హైడ్రా ప్రభావంతో… రియల్‌ ఎస్టేట్ కుప్పకూలనుందా?

హైడ్రా.. ఈ మాట హైదరాబాద్‌లో చాలామందికి నిద్రలేకుండా చేస్తోంది. వాళ్లు, వీళ్లు అని కాదు. అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు.. బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలుపెట్టేస్తున్నాయ్. హైడ్రా దూకుడు.. హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2024 | 11:40 AMLast Updated on: Sep 01, 2024 | 11:40 AM

Will Real Estate Collapse Under The Influence Of Hydra

హైడ్రా.. ఈ మాట హైదరాబాద్‌లో చాలామందికి నిద్రలేకుండా చేస్తోంది. వాళ్లు, వీళ్లు అని కాదు. అక్రమ నిర్మాణాలు అని తేలితే చాలు.. బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలుపెట్టేస్తున్నాయ్. హైడ్రా దూకుడు.. హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే అగమ్యగోచరం అన్నట్లుగా తయారయిన రియల్టర్ల పరిస్థితి.. హైడ్రా ఎఫెక్ట్‌తో మరింత దారుణంగా తయారయింది. ఇప్పటికే భూముల ధరలు సామాన్యుడికి దూరంగా.. అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయ్. పోనీ ఇలా లేక్ వ్యూ పేరుతో.. హైరైజ్ బిల్డింగ్‌లతో దందా చేసుకుందాం అంటే.. హైడ్రా ఎఫెక్ట్‌తో ఆ అవకాశం కూడా లేకుండా పోతోంది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని నడిపించేది.. మధ్యతరగతి కుటుంబాలే. అలాంటి ఫ్యామిలీల్లో హైడ్రా దూకుడుతో అనుమానాలు మొదలవుతున్నాయ్. జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చినా.. రేరా అప్రూవ్‌ చేసినా.. తగ్గేదే లే అన్నట్లు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయ్. తీరా కొనేసిన తర్వాత కూలిస్తే పరిస్థితి ఏంటని చాలామంది ఇళ్ల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ ప్రభావం రాను రాను మరింత ఎక్కువగా ఉండే చాన్స్ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. హైడ్రా కారణంగా రియల్‌ ఎస్టేట్‌ మరింత దివాళా తీయడం ఖాయం. హైడ్రా ఎఫెక్ట్‌తో లేక్‌ వ్యూలో ఇల్లు తీసుకోవాలంటేనే.. భయపడుతున్నారు.

డాక్యుమెంట్లు సవ్యంగానే ఉన్నా.. ఎందుకొచ్చిన తలపోటు అని అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫ్లాట్స్‌, అపార్ట్‌మెంట్స్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చినవాళ్లు వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ డెవలపర్స్‌ మీద ఒత్తిడి చేస్తున్నారు. హైదరాబాద్‌ అమీన్‌పూర్‌ చెరువు చుట్టూ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో.. ఫ్లాట్‌లను బుక్ చేసుకున్న వాటిని రద్దు చేయమని ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి. FTL, బఫర్‌జోన్ ఏంటి.. నిర్మాణాలు వాటి పరిధిలో ఉన్నాయా.. అసలు అనుమతులు ఉన్నాయా.. అనుమతులు ఉన్నా అసలు సేఫా కాదా.. ఇలాంటి ప్రశ్నలన్నీ జనాల్లో వినిపిస్తున్నాయ్. దీంతో కొద్దిరోజులు ఇళ్ల కొనుగోలు జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. నిజానికి హైదరాబాద్ అంటేనే.. రియల్ ఎస్టేట్‌కు కేరాఫ్‌.. దేశంలో ఏ నగరంలో ఇంతలా రియల్ రంగం అభివృద్ధి జరగలేదు. తెలంగాణకు మించి ఏపీ బిల్డర్‌లు.. హైదరాబాద్‌లో పెట్టుబడులు స్టార్ట్ చేశారు.

2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇక్కడ పూర్తిగా పరిస్థితి మారిపోయింది. అందరూ ఏపీలో వదిలి హైదరాబాద్‌లో భూములు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఐతే రియల్ ఎస్టేట్ నుంచి వస్తున్నఆదాయంలో.. అప్పటి కేసీఆర్ సర్కార్‌ సొంతంగా వ్యాపారం చేయాలని భావించింది. తమ అనుకూల వ్యాపారులకు ఓఆర్‌ఆర్ పక్కన ఎకరం వంద కోట్లకు విక్రయించి.. భూముల ధరలను కృత్రిమంగా పెంచేసింది. ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేయాలని సర్కార్ భావించింది. ఐడియా బెడిసి కొట్టింది. అప్పటికే సేల్ కాని లక్షల అపార్ట్‌మెంట్‌లు అలాగే ఉండిపోయాయ్‌. అక్కడ మొదలైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం.. ఇప్పుడు హైడ్రాతో మరింత దారుణంగా తయారైంది.

భూములు, ఇళ్లు కొనాలన్న ఆలోచన ఉండేది ఇన్నాళ్లు. ఇప్పుడు హైడ్రా దూకుడుతో అలాంటి ఆలోచన చేసే ధైర్యం కూడా చేయడం లేదు జనాలు. దీంతో ఆ ప్రభావం రియల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అటు 111 జీవో రద్దు అంటూ.. కేసీఆర్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఆయన మాటలు నమ్మి కోట్లకు కోట్లు పెట్టి భూములు కొన్న వాళ్లు ఇప్పుడు నెత్తిన బట్టేసుకొని కూర్చుంటున్నారు. రేవంత్ సర్కార్‌ ఆ భూముల జోలికి వెళ్లే అవకాశమే లేదు. పైగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తెలంగాణలో ఉన్న సీమాంధ్రలు చాలామంది మళ్లీ అటువైపు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. తొందరపడి హైదరాబాద్‌లో డబ్బు పెట్టడం లేదు. ఇప్పుడు హైడ్రా దూకుడుతో.. పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలను కూడా విరమించుకుంటున్నారు. హైడ్రా కొనసాగినంత కాలం.. వాళ్లు పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశ పెట్టుకోవడం కూడా కష్టమే. ఇలా ఎలా చూసినా.. హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై భారీగా కనిపిస్తోంది. హైడ్రా దూకుడు ఇలానే కొనసాగితే.. రియల్ ఎస్టేట్‌ మరింత పడిపోవడం ఖాయం.