Will Bjp Be A Game Changer In Telangana Elections 2023

తెలంగాణలో మొన్నటిదాకా బీఆర్ఎస్‌కు గట్టి పోటీగా కనిపించిన బీజేపీ.. ఇప్పుడు మూడో స్థానంలోకి వెళ్లిందనే అభిప్రాయాలు ఉన్నాయ్. ఐతే అవేవీ పట్టించుకోకుండా ఎన్నికల్లో గట్టిగా పోరాడాలని ఆ పార్టీ హైకమాండ్ తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేసింది. ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాల్సి ఉంది. తమ ప్లాన్ తమకుందని ధీమాగా చెబుతోంది కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల కోసం నాయకత్వాన్ని మార్చి కొత్త టీంతో ఎన్నికలను ఎదుర్కోవాలనే ఆలోచన చేసింది బీజేపీ హైకమాండ్‌. బీఆర్‌ఎస్ వ్యూహాలను ఎరిగిన సీనియర్ నేత ఈటలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది. కాంగ్రెస్ లోతు తెలిసిన డీకే అరుణకు కొత్త బాధ్యతలు అప్పగించి కాంగ్రెస్ స్పీడ్‌కు హ్యాండ్ బ్రేక్ వేయాలని అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక్కసారిగా తిరగబడింది. పార్టీలోకి వెల్లువలా వస్తారు.. ఇంతమంది నాయకులు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ లాంటి నేతలు గతంలో ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడేమో సీన్ రివర్స్.. వచ్చే వాళ్ల సంగతి తర్వాత.. తమ పార్టీ నుంచి ఎరూ వెళ్లడం లేదని చెప్పుకోవాల్సి వస్తోంది.

ఆ పార్టీలో చేరిన నేతలందరి పైనా.. పార్టీ మార్పు ప్రచారాలు జరుగుతున్నాయ్. బీజేపీలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదన్న ఈటల రాజేందర్ మాటలు.. బీజేపీ దుస్థితికి అద్దం అద్దం పడుతున్నాయ్. ఇప్పుడల్లా బీజేపీలో చేరికలు ఉండే అవకాశం లేదని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తెలంగాణలోనూ మతం ఆధారంగా బలం పెంచుకోవాలని బీజేపీ చూసింది. ఎప్పుడు ఎన్నికల వచ్చినా… ఆ దిశగానే పావులు కదుపుతోంది. ప్రజా సమస్యలపై పోరాడితేనే ఫలితం ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించినట్టే కనిపించింది. తెలంగాణలాంటి రాష్ట్రంలో తమ పోలరైజేషన్ వ్యూహాలు గిట్టుబాటు కావనే విషయాన్ని గుర్తించటంలో కూడా బీజేపీ నాయకత్వం విఫలమైనట్లు అనిపిస్తోంది. మోదీ ఇమేజ్ పైనే పూర్తిగా ఆధారపడి ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది.

ఈ తరహా విధానాలతో క్షేత్రస్థాయిలోని జనాలతో మమేకం కావటం, కేసీఆర్ వంటి బలమైన నేతను ఢీకొట్టడం కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడిప్పుడే బీజేపీ వ్యూహం మార్చుకుని.. కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాలన్నీ గెలిచేలా వ్యూహరచన పూర్తి చేసినట్టు చెప్తోంది. ఇన్నాళ్లు బీఆర్ఎస్‌కు సరైన ప్రత్యామ్నాయం బీజేపీయే అనే వాతావరణం కనిపించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఏకంగా చేరికల కమిటీ అనే కొత్త వ్యవస్థను ఆ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఇతర పార్టీల నుంచి కొద్ది మందే చేరారు. ఐతే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఆ పార్టీ శ్రేణుల్లోనే ఉత్సాహం తగ్గిపోయింది. అదే సమయంలో చేరికలూ ఆగిపోయాయ్. ఆ పార్టీలో చేరాలనుకున్న వారు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర నాయకత్వంలో బీజేపీ హైకమాండ్ సంస్థాగత మార్పులు చేసింది. మరోవైపు అధికార బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ.. కుటుంబ, అవినీతి పాలన అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ.

ఈ విషయాన్ని ప్రచారం చేయటంలో ఎంతో కొంత సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కానీ కేసీఆర్‌ను ఢీకొట్టే నాయకుడు ఆ పార్టీలో లేకపోవటం, జనాల్లో విశ్వసనీయత ఉన్న నేతల లోటు, పూర్తిగా హిందుత్వవాద ప్రచారంపై ఆధారపడటం వంటి కారణాలతో.. తెరపైకి తీసుకొచ్చిన అవినీతి, కుటుంబ పాలన అంశాలను సరిగా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని ప్రస్తుత పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. తెలంగాణలో తమ పని పూర్తిగా అయిపోలేదని.. ఇంకా ఛాన్స్ ఉందని బీజేపీ బలంగా నమ్ముతోంది. కొన్ని జిల్లాల్లో చాలా బలంగా ఉన్నామని, ఆ బలాన్ని కాపాడుకుంటూనే.. బలహీనంగా ఉన్న చోట స్థానిక పరిస్థితుల్ని బట్టి వ్యూహరచన చేయాలని అధిష్ఠానం.. తెలంగాణ నేతలకు ఆదేశాలిచ్చింది. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా సీనియర్లతో సమావేశమై.. ఎన్నికల వ్యూహం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. చాప కింద నీరులా పనిచేసేలా వ్యూహం ఉందని, కచ్చితంగా అందర్నీ ఆశ్చర్యపరిచే ఫలితాలు వస్తాయనేది బీజేపీ నమ్మకం.