YCP : వైసీపీ బీసీ మంత్రం వర్కౌట్ అవుతుందా..?

మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని ప్లాన్‌ చేస్తున్న వైసీపీ (YCP).. బీసీ ఛాంపియన్‌గా నిలవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్‌లో సక్సెస్‌ అయిన అధికార పార్టీ.. ఈసారి బీసీలపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే.. నమ్మకంగా వెంట ఉంటారన్న భావన పార్టీ పెద్దల్లో ఉందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 04:12 PMLast Updated on: Jan 15, 2024 | 4:12 PM

Will The Ycp Bc Mantra Work Out

మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని ప్లాన్‌ చేస్తున్న వైసీపీ (YCP).. బీసీ ఛాంపియన్‌గా నిలవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్‌లో సక్సెస్‌ అయిన అధికార పార్టీ.. ఈసారి బీసీలపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే.. నమ్మకంగా వెంట ఉంటారన్న భావన పార్టీ పెద్దల్లో ఉందట. అందుకు కొన్ని లెక్కల్ని కూడా చెప్తున్నట్లు తెలిసింది. కమ్మ సామాజికవర్గానికి ఎంత పెద్ద పీట వేసినా.. ఎక్కువ శాతం సైకిల్ దిగరని, రెడ్లు అనివార్యంగా తమతోనే ఉంటారన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. ఇక బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వంటి సామాజికవర్గాల ప్రభావం కొంత ఉన్నా.. వైసీపీతో మూకుమ్మడిగా కలిసి వస్తారన్న నమ్మకం లేదంటున్నారు. అలాగని వారిని పూర్తిగా విస్మరించకుండా.. కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూనే వీలైన చోట్ల బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. దానికి అనుగుణంగానే నియోజకవర్గాల మార్పుల్లో తమ వ్యూహాలను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది పార్టీలో.

తాజాగా చేసిన మార్పుల్ని పరిశీలిస్తే.. విశాఖపట్నం (Visakhapatnam) లోక్‌సభ (Lok Sabha) స్థానాన్ని గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎంవీవీ సత్యనారాయణకు ఇచ్చారు. ఈసారి బీసీ మహిళ కోటాలో బొత్స ఝాన్సీ పోటీ పడబోతున్నారు. ఏలూరు ఎంపీగా గత ఎన్నికల్లో వెలమ సామాజికవర్గం నుంచి కోటగిరి శ్రీధర్‌కు అవకాశం ఇచ్చిన పార్టీ హైకమాండ్.. ఈసారి బీసీ యాదవవర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌ను బరిలో నిలబెట్టబోతోంది. ఇటు నర్సరావుపేట లోక్‌సభ సెగ్మెంట్‌లో కూడా ఈసారి బీసీని ప్రయోగించాలన్నది పార్టీ వ్యూహంగా తెలిసింది. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన లావు కృష్ణదేవరాయలుకు బీఫామ్‌ ఇచ్చిన వైసీపీ.. ఈసారి ఇక్కడి నుంచి బీసీని రంగంలోకి దింపాలని భావిస్తోందట. కృష్ణదేవరాయలుకు గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నా.. బలమైన బీసీ అభ్యర్ధి కోసం వెతుకుతోందట. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు టాక్.

రాజధాని ప్రాంతంలో కీలకమైన మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గంలో.. బీసీ అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014, 2019లో వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలిచారు. అయితే ఈసారి లెక్క మార్చేసింది అధిష్టానం. రెడ్డి సామాజికవర్గ అభ్యర్ధిని కాదని.. బీసీ పద్మశాలి వర్గానికి చెందిన చిరంజీవికి అవకాశం కల్పించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వెంకట సిద్ధారెడ్డిని బరిలో పెట్టిన పార్టీ.. ఈసారి రెడ్డి వర్గాన్ని పక్కన పెట్టి మైనార్టీకి అవకాశం ఇచ్చింది. వెంకట సిద్ధారెడ్డి స్థానంలోమక్బూల్ అహ్మద్ బ్యాలెట్ పోరులో నిలబడనున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత రెండు సార్లు గెలిచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చెన్నకేశవ రెడ్డి బదులు ఈసారి బీసీ చేనేత వర్గానికి చెందిన మాచాని వెంకటేశ్‌ను బరిలో నిలబెడుతోంది. నిజానికి ఈ సెగ్మెంట్ నుంచి ఏ పార్టీ అయినా రెడ్లకే అవకాశం ఇస్తుంది. ఐతే ఈసారి వైసీపీ ఇక్కడ బీసీ ప్రయోగం చేయబోతోంది. ఇదే వ్యూహం విజయవాడ వెస్ట్‌లోనూ అమలు చేయనుంది.

వెస్ట్ నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చి వైశ్య సామాజికవర్గానికి చెందిన వెలంపల్లిని.. సెంట్రల్ సెగ్మెంట్ కు మార్చి ఇక్కడ మైనార్టీకి టిక్కెట్‌ ఇవ్వబోతోంది. షేక్ ఆసిఫ్ వెస్ట్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో వడ్డెర బీసీ వర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నంకు ఇచ్చింది వైసీపీ. అయితే ఆయన ఓడిపోయాక టీడీపీ నుంచి మద్దాల గిరి వైసీపీ వైపు వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, వైశ్య సామాజికవర్గానికి చెందిన మద్దాల గిరికి బదులు బీసీ మహిళ విడదల రజనీని ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలబెట్టబోతోంది వైసీపీ అధిష్టానం. ఇలా మొత్తంగా.. ఓసీ, బీసీ అభ్యర్థి మధ్య పోటీ వచ్చినప్పుడు.. బీసీ వైపే మొగ్గి కొత్త ప్రయోగం చేయబోతోందట ఫ్యాన్‌ పార్టీ. దీని ద్వారా మెజార్టీ జనాభా ఉన్న బీసీలను.. తమ వైపునకు తిప్పుకుని గెలుపు బాటలు వేసుకోవాలన్నది వైసీపీ అధినాయకత్వపు వ్యూహంగా చెబుతున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి