మరో రికార్డుపై కోహ్లీ గురి, ఇంగ్లాండ్ సిరీస్ లో అందేనా ?
కొత్త ఏడాదిలో వరుస సిరీస్ లకు టీమిండియా రెడీ అవుతోంది. సుదీర్ఘమైన ఆసీస్ టూర్ ముగిసిపోవడంతో ఆటగాళ్ళంతా స్వదేశం చేరుకున్నారు. వారం రోజుల గ్యాప్ తో ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ ఆడబోతున్నారు.
కొత్త ఏడాదిలో వరుస సిరీస్ లకు టీమిండియా రెడీ అవుతోంది. సుదీర్ఘమైన ఆసీస్ టూర్ ముగిసిపోవడంతో ఆటగాళ్ళంతా స్వదేశం చేరుకున్నారు. వారం రోజుల గ్యాప్ తో ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ ఆడబోతున్నారు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉండగా.. అనూహ్య నిర్ణయాలు ఏమీ ఉండకపోవచ్చు. కాగా ఈ సిరీస్ తో పాటు వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఆడనుంది. భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా.. దాని కంటే ముందు ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై ఫామ్ అందుకోవాలని పలువురు స్టార్ ప్లేయర్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ లో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. ఆసీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోయిన కోహ్లీ త్వరలోనే భారత్ కు రానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే ఇంగ్లాండ్ సిరీస్ ను సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాడు.
నిజానికి ఈ సిరీస్ లో కోహ్లీ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే చివరి సిరీస్ కావడంతో ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది.
మరో 96 పరుగులు సాధిస్తే.. వన్డే క్రికెట్‌లో 300 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 14000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కుతాడు. వన్డేల్లో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 మైలురాయి అధిగమించారు.
ఈ మైలురాయిని అందుకోవడానికి సచిన్ 350 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. మరోవైపు కోహ్లి 295 మ్యాచ్‌ల్లో 13906 పరుగులు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లి ఈ ఘనత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
కోహ్లీ తనదైన మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి ఏడాది దాటిపోయింది. గత ఏడాది స్వదేశంలోనూ ఫెయిలైన ఈ రికార్డుల రారాజు ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఫ్లాప్ అయ్యాడు. ఆసీస్ గడ్డపై అద్బుతమైన టెస్టు రికార్డు ఉన్నప్పటకీ ఈ సారి నిరాశపరిచాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. కేవలం 190 పరుగులే చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన కోహ్లి.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఫెయిలయ్యాడు. ఆఫ్ సైడ్ కు దూరంగా వెళ్ళే బంతులను వెంటాడి వికెట్ ఇచ్చుకున్నాడు. సిరీస్ మొత్తంలో 8 సార్లు ఇదే తరహాలో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తో సిరీస్ లో విరాట్ ఎలా ఆడతాడోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.