WARANGAL : కాంగ్రెస్ కంచుకోట అయిన వరంగల్ లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేనా..?
వరంగల్ లోక సభ సెగ్మెంట్... ఎస్సీ రిజర్వుడ్. ఈ నియోజకవర్గంలో... భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 18 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. 1977లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రధాని పీవీ నరసింహారావు గెలిచారు. 1980లోనూ పీవీ మరోసారి విజయం సాధించారు.
వరంగల్ పార్లమెంట్ స్థానం… ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఒక్కసారి బిజెపి గెలిచింది.. మధ్యలో పసుపు జెండా రెపరెపలాడింది. ఇక టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంట్ స్థానం గులాబీ సేనకు పెట్టని కోటగా మారింది.. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు వరంగల్ పార్లమెంట్ లో పాగా వేయాలని పోరాడుతున్నాయి. గత వైభవం కోసం కాంగ్రెస్… మరోసారి చరిత్ర సృష్టించాలని బీజేపీ… సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు BRS తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వరంగల్ లోక సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తన హస్త వాసి చూపిస్తుందా.. నాటి జాయింట్ కిల్లర్ ఫార్ములాతో కమలదళం కవాతు చేస్తుందా… ఉద్యమాల ఖిలాలో BRS పట్టు నిలుపుకుంటుందా అన్నది పవర్ ఫైట్ లో చూద్దాం..
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో వరంగల్ పార్లమెంట్ స్థానం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గానే ఉంటుంది. దేశానికి ప్రధానిని అందించిన ఘనత… అలాంటి అపర చాణక్యుడు పీవీని ఓడించిన చరిత్ర కూడా వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉంది. ఈసారి అర్థబలం, అంగబలం ఉన్ననేతలని పార్టీల్లోకి తీసుకొని పార్టీలు టికెట్లు ఇచ్చాయి. BRS టికెట్ ప్రకటించాక కడియం శ్రీహరి కూతురు కావ్యను పిలిచి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చింది. అర్థబలం ఉన్న ఆరూరి రమేష్ ను తీసుకొని బీజేపీ నిలబెట్టింది. తమకు హ్యాండిచ్చిన కడియం కావ్య, ఆరూరి రమేష్ కి చెక్ పెట్టాలని… సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను BRS దింపింది. దాంతో వరంగల్ లోక సభ సెగ్మెంట్ లో ముక్కోణపు పోటీ నడుస్తోంది. 3పార్టీల అభ్యర్థులూ గులాబీ పార్టీ నుంచి వచ్చినవాళ్ళే కావడంతో వరంగల్ పార్లమెంట్ ఆసక్తికర పోరు మారింది.
వరంగల్ లోక సభ సెగ్మెంట్… ఎస్సీ రిజర్వుడ్. ఈ నియోజకవర్గంలో… భూపాలపల్లి, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 18 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. 1977లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రధాని పీవీ నరసింహారావు గెలిచారు. 1980లోనూ పీవీ మరోసారి విజయం సాధించారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగితే…ఆరు సార్లు కాంగ్రెస్… ఒకసారి బీజేపీ, రెండు సార్లు టీడీపీ, 4సార్లు BRS గెలిచాయి. మొన్నటిదాకా BRSకు కంచుకోటగా ఉన్న వరంగల్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో… ఏడింటిలో ఆరు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. BRS నుంచి గెలిచిన స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ లో చేరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఉండటంతో ఆ పార్టీ టికెట్ కోసం నేతలు భారీగా పోటీ పడ్డారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ కడియం కావ్యను దించింది అధిష్టానం. ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె కొత్తయినా కడియం శ్రీహరి వారసురాలిగా బరిలోకి దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం… అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయం కావ్యకు కలిసొచ్చే అంశం. కావ్యను గెలిపిస్తే… వరంగల్ సిటీలో డ్రెనేజీతో పాటు ఎయిర్ పోర్ట్, మెగా టెక్స్ లైట్ పార్కు అభివృద్ధి చేస్తామని, ఇండస్ట్రియల్ కారిడార్ కు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలోనూ అభివృద్ధి పనులపై సొంత మేనిఫెస్టో ఇచ్చారు కడియం కావ్య. మొదట్లో ఆమెను వ్యతిరేకించిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. కావ్య ముస్లింని పెళ్ళాడిందన్న ప్రచారం ఆమెకు పాజిటివ్ గా మారింది. ఇక్కడి ముస్లిం ఓట్లు కడియం కావ్యకి పడే ఛాన్స్ ఉంది.
నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న క్రిస్టియన్ ఓట్లు కాంగ్రెస్ కే పడతాయి. తండ్రి కడియం శ్రీహరి చరిష్మా కలిసొస్తుందని అంచనా ఉంది. మాదిగల ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో మంద కృష్ణ మాదిగ విమర్శలు కావ్యను కొంత ఇబ్బంది పెట్టే ఛాన్సుంది. కావ్య గుంటూరు నివాసిని పెళ్ళి చేసుకోవడంతో ఆమె వరంగల్ కి సంబంధం లేదన్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ఈ డామేజ్ ని తండ్రి కడియం శ్రీహరి కవర్ చేసినా… నాన్ లోకల్ రచ్చ ఇంకా కంటిన్యూ అవుతోంది.
తెలంగాణలో గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకున్న సీట్లలో వరంగల్ ఒకటి.
ఈసారి ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థిగా నిలబడంతో 40 ఏళ్ల తర్వాత బీజేపీకి గెలుపుపై ఆశ కనిపిస్తోంది. రాష్ట్రంలో BRS బలహీన పడటం, మోడీ చరిష్మాతో బీజేపీ బలపడటం… అర్థబలం, అంగ బలం ఉన్న ఆరూరి రమేష్ వరంగల్ పోటీ చేస్తుండటం ఆ పార్టీకి ప్లస్ గా మారాయి. మాదిగ సామాజిక వర్గం ఓట్లు తనకే వస్తాయని ఆశతో ఉన్నారు. కడియం శ్రీహరి మాదిగ కాదంటూ మందకృష్ణ చేస్తున్న అలిగేషన్ ఆరూరి రమేష్ కి కలిసొచ్చే అంశం. తనను గెలిపిస్తే వరంగల్ సిటీకి నెల రోజుల్లో ఎయిర్ పోర్ట్ తెస్తాననీ.. నగరంలో అండర్ డ్రెనేజీ, ఐటీ పార్కులు, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్కుకు నిధులు తెస్తానని అంటున్నారు ఆరూరి రమేష్. అవినీతి, భూకబ్జా ఆరోపణలున్న ఆరూరి రమేష్… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనపై వ్యతిరేకతకు ఇదొక ఉదాహరణ. వరంగల్ లో బీజేపీకి బలమైన కేడర్ లేదు. ఇక్కడి ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో రమేష్ కష్టపడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచీ వరంగల్ ప్రజలు BRSకు అండగా ఉన్నారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి దారుణంగా ఉంది. BRS కీలక నేతలంతా గుడ్ బై చెప్పడంతో కొంత బలహీనపడింది. కడియం కావ్యకు BRS టికెట్ ఇచ్చాక… హ్యాండిచ్చి కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో పార్టీ శ్రేణులు ఢీలా పడ్డారు. విధిలేక హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. వరంగల్ లో అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం కేసీఆర్ పర్యటనతో వరంగల్ లో ఆ పార్టీకి కొంత ఊపువచ్చింది. అయితే గెలిచే పరిస్థితులు మాత్రం రాలేదు. వరంగల్ పార్లమెంట్ కి సుధీర్ కుమార్ నాన్ లోకల్ అన్న ప్రచారం మైనస్ గా మారుతోంది. వరంగల్ లో BRSది థర్డ్ ప్లేస్ అంటున్నారు. కావ్య గెలుపును అడ్డుకొని పంతం నెగ్గించుకోవాలనే బీఆర్ఎస్ తీరు బీజీపీకి కలిసొస్తుందా ? వరంగల్ పార్లమెంట్ పరిధిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటంతో కాంగ్రెస్ బయటపడుతుందా అన్నది తేలనుంది.