Revanth Reddy: బస్సు యాత్ర చేస్తే అధికారం ఖాయమా ? కర్ణాటక ప్లాన్ తెలంగాణలో ఫలిస్తుందా ?కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటి ?
ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.
ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. రాజశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు వరకు యాత్రలు చేసినవాళ్లే. తెలంగాణలో కూడా పాదయాత్రల సీజన్ నడుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో పాదయాత్రను పూర్తిచేయగా.. పట్టు వదలని భట్టి విక్రమార్క అనేక మైలురాళ్లను దాటుకుంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే వ్యక్తులుగా ఎవరికి వారు చేసే పాదయాత్రల కంటే ఐక్యంగా అందరూ చేసే బస్సు యాత్ర ద్వారా అధికారానికి దగ్గరవ్వొచ్చని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో సీనియర్ నేతలంగా కలిసి ఐక్యంగా బస్సు యాత్ర చేసే ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
జంబో బస్సు యాత్రతో ఐక్యత సాధ్యమేనా ?
సాధ్యమైనంత త్వరగా బస్సుయాత్ర చేపట్టాలి. అది కూడా ఒకరిద్దరి నేతలో మొక్కుబడి యాత్ర కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పాల్గొనేలా జంబో బస్సు యాత్ర చేపట్టాలి.. అనేక వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ నేతలంతా చేయి చేయి పట్టుకుని ఐక్యత యాత్ర చేయాలి.. ప్రజలను కలవాలి.. భవిష్యత్తుపై భరోసా ఇవ్వాలి.. బీఆర్ఎస్‌ను ఎందుకు ఓడించాలో… కాంగ్రెస్‌ను ఎందుకు గెలిపించాలో చెప్పాలి. ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్ విధించిన టార్గెట్.కర్ణాటక కాంగ్రెస్‌లోనూ ఇదే జరిగింది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వర్సెస్ అదర్స్ గా చీలిపోయిన కర్ణాటక కాంగ్రెస్‌ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీని ఓడించేందుకు విభేదాలను పక్కనపెట్టి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టారు. అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయబోతున్నారు.
100 నియోజకవర్గాలు.. 150 రోజులు
మరికొన్ని వారాల్లోనే పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ మెగా టూర్ ప్లాన్ రెడీ చేసింది. జంబో బస్సు యాత్ర ద్వారా 150 రోజుల్లో వంద నియోజకవర్గాలను చుట్టేయాలని డిసైడ్ అయ్యింది. కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల్లో పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కనుగోలు.. తెలంగాణలో ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు. జంబో బస్సుయాత్ర ఐడియా కూడా ఆయనదేనంటున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా టాప్ టు బోటమ్ అందరూ ఒకే తాటిపై ఉన్నారన్న సందేశాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడమొహం, పెడమొహంగా ఉండే సీనియర్ లీడర్లందర్నీ బస్సెక్కించాలన్నది హైకమాండ్ ప్లాన్. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ.. ఇలా తెలంగాణ కాంగ్రెస్ నేతలందర్నీ జంబో బస్సుయాత్రలో భాగస్వామ్యం చేయబోతున్నారు.
త్వరలోనే బస్సుయాత్ర షెడ్యూల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయి. తెలంగాణ నేతలు కూడా ఇక మాదే అధికారం అన్న ధీమాతో కనిపిస్తున్నారు. ఎన్నికల వరకు ఇది కొనసాగితే.. అధికారం సంగతేమోగానీ.. బీజేపీ కంటే.. కాంగ్రెస్ బాగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎన్నికల వ్యూహకర్త కనుగోలు.. జంబో బస్సు యాత్రకు ప్లాన్ సిద్ధం చేయించారు. వచ్చే నెల మొదటి వారంలో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. కర్ణాటక ఇచ్చిన కిక్ ఎలా ఉందో కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా తెలిసింది. అందుకే తెలంగాణ బస్సు యాత్రను రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ స్వయంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రతివారం దీనిపై రివ్యూ కూడా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ అనుకున్నది సాధిస్తుందా ?
తెలంగాణ కాంగ్రెస్‌లో కసి కనిపిస్తుంది..! ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న పంతం స్పష్టంగా తెలుస్తుంది..! కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వచ్చిన ఊపు.. తెలంగాణలోని ప్రతి సీనియర్ నేతలోనూ తెలుస్తోంది..! కాస్త కాష్టపడితే బీఆర్ఎస్‌ను ఓడించవచ్చని.. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చన్న ధీమా అందరిలోనూ ఉంది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో తెలియదు గానీ… ఆ పార్టీలో మాత్రం ఎన్నికల జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. సరే అంతా బాగానే ఉంది.. మరి పార్టీ నేతల మధ్య ఐక్యత ఉందా..? అంతర్గత ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ప్రశ్నకు సమాధానం లేదండీ అనే వస్తుంది. ప్రాంతం ఏదైనా.. దేశంలో ఏ మూలకెళ్లినా.. అంతర్గత విబేధాలు..వర్గాలు…సంఘర్షణలు నిత్యకృత్యంగా ఉంటాయి. ఇక సీనియర్లు, జూనియర్లు, ఔట్‌సైడర్లు వంటి డిస్కషన్ కాంగ్రెస్‌పార్టీలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.. రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకించడం నుంచి.. సీనియర్ల మధ్య అనేక విభేదాలు ఇప్పటికీ ఉన్నాయి. బస్సు యాత్ర ద్వారా వీటన్నింటి నుంచి బయటపడితే తప్ప కాంగ్రెస్ లక్ష్యం నెరవదు. మరి అందరూ చేతులు కలుపుతారా లేదా అన్నది వాళ్లకు మాత్రమే తెలిసిన సమాధానం.