టెస్ట్ క్రికెట్ ను చంపేస్తారా ? ముల్తాన్ పిచ్ పై విమర్శలు

టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్టులకు ఆదరణ తగ్గిందన్న వాస్తవం అంగీకరించాల్సిందే... అయితే కొన్ని జట్ల మధ్య మ్యాచ్ లు రసవత్తరంగా సాగితే మాత్రం అటు స్టేడియాలూ నిండుతున్నాయి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 10, 2024 | 10:05 AMLast Updated on: Oct 10, 2024 | 10:05 AM

Will Test Cricket Be Killed Criticism On The Multan Pitch

టీ ట్వంటీ ఫార్మాట్ వచ్చిన తర్వాత టెస్టులకు ఆదరణ తగ్గిందన్న వాస్తవం అంగీకరించాల్సిందే… అయితే కొన్ని జట్ల మధ్య మ్యాచ్ లు రసవత్తరంగా సాగితే మాత్రం అటు స్టేడియాలూ నిండుతున్నాయి.. ఇటు వ్యూయర్ షిప్ కూడా వస్తోంది… కానీ కొన్నిసార్లు పేలవమైన పిచ్ లతో టెస్ట్ క్రికెట్ కు ఉన్న కొంచెం ఆదరణను చెడగొట్టేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టుపై ఇలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ జరుగుతున్న తీరుపై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముల్తాన్ పిచ్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వికెట్ ఏ మాత్రం టెస్ట్ క్రికెట్‌కు పనికి రాదని అభిప్రాయపడుతున్నారు. బ్యాట్, బంతి మధ్య సమతూకమైన పోటీ ఉంటేనే అసలు సిసలు మజా వస్తుందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఫ్లాట్ పిచ్‌లతో వచ్చే లాభం ఏముంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముల్తాన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 556 పరుగులు చేసింది. ముగ్గురు పాకిస్థాన్ బ్యాటర్లు శతకాలు నమోదు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్ ధీటుగా బదులిస్తోంది. ఇప్పటికే రూల్, హ్యారీ బ్రూక్ సెంచరీలతో కదం తొక్కారు. మరో ఇద్దరు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఫలితంగా ఇంగ్లాండ్ మూడోరోజు ముగిసేసరికి 3 వికెట్లకు 492 రన్స్ చేసింది. అయితే ఈ వికెట్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ అసహనం వ్యక్తం చేశాడు. డెయిలీ మెయిల్‌కు రాసిన కథనంలో పిచ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ వికెట్‌పై స్పిన్, స్వింగ్, రివర్స్ సింగ్ ఏది లేదని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఫ్లాట్‌గా ఉందని పేర్కొన్నాడు. ఇంత చెత్త పిచ్‌ను తాను ఎక్కడ చూడలేదని, పాకిస్థాన్‌లో కూడా ఇప్పటివరకు ఇలాంటి వికెట్ కనిపించలేదని మండిపడ్డాడు. టెస్ట్ క్రికెట్ మనుగడకు ఇలాంటి పిచ్‌లు ఏ మాత్రం అయోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డాడు.

ఇలా ఐదో రోజులు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఒరిగే ప్రయోజనం ఏం లేదని చెప్పుకొచ్చాడు. ఈపిచ్ మరీ ఫ్లాట్‌గా ఉందనీ, టెస్ట్ క్రికెట్‌ను బతికించాలంటే సరైన పిచ్‌లను సిద్దం చేయాలని సూచించాడు. బ్యాట్, బంతి మధ్య సరైన పోటీ ఉంటేనే టెస్ట్ క్రికెట్ బతుకుతుందని,. అలాంటి వికెట్స్‌ను తయారు చేయడంపై ఐసీసీ ఫోకస్ పెట్టాలన్నాడు. 500కు పైగా పరుగులు చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం ఉంటుందో అందరూ ఆలోచించాలన్నాడు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదన్న కొందరు విశ్లేషకులు ఇలానే ఐదు రోజుల పాటు మ్యాచ్‌ జరిగితే ఎవరూ కూడా రారని తేల్చేశారు. ఈ మ్యాచ్‌లో ఫలితం రావాలంటే పిచ్ పగుళ్లు పడేవరకు ఇంగ్లండ్ బ్యాటింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మూడురోజుల ఆటముగిసినా రెండో జట్టు తొలి ఇన్నింగ్స్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఓవరాల్ గా మూడురోజుల్లో 13 వికెట్లు మాత్రమే పడ్డాయి.