Gaddar: గద్దర్ కోరికను నెరవేర్చనున్న కాంగ్రెస్ ?!

తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం పాటు నిలిచిపోయే ఇమేజ్ ను గద్దర్ సంపాదించారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను పొలిటికల్ మైలేజీ రూపంలోకి కన్వర్ట్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 9, 2023 | 10:21 AMLast Updated on: Aug 09, 2023 | 10:21 AM

Will The Congress Get Political Milage By Using His Name While Helping The Gaddar Family

సమ సమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టినా.. ప్రజా ఉద్యమంలో కలం పట్టి గళం విప్పినా అది ప్రజా యుద్ధనౌక గద్దర్ కే చెందుతుంది. ఆయన పేరు వింటే నరాలు ఉప్పొంగుతాయి. ఆ గొంతు నుంచి వచ్చిన పాటలతో రోమాలు నిక్కపొడుస్తాయి. ఈవిధంగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం పాటు నిలిచిపోయే ఇమేజ్ ను గద్దర్ సంపాదించారు. ఇప్పుడు ఆ ఇమేజ్ ను పొలిటికల్ మైలేజీ రూపంలోకి కన్వర్ట్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఈక్రమంలో కాంగ్రెస్ చూపు.. ప్రస్తుతం తమ పార్టీలోనే ఉన్న గద్దర్ కుమారుడు సూర్యకిరణ్‌ పై పడింది.

2018లో గద్దర్ కోరినా..

స్వతహాగా జానపద గాయకుడైన సూర్యకిరణ్‌ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం పరిధిలో నివసించే సూర్యకిరణ్‌ ఇప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ పోల్స్ లో సూర్యకిరణ్‌ కు బెల్లంపల్లి టికెట్ ను కాంగ్రెస్ ఇస్తుందనే ప్రచారం నడిచినా.. అలా జరగలేదు. అయినా కాంగ్రెస్ ను గద్దర్ వ్యతిరేకించలేదు. ఆ పోల్స్ లో కాంగ్రెస్ తో కూడిన మహాకూటమి ప్రచారకర్తగా గద్దర్ వ్యవహరించారు. అప్పట్లో తన కుమారుడికి బెల్లంపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని గద్దర్ పలుమార్లు కోరారు. అయితే ఆయన కోరిక ఆనాడు నెరవేర లేదు. అయినా పట్టుదలకు పోకుండా.. గత ఐదేళ్లుగా హస్తం పార్టీకి అత్యంత సన్నిహితంగా గద్దర్ మెలిగారు. తెలంగాణ వచ్చి 9 ఏళ్లు దాటినా బీఆర్ఎస్ ​పార్టీ ఎలాంటి హెల్ప్ చేయలేదని గద్దర్ పలుమార్లు చెప్పుకొచ్చారు. బీజేపీకి తన కమ్యూనిస్టు భావజాలానికి సెట్ కాదని ఎన్నోసార్లు కుండబద్దలు కొట్టారు.

ఇక గద్దర్‌ ఫ్యామిలీకి ప్రాధాన్యత..

ఇటీవల ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీతో గద్దర్ ఆప్యాయంగా మాట్లాడుతూ ముద్దు కూడా పెట్టారు. అంత ప్రేమభావంతో ఉండే గద్దర్ అకాల మరణంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారని తెలుస్తోంది. గద్దర్‌ ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ నేతలకు రాహుల్ సూచించినట్లు తెలిసింది. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గద్దర్ ఫ్యాన్స్ కూడా కాంగ్రెస్ వైపు మళ్లుతారనే అంచనాతో హస్తం పార్టీ ఉందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలతో జనాలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ ఫ్యామిలీ కాంగ్రెస్ తో ఉంటే ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. సూర్యకిరణ్‌ కు అసెంబ్లీ టికెట్ ఇవ్వడం ద్వారా గద్దర్ కు నివాళులు అర్పించాలని కాంగ్రెస్ భావిస్తోందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే సూర్యంను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దానిపై హస్తం పార్టీ హై కమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నదని చెబుతున్నారు.