Telugudesam Party: చంద్రబాబు అరెస్ట్ వల్ల సానుభూతి వస్తుందా రాదా? టీడీపీ లో ఇప్పుడు ఇదే చర్చ
చంద్రబాబు అరెస్ట్ పై ఒక్కొక్కరిది ఒక్కో భావనగా కనిపిస్తుంది.
చంద్రబాబు అరెస్ట్ అయ్యాడన్న బాధ కన్నా.. అరెస్ట్ వల్ల రాబోయే ఎన్నికల్లో పార్టీకి సానుభూతి వస్తుందా రాదా అన్నదానిపైనే టిడిపిలో పెద్ద చర్చ జరుగుతుంది. తన అరెస్టు చేయడం ఖాయమని మూడు రోజుల క్రితమే చంద్రబాబు చెప్పేశారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి ఆమాత్రం ఇంటెలిజెన్స్ సమాచారం ఉండదా? జరగబోయేది ఏమిటో చంద్రబాబుకి, ఆయన కుటుంబానికి, పార్టీలో ముఖ్య నాయకులకి ముందే తెలుసు. అందుకే ఎవరు ఎక్కడ ఆందోళన గా కనిపించలేదు. చంద్రబాబు కూడా నిబ్బరంగా ఉన్నారు. అంతేకాదు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో 40 నిమిషాలు వాదన చేశారు. అదంతా టీవీలోనూ, యూట్యూబ్ ఛానల్ లోనూ ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఆ వాదనని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. కానీ పోలీసులు ఎక్కడ అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి గనుక చాలా జాగ్రత్తగానే వ్యవహరించారు. అసలు విషయం ఏంటంటే ఈ అరెస్టు పార్టీకి సానుభూతి ఓటుగా మారుతుందా లేదా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చ.
ఒకరకంగా ఈ అరెస్టును తనకు అనుకూలంగా మలుచుకునేందుకు, సానుభూతి రాబట్టేందుకు చంద్రబాబు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అందుకే హెలికాప్టర్ కాకుండా 9 గంటలు రోడ్డుపై ప్రయాణించి విజయవాడ చేరడానికి సిద్దపడ్డారు. ప్రయాణం చేసి వచ్చారు కూడా. ప్రతి చోటా తనకి జనంలో సానుభూతి కనిపించాలన్నదే ఆయన ప్రయత్నం. కుటుంబ సభ్యులు, కొందరు ముఖ్య నేతలు అదే సమయానికి విజయవాడ చేరుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇది సానుభూతిగా మారుతుందా? రేపు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ఉపయోగపడుతుందా అన్నదే పెద్ద డౌట్. ఆనాడు 2003లో అలిపిరి సంఘటన కూడా తనకు సానుభూతి ఇస్తుందనే చంద్రబాబుపై భావించారు. అందుకే తొందరపడి ప్రభుత్వం రద్దు చేశారు. కానీ ఆనాడు అలిపిరి సంఘటన ఏ రకమైన సానుభూతిని ఇవ్వలేకపోయింది. చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఆనాడు అలిపిరి సంఘటనకే సానుభూతి రాలేదు ఇప్పుడు ఈ అరెస్టుకు వస్తుందా అని పార్టీలోనేచాలామంది మాట్లాడుకుంటున్నారు.
నాలుగేళ్లు చంద్రబాబు జనంలోనే ఉన్నారు. ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అరెస్టు అయితే అయింది గానీ అంతకుమించి ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు రాని సానిభూతి అరెస్ట్ అవగానే వస్తుందా అన్నది అనుమానమే. పార్టీలో ఒక వర్గం అయితే మాత్రం చంద్రబాబు జైలు కెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తేనే మంచిదని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అప్పుడైనా జనంలో సానుభూతి వచ్చి ఈసారి గెలిచి తీరుతామని భావిస్తున్నారు. వైసిపి మాత్రం పరిస్థితిని మొత్తం గమనిస్తోంది. అందరూ అనుకున్నట్టుగా సానుభూతి రాదు.. అవి ఓట్లుగాను మారదు అని ఆ పార్టీ ధీమాగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టు అయ్యాడు అన్న బాధ కంటే.. ఈ సంఘటన సానుభూతి ఓటు తెస్తుందన్న ఆశ టిడిపి నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.