VIP Prisoners: ‘వీఐపీ ఖైదీ’ల కేటగిరి ఉంటుందా ? స్పెషల్ ఖైదీలకు కల్పించే సౌకర్యాలేమిటి ?

జైళ్లలో ఖైదీలకు ప్రత్యేక వసతులు, అవసరాలు తీర్చేందుకు ఏర్పాటు చేస్తారా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2023 | 10:36 AMLast Updated on: Sep 13, 2023 | 10:36 AM

Will Special Arrangements Be Made In Jails For Vip Prisoners

ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడును అరెస్టు చేశాక రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆయన ప్రత్యేక వసతులు కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రముఖులకు జైళ్లలో ‘వీఐపీ’లుగా పరిగణిస్తారా? ఒకవేళ పరిగణిస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు ? అనేది ఇప్పుడు చూద్దాం. దేశంలో 1894లో ప్రిజన్స్ యాక్టు (జైళ్ల చట్టం) అమల్లోకి వచ్చింది. దానిలో ఎక్కడా ‘వీఐపీ ఖైదీ’ అనే ప్రస్తావన లేదు. అయితే ఖైదీకి ఉన్న ఆర్థిక స్థాయి, స్థోమత, జీవనశైలి, హోదాను పరిశీలించి స్పెషల్ క్లాస్ ప్రిజనర్ (ప్రత్యేక శ్రేణి ఖైదీ)గా పరిగణిస్తారు. దీనికోసం సదరు వ్యక్తి న్యాయస్థానం నుంచి ప్రత్యేక అనుమతిని తెచ్చుకోవాల్సి ఉంటుంది.

జైళ్లలో ప్రముఖుల కోసం ప్రత్యేక బ్యారక్‌లు ఉంటాయి. ఒకవేళ కోర్టు ఎవరైనా నిందితుడిని స్పెషల్ క్లాస్ కింద పరిగణిస్తే.. ప్రత్యేక బ్యారక్‌లలో ఉండే గదులను వారికి కేటాయిస్తారు. జైలులో ప్రత్యేక రూం, బెడ్, రీడింగ్ టేబుల్, కబోర్డు, ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. ఈ గదులలోనే అటాచ్డ్ మరుగుదొడ్లు ఉంటాయి. బట్టలు ఉతకడానికి మనిషిని ఇస్తారు. ఇంటి నుంచి సరుకులు తెప్పించుకుని జైలులో వండించుకుని కూడా తినొచ్చు. వంట వండే వ్యక్తిని కూడా జైలు తరపున అపాయింట్ చేస్తారు. ఇవన్నీ వద్దూ అనుకుంటే.. ఇంటి నుంచి కూడా భోజనం తెప్పించుకోవచ్చు.

ఏయే జైళ్లలో బ్యారక్ లు ఎలా ఉంటాయి ?

సబ్ జైలు, జిల్లా జైలు, సెంట్రల్‌ జైళ్లలో ఖైదీలకు వసతులపరంగా కొన్ని తేడాలు ఉంటాయి. జిల్లా జైలు, సెంట్రల్ జైళ్లలో లైబ్రరీ, ప్లే ఏరియా, యోగా, వ్యాయామ సాధన శిబిరం వంటివి ఉంటాయి. ఇలాంటి సౌకర్యాలు సబ్ జైళ్లలో ఉండవు. సబ్ జైలులో రెండు లేదా మూడు బ్యారక్‌ లు ఉంటాయి. ఇందులో 20 లేదా 30 మంది వరకు ఖైదీలు ఉంటారు. జిల్లా జైలులో 200 నుంచి 400 మందికి సరిపడా బ్యారక్‌లు ఉంటాయి. సెంట్రల్ జైల్లో 1000 నుంచి 2000 మంది పట్టేలా బ్యారక్‌లు ఉంటాయి. బ్యారక్‌ల సైజును బట్టి కొన్నింటిలో నలుగురు ఖైదీలే ఉంటారు. మరికొన్నింటిలో 20 నుంచి 25మందిని ఉంచుతారు.

ములాఖత్‌ నిబంధనలు ఏమిటి ?

ములాఖత్ విషయంలో ముందుగా ఖైదీగా ఉన్న వ్యక్తి అంగీకారం అడుగుతారు. ములాఖత్ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది. ములాఖత్‌కు అనుమతించే విషయం కొన్ని సందర్భాల్లో జైలు సూపరింటెండెంట్‌పై ఆధారపడి ఉంటుంది. రిమాండ్ ఖైదీకి వారానికి రెండుసార్లు, శిక్ష పడిన ఖైదీకి వారానికొకసారి ములాఖత్‌కు అవకాశం ఉంటుంది. న్యాయవాదులు ఎప్పుడైనా రావొచ్చు. సబ్ జైలుకు భద్రతగా పది మంది వరకూ సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.జిల్లా జైలుకు 50-60 మందితో భద్రత ఉంటుంది. దీనికి డీఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి సూపరింటెండెంట్ గా ఉంటారు. సెంట్రల్ జైలులో 150 నుంచి 200 వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. ఇక్కడ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.