చివరిదైనా గెలిచేనా ? కివీస్ తో భారత్ మూడో టెస్ట్
సొంతగడ్డపై అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. ముంబై వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి మూడో టెస్టులో తలపడబోతోంది. తొలి రెండు టెస్ట్‌ల్లో పరాజయంపాలైన రోహిత్ సేన ఇప్పుడు వైట్ వాష్ పరాభవం తప్పించుకునేందుకు ఎదురుచూస్తోంది.
సొంతగడ్డపై అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. ముంబై వాంఖడే వేదికగా శుక్రవారం నుంచి మూడో టెస్టులో తలపడబోతోంది. తొలి రెండు టెస్ట్‌ల్లో పరాజయంపాలైన రోహిత్ సేన ఇప్పుడు వైట్ వాష్ పరాభవం తప్పించుకునేందుకు ఎదురుచూస్తోంది. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. అసలు భారత్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే సొంతగడ్డపై మనజట్టు ఎంత బలమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా 18 సిరీస్ లలో గెలిచిన టీమిండియా జోరుకు బ్రేక్ వేస్తూ న్యూజిలాండ్ సిరీస్ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా ఇటీవల లంక పర్యటనలో పూర్తిగా తేలిపోయిన కివీస్ ఈ స్థాయిలో ఆడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. అదే సమయంలో భారత్ ఇలాంటి చెత్త ఆటతీరుతో పరాజయం పాలవుతుందని కూడా ఊహించలేదు.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే తొలి సిరీస్ విజయాన్నందుకున్న న్యూజిలాండ్.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. దాంతో మూడో టెస్ట్ కూడా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తొలి రెండు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలపై టీమిండియా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టాపార్డర్ వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమవడంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఒత్తిడికి గురవ్వాల్సి వచ్చింది. దీంతో మూడోటెస్టులో బ్యాటర్లంతా సత్తా చాటాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, అశ్విన్ రాణించినా.. వారిలో నిలకడ లోపించింది. అందరూ సమష్టిగా రాణిస్తేనే టీమిండియా వైట్ వాష్ అవమానం నుంచి తప్పించుకోగలుగుతుంది.
టాపార్డర్ విషయంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం.. సర్పరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లో ఒకరిపై వేటు పడనుంది. కాగా మన బ్యాటర్లు స్పిన్ ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడుతున్నారు. పుణే టెస్టులో భారత్ ఓటమికి ఇదే కారణం. ఈ బలహీనతను అధిగమించకపోతే టీమిండియాకు మరో ఓటమి తప్పదు. ఇదిలా ఉంటే బౌలింగ్ విభాగంలో స్పిన్ ఆల్‌రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కొనసాగనున్నారు. వాంఖడే పిచ్‌పై తొలి రోజు బౌన్స్ ఉండనుండగా.. రెండో రోజు నుంచి స్పిన్‌కు అనుకూలించనుంది. ఈ క్రమంలోనే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నా.. చివరి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి కావడంతో అతన్ని తుది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నాడని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తేల్చేశాడు. ఇక వాంఖేడే పిచ్ సమతూకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ ఓటమి ఫలితంతోనే అటు బ్యాట్ కూ, ఇటు స్పిన్ కు అనుకూలించేలా పిచ్ రెడీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.