Jayaprakash Narayana: జేపీ వైసీపీలో చేరబోతున్నారా ?
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ జనసేనలో చేరబోతున్నారనే వార్తలు ఈమధ్య కాలంలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన ఆప్కాబ్ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పాల్గొనడమే ప్రదాన కారణం అని చెప్పాలి.
లోక్‌సత్తా సంస్థ, పార్టీ ద్వారా.. జనాల్లో గుర్తింపు తెచ్చుకున్న జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరబోతున్నారా.. ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌కు పోటీ చేయబోతున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోందిప్పుడు. ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌తో కలిసి జయప్రకాష్ పాల్గొనడమే ఈ ప్రచారానికి కారణం. ఈ కార్యక్రమంలో ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని.. జేపీ వైసీపీలోకి రావడం ఖాయమని ప్రచారం ఊపందుకుంది. ఐఏఎస్ అధికారి అయిన జేపీ.. తన పదవికి రాజీనామా చేసి లోక్‌సత్తా అనే సంస్థ స్థాపించారు.
సమాజంలో మార్పుకోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన లోక్‌సత్తా పార్టీ రెండు శాతం ఓట్లు సాధించింది. ఆ పార్టీ తరఫున జేపీ ఒక్కరే.. కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తర్వాత తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆయన అనుచరులు కొందరు నామమాత్రంగా పార్టీని నిర్వహిస్తున్నారు. జేపీ రాజకీయ పార్టీని రద్దు చేసుకుని ఉండొచ్చు కానీ ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది.
జేపీ పార్లమెంటుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి జేపీకి ఆహ్వానం రావడంతో ఆయన విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఆప్కాబ్ సమావేశానికి ఆయన ఎందుకు హాజరయ్యారనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఆప్కాబ్‌తో జేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పదవిలో ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రితం ఆప్కాబ్ చైర్మన్ గా పని చేశారు. అంతమాత్రానికే ఆప్కాబ్‌కు సంబంధించిన కార్యక్రమానికి.. అందులోనూ విజయవాడకు పిలవడం వల్ల రాజకీయ ఉద్దేశ్యాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ పబ్లిక్ మీటింగ్‌లో జేపీ, జగన్ కలిసి పాల్గొనడం ద్వారా జేపీ రాజకీయ ప్రవేశంపై హింట్ ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.