BJP CHANGE : ఆ ముగ్గుర్ని మారుస్తారా ? బీజేపీలో సీరియస్ డిస్కషన్
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది. అభ్యర్థుల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఈనెల 18 నుంచి నామినేషన్ల పర్వం ఊపందుకోనుంది. అభ్యర్థుల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ టైమ్ లో తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో మూడు స్థానాలపై అనిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలకు కమలం హైకమాండ్ మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది. కానీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని డిమాండ్ వస్తోంది.
తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి నిలబెట్టింది. కొన్ని సీట్లల్లో సరైన అభ్యర్థులు లేక పక్క పార్టీల నుంచి తీసుకుంది. ఇందులో పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ కూడా ఒకరు. కానీ ఈయనపై నియోజకవర్గంలోని బీజేపీ (BJP) శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు గోమాస ఇప్పటిదాకా ప్రచారమే చేపట్టలేదు. ఆయన టిక్కెట్ తెచ్చుకున్నాక… ఇంట్లో కూర్చొని… మిగతా పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాడని కమలం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గతంలోనూ మిగతా పార్టీల్లో ఇలాగే వ్యవహరించాడన్న టాక్ ఉంది. గోమాస శ్రీనివాస్ పై పార్టీ హైకమాండ్ కు భారీగా ఫిర్యాదులు వెళ్ళాయి. దాంతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మారుస్తారని అంటున్నారు.
ఇక ఖమ్మం, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థులను కూడా మార్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఖమ్మం లోక్ సభ సీటు ఇస్తారని ఆశించి… జలగం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. కానీ ఆయన్ని కాదని… తాండ్ర వినోద్ రావు పేరు ప్రకటించింది బీజేపీ హైకమాండ్. దాంతో వెంకట్రావు పార్టీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వినోద్ రావుకి స్థానికంగా అండలేదని అంటున్నారు. ఆయన్ని మార్చాలని పార్టీ శ్రేణులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఒకవేళ వినోద్ రావుని మారిస్తే… జలగం వెంకట్రావుకి ఛాన్స్ వస్తుందని సమాచారం.
ఆదిలాబాద్ సీటుపైనా బీజేపీలో పెద్ద రచ్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapurao) ని పక్కనబెట్టి… BRS నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కు టిక్కెట్ ఇవ్వడాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ (Congress) లో చేరిపోయారు. దాంతో ఆదిలాబాద్ అభ్యర్థిని మార్చాల్సిందే అంటున్నారు స్థానిక బీజేపీ నేతలు. మిగతా స్థానా పరిస్థితి ఎలా ఉన్నా… పెద్దపల్లి అభ్యర్థి గోమాసు శ్రీనివాస్ పై మాత్రం వేటు తప్పదని అంటున్నారు. ఈమధ్యే కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకాని… కమలంలో చేరితే ఆయనకే పెద్దపల్లి సీటు ఇచ్చే ఛాన్సుంది.