Narendra Modi:పెట్రోల్ రేట్ తగ్గబోతోందా..? మోడీ బిగ్ ప్లాన్
ద్రవ్యోల్భణం పై మోదీ వేసిన అక్షరాల లక్షకోట్ల వ్యూహం ఫలించేనా.

Will PM Modi devise strategies to reduce petrol prices in the country
1,00,00,00,00,000కోట్లు..అంటే లక్ష కోట్లు.. ద్రవ్యోల్బణం కట్టడికి మోడీ ప్రభుత్వం చేయబోతున్న ఖర్చు అది. ఎన్నికల వేళ టెన్షన్ పెడుతున్న ధరల పెరుగుదలను కంట్రోల్ చేయడానికి లక్ష కోట్లను ఖర్చు చేయనుంది మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగా పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న ప్రచారం కూడా సాగుతోంది.
ధరలు తగ్గేనా..?
ఉల్లి, బంగాళదుంపలు ప్రభుత్వాలను కూల్చిన దేశం మనది. ఇప్పుడు టమోటా మోడీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. దాంతో పాటు పెరిగిన నిత్యావసరాలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి. ఎన్నికల వేళ కొంపముంచకుండా చర్యలకు దిగేలా ఒత్తిడి తెస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా కేంద్రం పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించే అవకాశముందని తెలుస్తోంది. ఎంతో కొంత ఊరట కల్పించొచ్చు. దీంతోపాటు వంటనూనె, గోధుమల దిగుమతులపై దిగుమతి సుంకాలను తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నారు. పేదలకు గృహ నిర్మాణానికి తక్కువ వడ్డీకే లోన్లు అందచేయడం కూడా మోడీ పరిశీలనలో ఉంది. అసాధారణ వర్షాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంటలను దెబ్బతీశాయి. ఫలితంగా టమోటా 2వందల రూపాయలు దాటిపోయింది. మిర్చికూడా ఘాటెక్కింది. ఇప్పుడు కాస్త తగ్గినా వాటి ఎఫెక్ట్ ద్రవ్యోల్బణంపై పడింది. మిగిలిన ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగిపోయాయి. దీని కట్టడికే ఇటీవల కేంద్రం కొన్ని రకాల ధాన్యం ఎగుమతులపై ఆంక్షలు కూడా విధించింది.
టెన్షన్ పెడుతున్న ఇన్‌ఫ్లేషన్
దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. గత నెలలో రీటైల్ ఇన్‌ఫ్లేషన్ దూసుకుపోయింది. రిజర్వ్‌బ్యాంక్ అనుకున్న దానికంటే ఇది భారీగా ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడమే దీనికి కారణం. మాములుగా అయితే వడ్డీ రేట్లు పెంచేసి ద్రవ్యోల్బణ కట్టడికి మా పనిమేం చేస్తున్నాం అని చేతులు దులుపుకునేవారు. కానీ ఈసారి మళ్లీ వడ్డీరేట్లు పెంచితే జనాగ్రహానికి గురికాక తప్పదని ఆర్‌బీఐ గ్రహించింది. ఎన్నికల సమయంలో అలా చేస్తే కొంప మునుగుతుందని ప్రభుత్వం భయపడింది. దీంతో ధరల కట్టడికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది.
లక్ష కోట్లు ఎలా..?
ద్రవ్యలోటు టార్గెట్‌ను దాటిపోకుండా వివిధ మంత్రిత్వశాఖల నుంచి నిధులు సమీకరించి ధరలను కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ తన ఆగస్టు15 ప్రచారంలో కూడా ద్రవ్యోల్బణ కట్టడిపై మాట్లాడారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే మన మంత్రిత్వశాఖల్లో ఖర్చుపెట్టని నిధులు కూడా తక్కువేమీ కాదు. అలాగే ఆర్‌బీఐ నుంచి రావాల్సిన నిధులు, నిలకడగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు కేంద్రాన్ని ఈ దిశగా అడుగులు వేసేలా చేస్తున్నాయి.